Gannnavaram MLA Vamshi: అది వారసత్వంగా సంక్రమించిన డీఫారం పట్టా భూమి. జాతీయ రహదారికి పక్కనే ఉన్న ఆ భూమి విలువ దాదాపు కోటి రూపాయలు పైనే. అయితే తెలుగుదేశం పార్టీ నాయకులకు చెందిన ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలని, నివేశన స్థలాలకు పంపిణీ చేయాలని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆదేశాలు ఇవ్వడమే కాదు.. ఇంజంక్షన్ ఆర్డర్ ఉన్న భూమిలోకి అధికారులతో వెళ్లి హల్‌చల్ చేశారు. ఈ సంఘటన ఎన్టీఆర్ జిల్లా గన్నవరం మండలం వెదురు పావులూరులో గురువారం జరిగింది.
తహశీల్దారు, పోలీసులతో గన్నవరం మండల టీడీపీ అధ్యక్షుడు జాస్తి వెంకటేశ్వరరావు భూమిని పరిశీలించి, వెంటనే పంపిణీకి చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. దీనిపై ఇంజంక్షన్ ఆర్డర్ ఉందని, న్యాయ సలహా తీసుకోవాలని అధికారులు చెబుతున్నా.. ‘అవన్నీ మామూలే.. వెంటనే సర్వే చేసి పంపకాలు చేయండి’ అని ఆదేశించారు. వెదురు పావులూరులో జాస్తి వెంకటేశ్వరరావుకు సర్వే నంబరు 308/4లో 99 సెంట్ల డి.పట్టా పొలం ఉంది. దీనికి ఆనుకొని ఆయన స్వార్జితం పట్టా భూమి సర్వే నంబరు 305/15లో 56 సెంట్లు ఉంది. 308/4 భూమిని అధికారులు స్వాధీనం చేసుకోవాలని ఎప్పటినుంచో ఎమ్మెల్యే ఒత్తిడి చేస్తున్నారు. ఇది తెలిసిన జాస్తి వెంకటేశ్వరరావు న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఇంజంక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నారు. ఈ భూమికి వెంకటేశ్వరరావు తల్లి జాస్తి రాజేశ్వరమ్మ పేరుతో 1997లో డి.పట్టా జారీ చేశారు. ఆమె 2018లో చనిపోయారు. తర్వాత వారసత్వంగా వెంకటేశ్వరరావుకు సంక్రమించింది. రెవెన్యూ అధికారులు ఆయన పేరు మీదకు మార్చారు.