Government employee unions on OPS: సీపీఎస్‌పై చర్చించేందుకే సమావేశమని 21 ఉద్యోగసంఘాల నేతలకు తొలుత సమాచారం పంపిన ప్రభుత్వం... తర్వాత ఉద్యోగుల సమస్యలపైనే చర్చిద్దామని పిలిచింది. సీపీఎస్ ఉద్యోగుల సంఘం, సీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్, ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య మినహా మిగిలిన సంఘాలు ఈ భేటీకి హాజరయ్యాయి. సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో మంత్రులు బొత్స, ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృ ష్ణారెడ్డి, చంద్రశేఖరరెడ్డి ఉద్యోగుల సమస్యలపై చర్చించారు.
ఉద్యోగులు సమస్యలపైనా ఏ విషయంలోనూ మంత్రులు స్పష్టత ఇవ్వలేదు. చూద్దాం, చేద్దాం, సీఎంతో చర్చించి చెబుతా మనే వైఖరిలోనే సాగిందని కొందరు ఉద్యోగ సంఘాల నాయకులు తెలిపారు. బిల్లులు నెలలోపు చెల్లిస్తామనే విషయంలోనూ స్పష్టత ఇవ్వలేదన్నారు. మరోవైపు ఉద్యోగుల ఇబ్బందులను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రి బొత్స తెలిపారు.
ఉద్యోగులకు 2018 నుంచి చెల్లించాల్సిన బకాయిల్లో కొంత మొత్తాన్ని సంక్రాంతి లోపు, మిగతా వాటిని మార్చిలోపు చెల్లిస్తామని మంత్రివర్గ ఉపసంఘం హామీ ఇచ్చినట్లు ఉద్యోగసంఘాల నేతలు వెల్లడించారు. ఉపాధ్యాయుల బదిలీలపై అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు అంగీకారం తెలిపారని వివరించారు. ప్రతినెలా జీతాలు, పింఛన్లు ఒకటో తేదీన రాకపోవడం బాధాకరమన్న ఉద్యోగసంఘాల నేతలు.. ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణపై చర్చించినట్లు చెప్పారు.