Mancherial District Fire Accident Today: తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అర్ధరాత్రి సమయంలో ఇంటికి నిప్పు అంటుకోవడంతో.. ఇద్దరు చిన్నారులు సహా ఆరుగురు సజీవ దహనమయ్యారు. మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో కాలిపోయాయి. శవపరీక్షను సైతం అక్కడే నిర్వహిస్తున్నారు. ప్రమాద ఘటనపై విచారణ కోసం 16 బృందాలను మంచిర్యాల డీసీపీ ఏర్పాటు చేశారు.
ఘోర అగ్నిప్రమాదం.. ఇంట్లో మంటలు చెలరేగి ఆరుగురు సజీవదహనం
06:12 December 17
తెలంగాణలో ఘోర అగ్ని ప్రమాదం...
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం గుడిపల్లిలో విషాదం నెలకొంది. శివయ్య అనే వ్యక్తి ఇంట్లో ప్రమాదవశాత్తు అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. కొద్దిసేపట్లోనే అవి తీవ్రరూపం దాల్చాయి. అగ్నికీలలకు ఇంటి యజమాని శివయ్యతోపాటు.. ఆయన భార్య పద్మ చనిపోయారు. పద్మ అక్క కుమార్తె మౌనికతోపాటు ఆమె ఇద్దరు పిల్లలు.. శాంతయ్య అనే సింగరేణి ఉద్యోగి సైతం అగ్నికీలలకు సజీవ దహనమయ్యారు. స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న సిబ్బంది మంటలార్పివేశారు.
ఘటనా స్థలాన్ని మంచిర్యాల డీసీపీ అఖిల్ మహాజన్ పరిశీలించారు. డాగ్ స్క్వాడ్ బృందాన్ని తెప్పించారు . ఆధారాలు సేకరించేందుకు యత్నించగా.. పోలీసు శునకం గ్రామ శివారు వరకు వెళ్లి ఆగిపోయింది. మంచిర్యాల నుంచి వచ్చిన వైద్య బృందం సంఘటన స్థలంలోనే శవపంచనామ చేస్తున్నారు. ఈ కేసును చేధించేందుకు.. 16 బృందాలు ఏర్పాటు చేసినట్లు డీసీపీ అఖిల్ మహాజన్ తెలిపారు. శ్రీరాంపూర్‌కు చెందిన శాంతయ్య అనే సింగరేణి కార్మికుడు.. ఇక్కడ ఎందుకు ఉన్నాడనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు చిన్నారులు సహా ఆరుగురు సజీవదహనం కావడంతో.. మంచిర్యాల జిల్లాలో సంచలనంగా మారింది.
ఇవీ చదవండి: