Fully Damaged Flyovers in Vijayawada: జగన్ ఏలుబడిలో రోడ్లపై సాఫీగా ప్రయాణం ఎలాగూ సాధ్యం కాదు.. కనీసం ఫ్లైఓవర్‌పైనైనా దూసుకుపోదామనుకుంటే నేరుగా నరకంలోకి వెళ్లినట్లే. పైవంతెనలు కట్టేస్తే చాలు.. అవి ఎలా ఉంటే తమకేంటి అనుకుంటారో ఏమో.. కనీసం ఎలా ఉన్నాయో.. ప్రయాణికుల అవస్థలు ఏంటో పట్టించుకోరు. నాలుగున్నరేళ్లుగా నిర్వహణకు నోచుకోక ఫ్లైఓవర్లు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. రహదారిపై ఇనుప ఊచలు పైకి లేచి ప్రమాదాలు జరుగుతున్నా ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. పాలకులు, అధికారుల నిర్లక్ష్యానికి విజయవాడలోని పైవంతెనలే నిదర్శనం.
బెంబేలెత్తిపోతున్న ప్రయాణికులు: అడుగడుగునా గుంతలు.. రోడ్డుపై తారు పైకి లేచి బయటకు వచ్చిన ఇనుప ఊచలు.. దీనికి 'జగనన్న గుంతల పథకం' అని పేరు పెడితే సరిగ్గా సూటవుతుంది. విజయవాడ రామవరప్పాడు రింగ్ రోడ్డు నుంచి నున్న, గొల్లపూడి బైపాస్ వైపు వెళ్లే మార్గంలోని రెండు పైవంతెనల పరిస్థితి అధ్వానంగా మారింది. వీటిపై నుంచి వెళ్లాలంటేనే ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు.
Damaged Roads in Guntur: "గుంటూరు గుంతల లోతు తెలియడం లేదు.. దేవుడిపైనే భారం వేశాం!"
పాలకులు కళ్లకు గంతల కట్టుకున్నారా..?: వంతెనలు శిథిలావస్థకు చేరి రహదారి ఛిద్రమైంది. భారీ గుంతలు వాహనదారులకు నరకం చూపిస్తున్నాయి. పెద్దపెద్ద గుంతలు, కంకర తేలి ఇనుప ఊచలు పైకి నిక్కబొడుకొచ్చాయి. ఈ దారిలో ప్రయాణమంటేనే నరకప్రాయమే. వర్షమొస్తే పరిస్థితి మరీ దారుణం. నీరు నిలబడి గుంతలు ఎక్కడున్నాయో కూడా కనిపించవు. ప్రయాణికులు కిందపడిన ఘటనలూ ఉన్నాయి. ఇంత జరుగుతున్నా పాలకులు కళ్లకు గంతలు కట్టుకున్నారు.