Frauds in the name of recovery agents: ఎన్టీఆర్ జిల్లాలోని పోలీసు కమిషనరేట్ పరిధిలో ఇటీవల.. ఒకే రోజు పట్టపగలు జరిగిన మూడు వరుసచోరీలు సంచలనం సృష్టించాయి. పగటి పూట తాళం వేసి ఉన్న ఫ్లాట్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడ్డారు. మూడు ఘటనల్లో దాదాపు రూ.12.98 లక్షల విలువైన బంగారు ఆభరణాలతో పాటు, నగదును చోరీ చేశారు. ఈ ముఠా కేవలం అపార్ట్‌మెంట్లనే ఎంచుకుని తమ పని కానిస్తున్నారు. గుంటుపల్లి, గొల్లపూడి మధ్య రెండు, మూడు అపార్ట్‌మెంట్లలోనూ ఈదొంగలు చోరీకి ప్రయత్నించారు. వాటిలోని వాచ్‌మెన్లు ప్రశ్నించడంతో తాము లోన్ రికవరీ ఏజెంట్లమని చెప్పి.. ఏదొక ఫ్లాట్‌కు వెళ్లేందుకు ప్రయత్నించారు. సంబంధిత ఫ్లాట్ యజమాని పేరు చెప్పమని గట్టిగా నిలదీసే సరికి.. తప్పించుకుని వెళ్లిపోయారు.
Daytime robberies in ntr district: నలుగురు దొంగలు తాము వచ్చిన కారులోనే వెళ్లిపోయినట్లు సీసీ కెమెరాల్లోని దృశ్యాల ఆధారంగా పోలీసులు గుర్తించారు. 28వ తేదీ సాయంత్రం 4 గంటల సమయంలో హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై తిరిగి ఇబ్రహీంపట్నం మీదుగా మైలవరం వైపు పరారయ్యారు. అక్కడి నుంచి దొంగల ఆనవాళ్లు దొరకలేదు. నలుగురు సభ్యులతో కూడిన దొంగల ముఠా ఎన్టీఆర్ జిల్లాలోకి జులై, 28న ప్రవేశించింది. హైదరాబాద్ వైపు నుంచి వచ్చి.. అదే రోజు సాయంత్రం ఎన్టీఆర్ జిల్లా పరిధిలో మూడు దొంగతనాలు చేసి పరారయ్యారు. ఈ ముఠా జిల్లాలోకి చిల్లకల్లులో ప్రవేశించిన సమయంలో తీసుకున్నసీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా కారు నెంబరు గురించి ఆరా తీయగా.. అది తప్పుడు నెంబరు అని తేలింది. పోలీసులను తప్పుదారి పట్టించేందుకే ఇలా చేసినట్లు అనుమానిస్తున్నారు.