Government Backs Down on Online Registration in AP :ఈ నెల 15 తర్వాత ఆన్‌లైన్‌లో మాత్రమే రిజిస్ట్రేషన్లు చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోందని దస్తావేజు లేఖరులు పెన్‌డౌన్ చేయడంతో ప్రభుత్వం దిగొచ్చింది. ఆన్‌లైన్ ద్వారానే కాకుండా ప్రస్తుతం ఉన్న విధానంలోనూ దస్తావేజుల రిజిస్ట్రేషన్ విధానాన్ని యథావిధిగా కొనసాగిస్తామని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఆన్‌లైన్ ద్వారా జరిగే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్‌ను జిరాక్స్‌గా వ్యవహరించకూడదని, భూపరిపాలన శాఖ ప్రధాన కమిషనర్ సాయి ప్రసాద్ వివరణ ఇచ్చారు. డిజిటల్ విధానంలో దాన్ని ఒరిజనల్ డాక్యుమెంట్‌గానే పరిగణించాలని, ఈ విధానానికి చట్టబద్ధత ఉందని తెలిపారు.
"డాక్యుమెంట్‌పై ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ ఉంటుంది. ఈ డాక్యుమెంట్‌పై అమ్మకందారుని పిజికల్ సంతకం కూడా ఉంది.ఒరిజినల్ ప్రాసెస్ ఎలక్ట్రానిక్ సిగ్నేచర్తోనే జరుగుతుంది. అమ్మిన వారికి డాక్యుమెంట్ కావాలంటే మా దగ్గర ఉన్న డాక్యుమెంట్ ప్రింట్ చేసి సంతకం చేయించి ఇస్తాం. ఫిజకల్ కాఫీ ఇస్తాం."- సాయి ప్రసాద్, ప్రధాన కమిషనర్ , భూ పరిపాలన శాఖ
Physical Document Registration as Usual : నూతన ఆన్‌లైన్ విధానాన్ని ప్రస్తుతం రాష్ట్రంలోని 24 సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మాత్రమే అమలు చేస్తున్నామని రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ ఐజీ రామకృష్ణ వెల్లడించారు. కొత్త విధానాన్ని ప్రవేశపెట్టినప్పటికీ ఫిజికల్ డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్‌లను ఆపలేదని తెలిపారు. రిజిస్ట్రేషన్ శాఖ వెబ్‌సైట్‌లో డేటా ఎంట్రీ చేసుకొని వస్తే తదుపరి ప్రాసెస్ సులువుగా జరుగుతుందని అన్నారు.
New Online Registration Problems in AP: కొత్త రిజిస్ట్రేషన్ విధానం.. వినియోగదారుల గందరగోళం
నూతన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విధానంపై పలువురు బిల్డర్లు, తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విజయవాడలో క్రెడాయ్, నరెడ్కో, భాయ్ ఆధ్వర్యంలో నూతన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విధానంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన స్టాంపుల శాఖ ఐజీ రామకృష్ణ ఎదుట సమస్యలు ఏకరువు పెట్టారు. ఇది పారిశ్రామికవేత్తలకు తప్ప.. సామాన్యులకు అనుకూల విధానం కాదని అన్నారు.
నూతన రిజిస్ట్రేషన్ విధానంలో లోటుపాట్లు సవరించి సమర్థంగా అమలు చేయాలని స్థిరాస్తి వ్యాపారులు , ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
"స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ "కార్డ్ ప్రైమ్ ఓ" అనే నూతన సాఫ్ట్ వేర్ని తీసుకురావడం జరిగింది. దీని గురించి అవగాహన తీసుకురావడానికి రియల్ ఎస్టేట్‌లో ఉన్న స్టేక్ హోల్డర్స్‌ని పిలిచాము. వారందరికీ కార్డ్ ప్రైమ్ ఓ సాఫ్ట్ వేర్ ఉపయోగాలు, ఎలా సులువుగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చో వివరించడం జరిగింది. పాత విధానంలో కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కొత్త విధానంలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. పాత విధానాన్ని మేము ఆపలేదు."- రామకృష్ణ, స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ
ఆన్లైన్ విధానంలో ముఖ్యాంశాలు:
- రిజిస్ట్రేషన్ శాఖ వెబ్‌సైట్ ద్వారా దస్తావేజులను తయారుచేసుకోవచ్చు.
- వెబ్‌సైట్‌లోనే స్లాట్ బుక్ చేసుకొని నేరుగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చి..రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు.
- రిజిస్ట్రేషన్ శాఖ వెబ్‌సైట్‌లో వివరాలు నమోదుచేసుకొని, తీసుకున్న ప్రింట్‌తో నేరుగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి కూడా రావొచ్చు.
- దస్తావేజు లేఖరులైనా సొంత విధానం ద్వారా కాకుండా రిజిస్ట్రేషన్ శాఖ వెబ్‌సైట్ ద్వారా మాత్రమే దస్తావేజులు తయారుచేయాలి.
- సర్వే నెంబరు, ఇతర వివరాలను నమోదుచేయడం ద్వారా ఆ ప్రాంతాల మార్కెట్ విలువలు, స్టాంపు డ్యూటీ వివరాలు తెలిసిపోతాయి. క్యాలికులేటర్ ద్వారా సులువుగా వివరాలు తెలుసుకోవచ్చు.
- ఆస్తుల వివరాలకు సంబంధించి సర్వే నెంబర్లు నమోదుచేయగానే వెబ్‌ల్యాండ్ నుంచి స్థల స్వభావం, ఇతర వివరాలు కనిపిస్తాయి. మున్సిపల్/కార్పొరేషన్ ఆస్తుల విషయంలో ఇలాగే జరుగుతుంది.