Untimely rains in NTR district: అకాల వర్షాలు అన్నదాతల నోట మట్టికొడుతున్నాయి. తీవ్రమైన ఎండలతో పంట కోతలకూ ఉక్కిరిబిక్కిరి అయిన సాగుదారులకు.. ఊహించని వర్షాలు పులిమీద పుట్రలా మారాయి. రబీ ధాన్యం కొనుగోలులో అనిశ్చితి కొనసాగుతోంది. రైతుభరోసా కేంద్రాల నుంచి కర్షకులకు కాస్తంత ఊరట కూడా లభించడంలేదు. మిల్లర్లదే అంతిమ నిర్ణయమవుతోంది. వారు చెప్పిన ధరకే విక్రయించాల్సిన దుస్థితిలో ఉండడం తమను తీవ్రంగా కుంగదీస్తోంది. ఈ నేపథ్యంలో అకాల వర్షంతో మూలిగే నక్కపై తాటిపండు పడినట్లుగా మారింది.. రైతుల పరిస్థితిపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.
అకాల వర్షాలతో చేతికొచ్చే దశలో పంటలు ఇలా చేజారిపోతుండడాన్ని సాగుదారులు తట్టుకోలేకపోతున్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం, కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గాల పరిధిలో ఆరబోసిన ధాన్యం కుండపోతగా వాన, ఈదురు గాలులకు తడిసిముద్దయ్యాయి. ధాన్యం కుప్పలు తడిసిపోకుండా ఉండేందుకు కప్పిన పట్టాలు సైతం గాలులకు ఎగిరిపోవడం వల్ల తడిసిపోయాయి. పట్టాల మీద భారీగా నీరు చేరిపోయింది. మధ్యాహ్నానికి వర్షం తెరిపివ్వడంతో కప్పిన పట్టాల నుంచి నీటిని బయటకు తోడేందుకు.. తడిసిన ధాన్యాన్ని కనీసం గాలికైనా ఆరబెట్టేందుకు రైతులు నానాపాట్లు పడుతున్నారు. ఏ రైతును కలిపినా తమ వద్ద ఉన్న ధాన్యం ఎప్పుడు కొనుగోలు చేస్తారో తెలియడం లేదని.. ప్రభుత్వం సూచించిన సన్న రకాలనే తాము సాగు చేసినా తమను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే రెండు, మూడు వందల రూపాయల తక్కువ ధరకు కొనుగోలు చేసేలా మిల్లర్లు మాట్లాడుతుండడం తమను కుంగదీస్తోందంటున్నారు. మిల్లర్లను నియంత్రించి.. ప్రభుత్వం నిర్దేశించిన ధరకు కొనుగోలు చేయాల్సిన పాలకులు, అధికారులు ఏం చేస్తున్నారని రైతులు ప్రశ్నిస్తున్నారు.