ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రెండు రాష్ట్రాలు కలిసి ఉండాలనేదే మా విధానం: సజ్జల

Sajjala Ramakrishna Reddy: సుప్రీంకోర్టులో రాష్ట్ర విభజనపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్​కుమార్​ వేసిన పిటిషన్​ విచారణపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకించిన పార్టీ వైసీపీ అని.. మళ్లీ రెండు రాష్ట్రాలు కలిసి ఉండాలనేదే వైసీపీ విధానమని అన్నారు.

Sajjala Ramakrishna Reddy
సజ్జల రామకృష్ణా రెడ్డి

By

Published : Dec 8, 2022, 3:21 PM IST

Updated : Dec 9, 2022, 9:55 AM IST

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

Sajjala Ramakrishna Reddy: ‘అప్పుడూ, ఇప్పుడూ మా విధానం సమైక్య రాష్ట్రమే.. కుదిరితే ఏపీ ఉమ్మడిగా ఉండాలనేదే మా కోరిక.. ఏపీ మళ్లీ ఉమ్మడి రాష్ట్రం కాగలిగితే మొదట స్వాగతించేది వైకాపానే’ అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ‘కుదిరితే ఏపీ ఉమ్మడిగా ఉండాలన్నదే మా విధానం.. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా మొదటి నుంచీ పోరాటం చేసింది వైసీపీనే. కాలచక్రాన్ని వెనక్కి తిప్పగలిగితే.. రాష్ట్రం మళ్లీ కలవాలని సుప్రీం చెబితే.. అంతకంటే కావాల్సింది ఏముంటుంది?’ అని వ్యాఖ్యానించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఉండవల్లి అరుణ్‌కుమార్‌ ‘2014 విభజన చట్టం అసంబద్ధం’ అనే అంశంపై కేసు వేసినట్లున్నారు. ఇంతకాలం తర్వాత ఆయన ఇప్పుడే ఎందుకు స్పందించారు? రాష్ట్ర ప్రభుత్వంపై ఆయన వ్యాఖ్యలు అసంబద్ధంగా ఉన్నాయి. ఆయన పనిగట్టుకుని ముఖ్యమంత్రి జగన్‌ను విమర్శించారని అనిపిస్తోంది.

ఉండవల్లి చెబుతున్నట్లు.. కోర్టులో విభజన కేసు విచారణ సమయంలో రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది చెప్పారంటున్న విషయం సాంకేతిక అంశం మాత్రమే. జరగాల్సిన రీతిలో విభజన జరగలేదనే అంశంపై కాలచక్రాన్ని వెనక్కి తీసుకెళ్లగలిగితే లేదా అసెంబ్లీ తీర్మానం, ఆర్టికల్‌ 3 ప్రకారం విభజన జరగలేదు కనుక మళ్లీ కలవండని సుప్రీంకోర్టు చెబితే, అంతకంటే కావాల్సింది ఏముంది? కానీ, రాష్ట్రం విడిపోయి ఇంతదూరం వచ్చిన తర్వాత.. పెండింగ్‌ అంశాలపైనే పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఉండవల్లికి అనుమానమెందుకు వచ్చిందో కానీ, మా నాయకుడు జగన్‌ది ఒకటే విధానం. మళ్లీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాగలిగితే ముందుగా స్వాగతించేది వైసీపీనే. ఎప్పుడైనా సరే కుదిరితే ఉమ్మడి రాష్ట్రంగా ఉండాలని వైసీపీ ప్రభుత్వమూ కోరుకుంటుంది.. కానీ, ప్రాక్టికల్‌గా రాష్ట్రం విడిపోయి ఇంతదూరం వచ్చిన తర్వాత పెండింగ్‌ అంశాలపై పోరాటం చేయాల్సిన అవసరం ఉంది.

రాష్ట్ర విభజన చేసి ఏపీకి అన్యాయం చేసింది అప్పట్లో కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌, ప్రతిపక్షంలోని భాజపా, వారికి సహకరించిన తెదేపాలే.. విభజనకు వ్యతిరేకంగా చివరి నిమిషం వరకు పోరాడింది వైసీపీనే.. అయినా విభజన జరిగింది, విభజన హామీల సాధన కోసం వైసీపీ పోరాటం చేస్తూనే ఉంది. ఉండవల్లికి అనుమానమెందుకు వచ్చిందో కానీ, మా నాయకుడు జగన్‌ది ఒకటే విధానం.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడడానికి ఎలాంటి అవకాశం వచ్చినా ముందుగా స్వాగతించేది వైసీపీనే. విభజనకు వ్యతిరేకంగా కోర్టుల్లో మా వాదనలను బలంగా వినిపిస్తాం.. రాష్ట్ర విభజనను వెనక్కు తిప్పాలి లేదా జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని గట్టిగా కోరతాం.. రాజ్యాంగానికి అనుగుణంగా ప్రభుత్వాలు డీల్‌ చేసే విధానం వేరుగా ఉంటుంది. ఇది ఉద్యమం కాదు కాబట్టి అలా చేయలేం. ఉండవల్లి ఎనిమిదేళ్ల క్రితం కోర్టులో వేసిన కేసు ఇప్పుడు విచారణకు వచ్చింది. ఇప్పుడు మనం వెనక్కి తిరిగి చెన్నై కావాలని వెనక్కి పోలేం కదా. ఈ విషయం ఉండవల్లికి కచ్చితంగా తెలుసు.. తెలిసినా ఇలా మాట్లాడితే మేం కూడా ప్రతిస్పందించాల్సి వస్తుంది’ అని వ్యాఖ్యానించారు.

సీఎం మాట్లాడుతుంటే ముందుకొచ్చారు

‘జయహో బీసీ’ సభలో ముఖ్యమంత్రి జగన్‌ మాట్లాడుతున్నపుడు వెనక కుర్చీల్లో ఉన్నవారు ముందుకు వచ్చారు, కొంతమంది అటూఇటూ వెళ్లి ఉండొచ్చు, మరికొందరు భోజనాలకు వెళ్లడం వల్ల కుర్చీలు ఖాళీగా ఉండగా.. సీఎం మాట్లాడుతుంటే కుర్చీలు ఖాళీ అయ్యాయంటూ ప్రతిపక్షాలు విషం కక్కుతున్నాయి’ అని సజ్జల వ్యాఖ్యానించారు. బీసీల్లాగే త్వరలో ఎస్సీ, మైనారిటీల సభలను నిర్వహిస్తాం అని సజ్జల ప్రకటించారు.

"విభజనకు వ్యతిరేకంగా కోర్టులో తమ వాదనలు బలంగా వినిపిస్తాం. రాష్ట్ర విభజనను వెనక్కి తిప్పాలి, లేదంటే సరిదిద్దాలని గట్టిగా కోరతాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కలసి ఉండాలన్నదే ఇప్పటికీ మా విధానం..రాష్ట్ర విభజన చేసిన తీరుపైనే న్యాయస్థానంలో కేసు వేశారు. విభజన చట్టంలో హామీల అమలుపై పోరాటం చేస్తూనే ఉన్నాం. రెండు రాష్ట్రాలు కలిసుండాలని సుప్రీంకోర్టు ఆదేశిస్తే.. అంతకంటే ఏం కావాలి..రెండు రాష్ట్రాలు కలిసేందుకు వైసీపీ పోరాటం చేస్తోంది." సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు

మీ ప్రాంత అభివృద్ధి సంగతి చూస్కోండి: షర్మిల

ఎంతోమంది బలిదానాలు, త్యాగాల మీద ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ అని, రెండు రాష్ట్రాలు కలవడం అసాధ్యమని వైఎస్‌ షర్మిల గురువారం ట్విటర్‌లో పేర్కొన్నారు. ‘సజ్జల వ్యాఖ్యలు అర్థం లేనివి. కొన్ని ఘటనలు చరిత్రలో ఒకసారే జరుగుతాయి. విడదీసిన రాష్ట్రాలను ఎలా కలుపుతారు? మీరు ధ్యాస పెట్టాల్సింది రెండు రాష్ట్రాలను కలపడంపై కాదు. మీ ప్రాంత అభివృద్ధి మీద. మీ హక్కుల కోసం పోరాటం చేయండి. మీ ప్రాంతానికి న్యాయం చేయండి. అంతేకానీ తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడటం మీకు తగదు’ అని ఆమె పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Dec 9, 2022, 9:55 AM IST

ABOUT THE AUTHOR

...view details