Former Minister Vadde Sobhanadreeswara Rao: రాష్ట్రంలో, కేంద్రంలో పరిస్థితులు చూస్తుంటే.. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందనిపిస్తోందని మాజీమంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. ప్రజాస్వామ్యానికి కీలకమైన మీడియా.. వాస్తవాలను ప్రజలకు తెలిసేలా వార్తలు ప్రచురిస్తూ, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ అవినీతి, అక్రమాలను చూపుతున్నందునే.. ఈనాడు అనుబంధ సంస్థ మార్గదర్శిపై.. జగన్ సర్కారు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందన్నారు.
ఒక్కరైనా ఫిర్యాదు చేశారా?: మార్గదర్శి సంస్థ వల్ల నష్టపోయామని ఒక్క చందాదారైనా ఫిర్యాదు చేశారా అని.. వడ్డే శోభనాద్రీశ్వరరావు ప్రశ్నించారు. ఫిర్యాదు లేకుండా సుమోటోగా తీసుకుని చర్యలు తీసుకుంటున్నామని చెప్పడం దుర్మార్గమైన చర్య అన్నారు. దిల్లీ వెళ్లి ప్రెస్ మీట్ పెట్టి మరీ.. ఫిర్యాదు చేసే దాకా ఆగాలా అని సీఐడీ అధికారులు మాట్లాడటం సరికాదన్నారు.
కేంద్రం నిదులు పక్కదారి: కేంద్రం విడుదల చేస్తున్న నిధులను కూడా.. రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని మాజీ ఎంపీ వడ్డే శోభనాద్రీశ్వరరావు విమర్శించారు. నిధులను దారి మళ్లిస్తూ.. బటన్‌లు నొక్కుతున్న ముఖ్యమంత్రిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలని ప్రశ్నించారు. రైతుల పట్టాదారు పాసుపుస్తకాలపై సీఎం బొమ్మేంటని నిలదీశారు. హైకోర్ట్ ఎన్ని సార్లు మొట్టికాయలు వేసినా వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి బుద్ధి రాలేదని మండిపడ్డారు. ఎవరైనా రాజ్యాంగానికి లోబడి పని చేయాల్సిందే అని స్పష్టం చేసారు.