Government has approved the transfers of government teachers: రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీలు, ఇతర అంశాలపై విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఉపాధ్యాయ సంఘాలతో సమావేశమయ్యారు. విజయవాడలోని సమగ్ర శిక్ష అభియాన్ కార్యాలయంలో సుమారు నాలుగు గంటలకు పైగా చర్చలు జరిపారు. రెండు సవరణలకు ఈ సమావేశంలో ఆమోదం తెలిపారు. హేతుబద్దీకరణ, పాఠశాలల మ్యాపింగ్ కారణంగా నష్టపోతున్న ఉపాధ్యాయులందరికీ అదనపు పాయింట్లు ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు కోరారు. 2021లో బదిలీలు పొంది, ఇప్పుడు హేతుబద్దీకరణ, మ్యాపింగ్‌తో బదిలీకి గురవుతున్న వారికి పాత స్టేషన్ పాయింట్లు ఇవ్వాలని విన్నవించారు. వీటికి ప్రాథమికంగా అధికారులు ఆమోదం తెలిపారు. ప్రభుత్వంలో విలీనమైన ఎయిడెడ్ ఉపాధ్యాయులకు స్టేషన్, సర్వీసు పాయింట్లు ఇవ్వాలని చర్చల్లో నాయకులు విన్నవించారు. ప్రతి ఉన్నత పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడు, వ్యాయామ ఉపాధ్యాయుడిని నియమించాలని కోరారు.
బైజూస్ సంస్థ ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని సీబీఎస్‌ఈ సిలబస్‌లో చరిత్ర వక్రీకరణలు జరుగుతున్నాయని యూటీఎఫ్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు విమర్శించారు. సీబీఎస్‌ఈపై సమగ్రంగా చర్చ జరగాలని అని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 2లక్షల మంది ఉపాధ్యాయులు ఉంటే ఇందులో 140మందికి సిఫార్సు బదిలీలు చేస్తే అవి ఏ మాత్రమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఉపాధ్యాయ సంఘాల నాయకులతో నిర్వహించిన చర్చల అనంతరం మీడియాతో మాట్లాడారు. 140మంది బదిలీలను అదేదో భూతద్దంలో పెట్టి 1.40లక్షలు చేస్తున్నట్లు అడుగుతున్నారని దీనిపై ఏవరైనా నవ్వుతారని అన్నారు.