Expert advice for women to grow in life: కొందరు ఉద్యోగినులు... బాధ్యతల్ని ఎంత సక్రమంగా నిర్వర్తించినా సరే, నలుగురిలోనూ ప్రెజంటేషన్లు ఇవ్వాలన్నా, సెమినార్లూ, మీటింగ్‌లకు నాయకత్వం వహించాలన్నా.. వెనకడుగు వేస్తారు. దీనికి కారణం.. ప్రతిభ లేక కాదు... ఎవరైనా ఏమైనా అనుకుంటారనే భయమే! ఈ తీరు మీ ఎదుగుదలకు అడ్డంకి అవుతుంది అంటారు కెరియర్ నిపుణులు.
నమ్మండి:ఏదైనా చేయాలని అనుకున్నప్పుడు ఇతరుల సంగతి పక్కనపెట్టి ముందు మిమ్మల్ని మీరు నమ్మండి. అందరికీ అన్నీ తెలిసి ఉండాలని ఏమీ లేదు. కానీ, పనిపై పూర్తి అవగాహనతో చేస్తే.. తడబాటుకి అవకాశం ఉండదు. ఆందోళన దరిచేరదు.
సానుకూలంగా:గెలుపోటముల్ని సమానంగా తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. పనిలో విమర్శను సానుకూలంగా తీసుకోవాలి. ఎవరైనా విమర్శిస్తున్నారంటేనే.. మీరు వాళ్లు గుర్తించదగ్గ ఏదో ఒకపని చేస్తున్నారనే అర్థం. అయినా, అసలు ప్రతికూలంగా ఆలోచించడం ఎందుకు? మీ ఆలోచన అద్భుతం అనికూడా అందరూ ప్రశంసించే అవకాశమూ ఉంది కదా! మరి అసలు వెళ్లకుంటే ఏమవుతుంది? నలుగురిలో ఒకరిలా ఉండి పోతారు. మీ ఆలోచనలు బావుండొచ్చూ, లేకపోవచ్చు.. కానీ అవి చెప్పకుంటే ‘అసలు ఈ అమ్మాయికి ఏ ఆలోచనా లేదు’ అనే ముద్రపడుతుంది. అదే అసలైన ప్రమాదం!