ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'జేబులు నిల్‌ ఖజానా ఫుల్‌'.. మద్యం సొమ్ముపై సర్కారు కన్ను! - Liquor sales

State Govt Revenue on Liquor: ఖజానా నింపటానికి రాష్ట్ర ప్రభుత్వం మందు బాబుల జేబులు కొల్లగొట్టడమే లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కనీసం 33 వేల కోట్ల రూపాయల విలువైన మద్యం అమ్మడం ద్వారా ఆదాయాన్ని రాబట్టాలని భావిస్తోంది. మద్యం విక్రయంతో ఒక్క స్టేట్‌ ఎక్సైజ్‌ సుంకం పద్దు కిందే 18 వేల కోట్ల ఆదాయం రాబట్టాలని బడ్జెట్‌లో ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది.

State Govt Revenue on Liquor
State Govt Revenue on Liquor

By

Published : Mar 17, 2023, 11:47 AM IST

మద్యం సొమ్ముపై సర్కారు కన్ను.. మందు బాబుల జేబులు కొల్లగొట్టడమే లక్ష్యంగా!

State Govt Revenue on Liquor: వచ్చే ఆర్థిక సంవత్సరంలో కనీసం 30 వేల కోట్ల నుంచి 33 వేల కోట్ల రూపాయలు విలువైన మద్యం అమ్మడం ద్వారా ఆదాయాన్ని పిండుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. మద్యం విక్రయాల ద్వారా ఒక్క స్టేట్‌ ఎక్సైజ్‌ సుంకం పద్దు కిందే 2023-24 ఆర్థిక సంవత్సరంలో 18 వేల కోట్ల ఆదాయం రాబట్టాలని బడ్జెట్‌లో ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మద్యం విక్రయాల విలువలో స్టేట్‌ ఎక్సైజ్‌ కాకుండా అదనంగా వ్యాట్‌, స్పెషల్‌ మార్జిన్‌ వంటి ఇతరత్రా పన్నులు కూడా ఉంటాయి. వాటి రూపంలో మరో 7 వేల నుంచి 8 వేల కోట్ల వరకూ ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. ఈ లెక్కన ఒక్క ఏడాదిలో మద్యం ద్వారా 25 వేల నుంచి 26 వేల కోట్ల వరకూ ఆదాయం లభిస్తుందని అంచనా. ప్రజల్ని మరింతగా మద్యం తాగించడం ద్వారా వీలైనంత ఎక్కువగా ఆదాయం రాబట్టుకుంటామని ప్రభుత్వం చెప్పకనే చెప్పింది..

దశలవారీ మద్య నిషేధం అమలు చేస్తామని.. 2024 నాటికి కేవలం 5 నక్షత్రాల హోటళ్లకు మాత్రమే మద్యం పరిమితం చేస్తామని ప్రతిపక్ష నేత హోదాలోనూ, అధికారం చేపట్టాక కూడా పలుమార్లు జగన్‌ హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడు దశలవారీ మద్యనిషేధం హామీకి ముఖ్యమంత్రి జగన్‌ ప్రభుత్వం మంగళం పాడేసినట్లే కనిపిస్తోంది. ఏటేటా మద్యం ద్వారా ఆదాయాన్ని పెంచుకుంటూ పోతోంది. రాబడి లక్ష్యాలను కూడా పెంచుతోంది. 2022-23లో స్టేట్‌ ఎక్సైజ్‌ పద్దు కింద 16,167 కోట్ల రాబడి వస్తుందని సవరించిన అంచనాల్లో పేర్కొన్న ప్రభుత్వం.. 2023-24లో ఇదే పద్దు కింద 18,000 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసింది. అంటే కొత్త ఆర్థిక సంవత్సరంలో అదనంగా 1,833 కోట్ల రూపాయలు రావాలని లక్ష్యంగా నిర్దేశించింది.

2019-20లో 20,928 కోట్లు, 2020-21లో 20,189 కోట్లు, 2021-22లో 25,023 కోట్ల రూపాయల విలువైన మద్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం విక్రయించింది. 2022-23లో ఇప్పటి వరకూ 26,500 కోట్ల మద్యం అమ్మగా.. ఈ ఆర్థిక సంవత్సరం పూర్తయ్యేసరికి 28 వేల కోట్ల విలువైన మద్యం అమ్ముతుందని అంచనా. మద్యం దుకాణాల సంఖ్యను తగ్గించామని చెబుతున్న ప్రభుత్వం.. అందుకు భిన్నంగా ఏటేటా మద్యం విక్రయాలు, ఆదాయాన్నీ పెంచుకుంటోంది. రాబోయే కొన్నేళ్లలో మద్యంపై వచ్చే ఆదాయాన్ని హామీగా చూపించి ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ బెవరేజస్‌ కార్పొరేషన్‌ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వేల కోట్లు అప్పు చేసింది. ఏపీఎస్‌బీసీఎల్‌ బాండ్లను వేలం వేసి అధిక వడ్డీకి 8,300 కోట్ల రుణం తీసుకొచ్చింది. ఈ అప్పులు తీర్చాలంటే మద్యం అమ్మకాలను పెంచుకోవడం ద్వారా మాత్రమే సాధ్యమనే మాట వినిపిస్తోంది. మద్యంపై వచ్చే ఆదాయాన్ని చేయూత, అమ్మఒడి, ఆసరా వంటి సంక్షేమ పథకాలకు వినియోగిస్తామని, ఆ అమలు బాధ్యతను ఏపీఎస్‌బీసీఎల్‌కు అప్పగించింది. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం చట్ట సవరణే చేసింది. మద్యం ఆదాయాన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమ పథకాలకు వినియోగిస్తామని పేర్కొంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details