FAPTO Movement Activity From June 5th : విద్యారంగ సంస్కరణ కారణంగా ఎదురవుతున్న సమస్యలు, అధికారుల వైఖరితో పాటు ఉపాధ్యాయులు, ఉద్యోగుల ఇబ్బందులు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జూన్ ఐదో తేదీ నుంచి సెప్టెంబరు ఒకటవ తేదీ వరకు పలు పద్ధతుల్లో ఉద్యమిస్తున్నట్లు రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య కార్యాచరణ ప్రకటించింది. జీఓ 117ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నందుకు, వేలాది ఉపాధ్యాయ పోస్టులు తగ్గించడంతో పాటు పాఠశాలల విలీనం జరుగుతుందని ఫ్యాప్టో రాష్ట్ర ఛైర్మన్ ఎన్.వెంకటేశ్వర్లు, ఇతర నాయకులు పేర్కొన్నారు.
ఎనిమిది ప్రధాన డిమాండ్లతో ఉద్యమ కార్యాచరణ :ఇతర ప్రభుత్వ శాఖల్లో జరుగుతున్న ప్రక్రియకు భిన్నంగా ఉపాధ్యాయుల హక్కులకు భంగం కలిగిస్తున్నారని, 2,500 రూపాయలు ఇచ్చే పదోన్నతి, ఒక ఇంక్రిమెంట్ పేరుతో ఇచ్చే పదోన్నతులు నష్టదాయమని ఎన్.వెంకటేశ్వర్లు అన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఆరున్నర వేల కోట్ల రూపాయల బకాయిల చెల్లించడంలో తాత్సారం చేయడం ఆర్ధికంగా నష్టం చేకూరుతోందన్నారు. 12వ పీఆర్‌సీ కమిషన్‌ను వెంటనే నియమించాలని, డీఏతో పాటు అన్ని రకాల బకాయిలు చెల్లించాలని, ఇచ్చిన హామీ మేరకు పాత ఫించను విధానంపునరుద్ధరించాలని, కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎనిమిది ప్రధాన డిమాండ్లతో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తున్నట్లు ఆయన తెలిపారు.