Sujana Chowdary Met Justice Abdul Nazir: ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కేంద్ర మాజీ మంత్రి రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి, మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు తదితరులు మర్యాద పూర్వకంగా బుధవారం రాజ్‌భవన్‌లో కలిశారు. రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలతోపాటు నైసర్గిక అంశాలపై చర్చించినట్లు రాజ్‌భవన్ వద్ద మీడియాకు తెలిపారు. రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించినట్లు చెప్పారు. మూడు రాజధానుల అంశం న్యాయ స్థానంలో ఉన్నందున దీని గురించి మాట్లాడుతున్న వారు, వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు. విశాఖలో క్యాంపు కార్యాలయం పెట్టుకుంటే ఎవరికీ అభ్యంతరం లేదన్నారు. రాష్ట్రంలో పాలన అప్పుల మయంగా ఉందని సుజనా చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం, ప్రత్యేక ప్యాకేజీ, రైల్వే జోన్ పై కేంద్రాన్ని అడిగే వారే లేరని ఆయన అన్నారు.
22 మంది వైఎస్సార్సీపీ ఎంపీలున్నా ఒక్కరూ స్పందించడం లేదని సుజనా చౌదరి అన్నారు. గత నాలుగు సంవత్సరాల్లో విభజన చట్టం ప్రకారం మనకు రావలసిన వాటిపై ప్రభుత్వం కేంద్రాన్ని అడిగిన దాఖలాలు ఎక్కడ కనపడ లేదని, సాధించింది ఎమీ లేదని, అప్పులు చేయడంలో మాత్రం రాష్ట్రం చాలా ముందు ఉంటోందని వ్యాఖ్యానించారు. ఆర్ధిక ఇబ్బందులను ప్రజలు కూడా గమనిస్తున్నారని ఆయన అన్నారు. వీటన్నింటినీ కేంద్రం గమనిస్తోందని, సమయం వస్తే సరైన నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు. భవిష్యత్‌లో రాష్ట్రానికి మంచి జరుగుతుందని, అందరూ అదే కోరుకుంటున్నారని, అంతవరకు అందరు సంయమనం పాటించాలని సుజనా చౌదరి కోరారు.