New Governors : పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను కేంద్రం నియమించింది. ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా జస్టిస్ అబ్దుల్ నజీర్ నియమితులయ్యారు. గతంలో ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. ఆయోధ్య తీర్పు ఇచ్చిన ఐదుగురు జడ్జిల బెంచ్‌లో ఆయన ఒకరు. మొత్తం 12 మంది గవర్నర్ల నియామకానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. ఏపీ గవర్నర్‌గా ఉన్న బిశ్వభూషణ్ హరిచందన్‌ను ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా నియమించారు.
ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా జస్టిస్ అబ్దుల్ నజీర్ నియామకం
09:39 February 12
బిశ్వభూషణ్ హరిచందన్ ఛత్తీస్‌గఢ్‌కు బదిలీ
ఇక అనేక రాష్ట్రాలకూ కొత్త గవర్నర్లను నియమించారు రాష్ట్రపతి ముర్ము. మొత్తంగా 12 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి కొత్త గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి భవన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మహారాష్ట్ర కొత్త గవర్నర్‌గా రమేశ్ బైస్ను నియమించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. మహారాష్ట్ర ప్రస్తుత గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ చేసిన రాజీనామాను ఆమోదించారు. ఇప్పటివరకు ఝార్ఖండ్ గవర్నర్‌గా ఉన్నారు రమేశ్. అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా లెఫ్టినెంట్ జనరల్ కైవాల్య త్రివిక్రమ్ పర్నాయక్, సిక్కిం గవర్నర్‌గా లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, ఝార్ఖండ్ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్, అసోం గవర్నర్‌గా గులాబ్ చంద్ కటారియా, హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా శివ్ ప్రతాప్‌లను నియమిస్తూ రాష్ట్రపతి భవన్ ప్రకటన విడుదల చేసింది. మరోవైపు, లద్దాఖ్ ఎల్జీగా ఉన్న ఆర్కే మాథుర్ రాజీనామాను ముర్ము ఆమోదించారు. అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా ఉన్న బ్రిగేడియర్ బీడీ మిశ్రను ఆయన స్థానంలో నియమించారు ముర్ము.
రాష్ట్ర కొత్త గవర్నర్‌గా నియమితులైన జస్టిస్ అబ్దుల్ నజీర్.. 1958 జనవరి 5న కర్ణాటకలోని బెలువాయిలో జన్మించారు. మంగళూరులో న్యాయ విద్య అభ్యసించిన ఆయన 1983లో కర్ణాటక హైకోర్టులో అడ్వకేట్‌గా ప్రాక్టీస్ ప్రారంభించారు. 2003 మే నెలలో కర్ణాటక హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆ తర్వాత అదే హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా అవకాశం దక్కించుకున్నారు. కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి పనిచేస్తుండగానే ఫిబ్రవరి 2017లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు.. పదోన్నతి లభించింది. ట్రిపుల్ తలాక్ చెల్లదని 2017లో తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు ధర్మాసనంలో జస్టిస్ నజీర్ కూడా ఒకరు. ఇక 2019లో అయోధ్య రామజన్మభూమి కేసు తీర్పు ఇచ్చిన ఐదుగురు సభ్యుల ధర్మాసనంలోనూ జస్టిస్ నజీర్ ఉన్నారు. అయోధ్యలో వివాదాస్పద ప్రాంతంలో హిందూ నిర్మాణం ఉనికి ఉందంటూ.. భారత పురావస్తు శాఖ ఇచ్చిన తీర్పును జస్టిస్ నజీర్ సమర్థించారు.
ఈ ఏడాది జనవరి 4నే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన జస్టిస్ నజీర్‌ను కేంద్ర ప్రభుత్వం గవర్నర్‌గా సిఫారసు చేయగా.. రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు.
ఇవీ చదవండి :