Fraud in the Name of Extra Income : ఖాళీ సమయాన్ని ఆదాయంగా మార్చుకోండి. ఇంట్లో ఉండి కొద్దిసేపు పనిచేస్తే చాలు నెలకు భారీగా నగదు సంపాదించవచ్చని సైబర్ కిలాడీలు అమాయకులకు వల వేస్తున్నారు. విజయవాడలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తోన్న ఓ యువతికి.. ఓ రోజు ఆమెకు పార్ట్‌టైమ్ జాబ్ పేరిట మొబైల్‌కు సందేశం వచ్చింది. అందులో ఉన్న నెంబర్‌కు ఫోన్ చేయగా.. యూట్యూబ్‌లో వీడియోలను లైక్ చేస్తే.. డబ్బులు బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని నమ్మించారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేయటమే కాకుండా.. ఇది కూడా చేస్తే మరింత సంపాదించవచ్చని ఆమె ఆశపడింది. మోసగాళ్లు చెప్పింది నిజమని నమ్మి వారు ఇచ్చిన వెబ్‌సైట్‌కు బ్యాంకు ఖాతా వివరాలు ఇచ్చింది. అనంతరం యూట్యూబ్‌లో మూడు వీడియోలు లైక్ చేసింది. ఆమె ఖాతాలో 150 రూపాయలు జమ చేశారు. మరో ఆరు వీడియోలను లైక్ చేస్తే.. 300 రూపాయలు ఖాతాలో జమ చేసి నమ్మించారు.
ఇదే కాకుండా బిట్ కాయిన్స్‌లో పెట్టుబడి పెడితే అధిక లాభం వస్తుందని చెప్పడంతో.. విడతల వారిగా యువతి 19 లక్షల రూపాయలు మోసగాళ్ల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసింది. 21 లక్షల రూపాయలు వస్తాయని వర్చ్యువల్‌గా చూపుతున్నా.. ఆ డబ్బును డ్రా చేసే అవకాశం లేకపోవడంతో దీనిపై ఆమె నిలదీయగా.. ఆ మొత్తాన్ని తిరిగి పొందాలంటే 12 లక్షల 95 వేల రూపాయలు కట్టాలని చెప్పారు. లేదంటే కట్టిన డబ్బు తిరిగి రాదని చెప్పడంతో.. మోసపోయానని భావించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.