ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బాబోయ్..! నకిలీ మందులు..! ఏపీలో ప్రముఖ బ్రాండ్​లే లక్ష్యంగా పొరుగు రాష్ట్రాల దందా - థైరోనార్మ్‌

Fake Medicines : బ్రాండ్ ముసుగులో నకిలీ ఔషదాలు విక్రయిస్తున్నారు. మహారాష్ట్రలో నమోదైన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తే ఏలూరులో లింకు బయటపడింది. బీపీని నియంత్రించే మందులను ప్రముఖ బ్రాండ్ పేరుతో తయారు చేసి విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. హైదరాబాద్, లఖ్​నవూ, పుదుచ్చేరిలా మీదుగా చెన్నైకి సైతం ఈ నకిలీ బ్రాండ్ దందా వెళ్లిందని అధికారులు గుర్తించారు.

fake medicine
నకిలీ మందులు

By

Published : Apr 8, 2023, 10:27 AM IST

Fake Medicines In Andhra Pradesh : మందుల విక్రయాల్లో భారీ గోల్‌మాల్‌ జరుగుతోంది. వైద్యుల సిఫార్సులతోనే విక్రయించాల్సిన మందులకు నకిలీలు ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరి, ఇతర రాష్ట్రాల్లో మార్కెట్లోకి వెళ్లిపోతున్నాయి. తాజాగా మహారాష్ట్రలోని ఠాణే నుంచి వచ్చిన సమాచారం మేరకు ఔషధ నియంత్రణశాఖ అధికారులు.. ఏలూరులోని ఓ మందుల పంపిణీదారుడి వద్ద ఉన్న మాత్రలను తనిఖీ చేశారు. ప్రముఖ బ్రాండెడ్‌ కంపెనీ మందులను పోలీనట్లు, అచ్చం అలాగే తయారుచేసి, అదే బ్రాండ్‌ పేరుతో నకిలీలను సరఫరా చేస్తున్నట్లు తేలింది. అక్కడ బీపీ నియంత్రణ మాత్రలు దొరికాయి. నకిలీ ఔషదాల వెనక ఉన్న సంస్థలు, వ్యక్తుల గురించి ఆరాతీస్తే మహారాష్ట్రలో మొదలై హైదరాబాద్, లఖ్‌నవూ, పుదుచ్చేరి మీదుగా చెన్నైలోని పంపిణీదారుల వరకు వెళ్లింది. దాదాపు 15రోజులుగా విచారణ జరుగుతున్నప్పటికి.. ఈ మాత్రలను తయారుచేసింది ఎవరు అనేది తెలియరాలేదు. ఇక్కడికి ఎలా వచ్చాయన్న విషయం బయటపడలేదు. గుట్టుచప్పుడు కాకుండా విక్రయాలు సరఫరా జరిగేలా చేయడంలో.. ఆరితేరిన నిందితులు కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు.

పంపిణీదారులపై రాష్ట్ర ఔషధ నియంత్రణ పరిపాలన శాఖకు కేసులు నమోదు చేయడమే తప్పా.. అరెస్టు చేసే అధికారం లేదు. ఈ వ్యవహారంలో పోలీసులూ జోక్యం చేసుకోవటం లేదు. పక్కనున్న రాష్ట్రాల నుంచి ఔషధ నియంత్రణ శాఖకు సమాచారం సేకరించటంలో ఉన్న పరిమితులను అక్రమార్కులు తమకు అనుకూలంగా మలుచుకొని రెచ్చిపోతున్నారు. వీటిలో వెలుగులోకి వస్తున్న ఘటనలు అతి తక్కువ. అయినా ఏలూరు కేంద్రంగా బయటపడిన ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. వారణాసిలో ప్రముఖ బ్రాండెడ్‌ కంపెనీల పేరుతోనే నకిలీలు తయారుచేసి, విక్రయిస్తున్న ఘటనలు ఇటీవల వెలుగుచూశాయి. ‘టెల్మా-హెచ్‌ పేరుతో బీపీని నియంత్రించే మాత్రలు తయారుచేసే ‘గ్లెన్‌మార్క్‌’ కంపెనీ.. మహారాష్ట్రలోని ఠాణే జిల్లా అధికారులకు, ఓ మందుల పంపిణీదారుడిపై ఫిర్యాదుచేశారు. దీంతో వారు ఠాణేలో పట్టుకున్న నకిలీ మాత్రలు ఏలూరులోని శ్రీకృష్ణ మెడికల్‌ డిస్ట్రిబ్యూటర్స్‌ నుంచి వచ్చినట్లు కనుగొన్నారు.

విజయవాడలోని రాష్ట్ర ఔషధ నియంత్రణ పరిపాలన శాఖకు ఈ సమాచారాన్ని ఠాణే అధికారులు పంపారు. దీంతో ఏలూరులోని శ్రీకష్ణ మెడికల్‌ డిస్ట్రిబ్యూటర్స్‌ వద్ద తనిఖీ చేయగా, ఇక్కడి నుంచే ఠాణేకు వెళ్లినట్లు ఇన్వాయిస్‌ ద్వారా నిర్ధారణ అయింది. వీరికి హైదరాబాద్​లోని నారాయణగూడలోని ఓ పంపిణీదారుని నుంచి సరఫరా అయినట్లు తెలిసింది. ఇక్కడికి ఉత్తర్​ప్రదేశ్​లోని లఖ్‌నవూలో ఉన్న పార్వతీ ట్రేడర్స్‌ నుంచి , వారికి పుదుచ్చేరిలోని ఓ సంస్థ నుంచి మాత్రలు వచ్చాయి. పుదుచ్చేరి సంస్థకు చెన్నైలోని ఇంకో సంస్థ నుంచి వచ్చాయని పోలీసులు నిర్ధారించారు. అంతవరకు లింకు తెలిసినా.. చెన్నై పంపిణీదారుడికి ఎలా వచ్చాయన్నది ఇంకా తెలియలేదు. వాట్సప్‌ ద్వారా బేరసారాలు పూర్తిచేసుకుని, ఈ మందులను సరఫరా చేసుకుంటున్నారు.

‘గ్లెన్‌మార్క్‌’ తయారుచేసే బీపీ మాత్రల షీట్‌ ధర 244 రూపాయలు. కానీ, వాటి స్థానంలో చిన్నచిన్న అక్షరాల మార్పులతో నకిలీ తయారు చేసి విక్రయిస్తున్నారు. ఈ విక్రయాల వెనక పెద్ద ముఠా ఉన్నట్లు తెేలింది. తక్కువ ఖర్చుతో అదే ఫార్ములతో మందులను తయారుచేసి, అసలు మందు ధర కంటే 5 నుంచి 10శాతం వరకు తక్కువకు అమ్మేస్తున్నారు. పెట్టుబడి తక్కువ కావడంతో పంపిణీదారులకు భారీ లాభాలు వస్తున్నాయి. ఈ మాత్రలు మాత్రమే కాకుండా వీటితో పాటు ఇతర రకాల మందులూ బహిరంగ మార్కెట్లో చలామణిలో ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. అయితే మాత్రల్లో 20 నమూనాలు పరీక్ష చేయించగా.. 15 రిపోర్టుల్లో నాణ్యత పరంగా ఎలాంటి సమస్యలూ లేవని అధికారులు తెలిపారు. వైద్యుల సిఫార్సు లేకుండా విక్రయించకూడని నిద్రమాత్రలు, లైంగిక పటుత్వానికి ఉపయోగించే ఔషధాలు, గర్భనిరోధక మందులు, గర్భవిచ్ఛిత్తికి వినియోగించే మాత్రలను కిరాణా దుకాణాల్లోనూ యథేచ్ఛగా అమ్ముతుండగా ఏలూరులో పట్టుకున్నారు. నరసరావుపేట, చిలకలూరిపేట, ఇతరచోట్ల సైతం ఈ విక్రయాలు సాగాయి. సుమారు 25 లక్షల రూపాయల విలువైన మందులను సంబంధిత శాఖ అధికారులు పట్టుకున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని బీదర్, హుబ్బళ్లి, తుమకూరు ప్రాంతాల్లో ఫార్మా కంపెనీల వారు, పంపిణీదారులు పెద్దసంఖ్యలో ఉన్నారు. అక్కడి నుంచి నిద్రమాత్రలు, ఇతర మందులను ఏలూరుకు చెందిన ఓ వ్యక్తి తెప్పించారు. కర్ణాటక ఫార్మా కంపెనీలు ఆర్డర్లు ఇచ్చేవారి లైసెన్సుల విషయాన్ని పట్టించుకోకుండా లాభార్జనే ధ్యేయంగా మందులు సరఫరా చేస్తున్నారు.

గత సంవత్సరం జులై నెలలో తెలుగు రాష్ట్రాల్లో నకిలీ థైరోనార్మ్‌ మాత్రల సరఫరా చోటు చేసుకుంది. థైరోనార్మ్‌ ఉత్పత్తి సంస్థ ఆబాట్‌ తరఫున కొంతకాలం రిప్రజెంటేటివ్‌గా పనిచేసిన అనుభవంతో కర్ణాటకలోని హుబ్బళ్లికి చెందిన ఓ యువకుడు నకిలీ కార్డులు, ఊరు, పేరు లేని హోల్‌సేల్‌ షాపును సృష్టించాడు. దాని ద్వారా విక్రయాలు సాగించాడు. ఏపీలోని మందుల దుకాణాల్లో ఇవి దొరికాయి. ఈ మాత్రలను పరీక్షించగా, అసలు అందులో మందు లేదని తేలింది. అసలు కంపెనీలాగే అన్ని వివరాలతో పాటు, పరిమాణంలోనూ నిందితులు జాగ్రత్తలు తీసుకున్నారు.

మందుల విక్రయాల్లో భారీ గోల్‌మాల్‌

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details