FREE TIFFA SCANNING FOR PREGNANT WOMEN : మిషన్ స్మైల్ సంస్థ, విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి సంయుక్తంగా ఓ వినూత్న కార్యక్రమం చేపట్టారు . గ్రహణం మొర్రి వచ్చిన 18 మంది చిన్నారులకు ఉచితంగా శస్ర్తచికిత్స చేసి.. వారికి చిరునవ్వులను అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా 35 వేల మంది చిన్నారులు ఈ తరహా సమస్యలతో బాధపడుతున్నారని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు అన్నారు. తల్లీబిడ్డల ఆరోగ్య సంరక్షణ చర్యల్లో భాగంగా గర్భిణులకు ఉచితంగా ‘టిఫా’ (టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫీటల్ ఎనామలిటీస్) స్కానింగ్ సౌకర్యాన్ని అందుబాటులో తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఈ స్కానింగ్ ద్వారా గర్భస్థ శిశువుల లోపాలను గుర్తించి, ముందుగానే జాగ్రత్త పడేందుకు వీలవుతుందన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో రేడియాలజిస్టులు ఉన్న చోట ఈ టిఫా స్కానింగ్ సేవలను అందుబాటులోకి తెస్తామన్నారు. ఆరోగ్యశ్రీ అనుబంధ ఆసుపత్రుల్లో ఈ సౌకర్యం త్వరలోనే వస్తుందన్నారు. గర్భిణుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించేందుకు ప్రత్యేక కాల్‌సెంటర్ ద్వారా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు.