Expulsion Of The City In Vijayawada : ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగరంలో వివిధ పోలీస్‌స్టేషన్ల పరిధిలోని పలువురు నేర చరిత్ర ఉన్న వ్యక్తులపై పోలీసులు నగర బహిష్కరణ విధించారు. నగరంలో శాంతి భద్రతలకు, సామాన్య ప్రజా జీవనానికి విఘాతం కలిగిస్తూ, గంజాయి, ఇతర మత్తు పదార్ధాలను సేవించడం, వాటి అక్రమ రవాణా చేస్తున్న ఐదుగురు నిందితులపై చర్యలు తీసుకుంటూ నగర సీపీ కాంతి రాణా టాటా ఆదేశాలు జారీ చేశారు.
22 మంది బహిష్కరణ :అజిత్సింగ్ నగర్ పోలీస్ స్టేషన్కు పరిధిలో ఉన్న ఉప్పుగల్ల సాయిమహేష్ అలియాస్ నాని (24), కృష్ణ లంక పోలీస్ స్టేషన్కు పరిధిలో ఉన్న లంకలపల్లి సాయి కిరణ్ అలియాస్ దొంగ సాయి(21), టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిదిలోని ధనలకోట గిరీష్ (29), నున్న పోలీస్ స్టేషన్కు పరిధిలో ఉన్న మొహమ్మద్ కరీం (32), పడ్డా దుర్గారావు అలియాస్ కర్తెబియా(26) లను నగరం నుంచి బహిష్కరించారు.
ఈ ఐదుగురు వ్యక్తులు గంజాయి రవాణా, వివిధ నేరాలకు సంబంధించి అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళి బయటకు వచ్చిన అనంతరం కూడా నేర ప్రవృత్తిని మార్చుకోకపోవడం, శాంతి భద్రతల పరిరక్షణకు విఘాతం కలుగజేస్తుండడంతో వారిని పోలీస్ కమీషనరేట్ పరిధి నుండి బహిష్కరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు 22 మందికి నగర బహిష్కరణ విధించారు.