Heavy rains across the state: రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాలతో పలు జిల్లాలు తడిసి ముద్దయ్యాయి. ఆరుగాలం కష్టించి పడించిన పంట చేతికి రావడానికి రైతులు అనేక రకాల అవస్థలు పడుతున్నారు. ఈ అకాల వర్షాలతో అన్నదాతలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పడుతున్న భారీ వర్షాలతో కల్లాల్లో ఆరబెట్టిన మిరప తడిచిపోయింది. పంట చేతికి వచ్చే దశలో వేసిన పంటలు నేలవాలాయి.
అనంతపురంజిల్లావ్యాప్తంగా గాలివాన బీభత్సం సృష్టించింది. శింగనమల మండలంలో వడగండ్ల వాన కురిసింది. రోడ్లపై మంచు మాదిరిగా వడగళ్లు పేరుకుపోయాయి. అకాలంగా కురిసిన వడగండ్ల వానకు పంటలు దెబ్బతిన్నాయి. మమిడి చెట్లు కూలిపోవడంతోపాటు.. పెద్దపెద్ద కొమ్మలు విరిగిపడ్డాయి. గుంతకల్లులోనూ ఈదురుగాలులతో కూడిన వర్షానికి అరటి పంట పూర్తిగా నేలకొరిగింది. కొద్దిరోజుల్లోనే పంట చేతికొస్తుందనుకుంటుండగా.. గాలివాన తీవ్ర నష్టం కలిగించిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు
కడప జిల్లా.. పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లె పట్టణంలో వర్షం దంచికొట్టింది. దీంతో పట్టణంలోని రోడ్డులు జలమయమయ్యాయి. ఈదురు గాలులకు వేంపల్లె పట్టణంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. స్థానిక గండి రోడ్డులో వేప చెట్టు కూలిపోవడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.. మండల పరిధిలోని వేంపల్లి, అమ్మగారి పల్లి గ్రామంలోనూ ఇదే మాదిరిగా వడగళ్ల వర్షం దంచికొట్టింది. ఈ వడగళ్ల వర్షాలకు గ్రామంలో అరటి తోటలు దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏది ఏమైనా తుఫాను కారణంగా కొందరు ఆనందం వ్యక్తం చేస్తుంటే రైతులు మాత్రం నష్టం కలిగించిందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఎన్టీఆర్ జిల్లా.. మైలవరం నియోజకవర్గం వ్యాప్తంగా వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. దీంతో ఎక్కడా చూసినా వడగళ్ల కుప్పలే కనిపించాయి పలు ప్రాంతాలు కశ్మీర్‌ను తలపించాయి. రోడ్లు జలమయిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు.
ప్రకాశం జిల్లాలో.. తీరం సమీపంలో ఉన్న ఉప్పు కోటార్లు అకాల వర్షాలకు నీట మునిగాయి.. మరికొద్ది రోజుల్లో పంట చేతికి వస్తుందన్న సమయానికి కురిసిన వర్షాలకు ఉప్పంతా కరిగి తీవ్ర నష్టం ఏర్పడిందని, రైతులు వాపోతున్నారు.. కొత్తపట్నం, నాగులప్పలపాడు తదితర మండలాల్లో బకింగ్ హోమ్ కెనాల్‌కు ఆనుకొని ఇరువైపులా వందలాది ఎకరాలు ఉప్పు కొటార్లు ఉన్నాయి.. భూ గర్భంలో ఉన్న ఉప్పునీటి ని విద్యుత్తు మోటార్లుతో తోడి మడుల్లో నింపి ఉప్పును సాగు చేస్తారు.. మార్చి, ఏప్రెల్ నెలల్లో ఈ సీజన్‌కు సంబంధించిన ఉప్పు పంటకొస్తుంది.. దీన్ని సేకరించి విక్రయిస్తారు.. మంచి సీజన్ , మార్కెట్ బాగుందనే సమయానికి వర్షాలు కురవడం వీరిని తీవ్ర నష్టాలకు గురిచేసింది.. ఒక పంట కాలం వృధా అయ్యిందని ఎకరాకు పెట్టిన పెట్టుబడి దాదాపు 30వేల వరకూ నష్టం వచ్చిందని రైతులు వాపోతున్నారు.
పార్వతీపురం మన్యం జిల్లాలో.. ఈదురుగాలుల బీభత్సం సృష్టించాయి. పార్వతీపురం, పాలకొండ, బలిజపేట, కురుపాం, వీరఘట్టంలో భారీ వర్షం కురిసింది. వీరఘట్టం మండలంలో ఈదురుగాలులకు మొక్కజొన్న, అరటి పంటలు నేలకొరిగాయి.