Gandhi's Death Anniversary: ప్రస్తుతం దేశంలో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మాట్లాడితే ఎన్నో ప్రతిబంధకాలను ఎదుర్కోవాల్సి వస్తుందని తమిళనాడు మాజీ గవర్నర్ పి. రామ్మోహనరావు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా మొఘల్రాజ్ పురంలోని సిద్దార్థ కళశాలలో ఆంధ్రప్రదేశ్ గాంధీ స్మారక నిధి ఆధ్వర్యంలో గాంధీజీ 75వ వర్థంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గాంధీజీ ఎక్కడికైనా వెళ్లాలంటే బ్రిటిష్ పాలకులు అప్పట్లో ప్రత్యేక రైలు నడిపేవారని చెప్పారు.
గ్రామ స్వరాజ్యం కావాలని గాంధీజీ కలలు కన్నారని.. దానికి అనుగుణంగానే అనేక కార్యక్రమాలు నిర్వహించారని గుర్తు చేశారు. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సహాయ నిరాకరణ ఉద్యమం చేపట్టి ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని నింపారని తెలిపారు. పారిశ్రామిక వర్గాలకు సామాజిక బాధ్యత ఉండాలని గాంధీకి అప్పుడే చెప్పారని అన్నారు. ఆదానీలను విమర్శించే వాళ్లను తాను సమర్ధించనని.. వాళ్లు స్థాపించిన పరిశ్రమల వల్ల లక్షలాది మంది జీవిస్తున్నారని పేర్కొన్నారు.