Facts In Sankalpasiddhi Scam: మరో మూడు నెలల్లో స్కీంలన్నింటినీ నిలుపుదల చేసేందుకు సిద్ధమైనట్లు.. సంకల్ప్‌సిద్ధి సంస్థ నిర్వాహకుడు వేణుగోపాలకృష్ణ పోలీసుల విచారణలో వెల్లడించినట్లు సమాచారం. ఇప్పటికే పలు రకాల స్కీంలు అమలు చేస్తున్న ఆ సంస్థ.. విజయవాడ రూరల్ మండలం నిడమానూరులో ఏర్పాటుచేసిన సంకల్ప్‌సిద్ధి ఈ-కార్ట్ మాల్‌కు అనుసంధానం చేసింది. స్కీంలో సభ్యులుగా చేరినవారికి.. ఈ మాల్ నుంచి 15 వందల సరకులు ఇస్తోంది. విజయవాడ సంస్థ ద్వారానే.. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మందిని సభ్యులుగా చేర్చుకున్నారు. కర్ణాటకలోని బళ్లారిలో సంస్థ కార్యకలాపాలను ప్రారంభించడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే గుత్తా కిరణ్ కొన్నాళ్లుగా బళ్లారిలో మకాం వేశారు.
తెలుగు రాష్ట్రాల్లో ప్రజల నుంచి వసూలు చేసిన డబ్బును... ప్రకాశం జిల్లా కనిగిరి కేంద్రంగా నడుస్తున్న.. ఆగ్రో సంస్థల్లో వేణుగోపాలకృష్ణ పెట్టుబడిగా పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. కనిగిరిలో కొనుగోలు చేసిన 150 ఎకరాల్లో ఎర్రచందనం, శ్రీగంధం మొక్కలు పెంచేలా.. ఆగ్రో సంస్థతో ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది. వీరి మధ్య 60:40 నిష్పత్తి ప్రకారం ఒప్పందం కుదిరినట్లు తెలిసింది. కనిగిరికి వెళ్లి విచారణ చేపట్టిన పోలీసులు.. అక్కడి మార్కెట్ విలువ ప్రకారం.. భూమి విలువ కోట్లలో ఉంటుందని లెక్కగట్టారు. ఇంకో 50 ఎకరాల కొనుగోలుకు ఒప్పందం చేసుకున్నట్లు తేలింది. బెంగళూరులోనూ స్థిరాస్తి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.