Polavaram Empowered Samiti latest updates: పోలవరం ప్రాజెక్టు నిర్దేశిత ఎత్తు కంటే నిర్మాణం తగ్గించినా, నీటి నిల్వలో మార్పులు చేసినా తీవ్రస్థాయి ఉద్యమానికి కార్యాచరణ రూపొందిస్తున్నామని.. పోలవరం సాధికార సమితి ప్రకటించింది. పోలవరం విషయంలో నెలకొన్న అపోహలు, సందేహాల నివృత్తి కోసం కేంద్ర జలశక్తి మంత్రిని కలిసేందుకు సమయం కోరామని, అవకాశం లభిస్తే ప్రధాని, ఇతర ముఖ్యులను కూడా కలిసి చర్చిస్తామని.. సమితి కన్వీనరు అక్కినేని భవానీ ప్రసాద్, కార్యనిర్వాహ కార్యదర్శి వెలగపూడి గోపాలకృష్ణ తెలిపారు.
ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో ఇప్పటికే అనేక కారణాల వల్ల పనుల వేగవంతంలో తీవ్రమైన జాప్యం జరిగిందన్నారు. ఇప్పటికీ కూడా అనుకున్న సమయానికి.. అనుకున్న విధంగా ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తారనే నమ్మకం సన్నగిల్లిపోతోందని ఆవేదన చెందారు. పూర్తి స్థాయిలో పోలవరం ప్రాజెక్టు పనులు జరగకపోతే గనుక ఆంధ్రప్రదేశ్‌లో తీవ్రమైన నీటి ఎద్దడి తలెత్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పశువులకు ఆహారం దొరకక పెద్ద సంఖ్యలో చనిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
అనంతరం పోలవరం ప్రాజెక్ట్ పనులకు సంబంధించి.. పునరావాస ప్యాకేజీ మొత్తాన్ని తగ్గించుకునేందుకు పోలవరం ఎత్తును తగ్గించాలని, నీటి నిల్వ సామర్ధ్యాన్ని కుదించాలని భావించడం వల్ల ఇంతవరకు పోలవరం ప్రాజెక్టు పనుల కోసం చేసిన ఖర్చు వృథా అవుతుందనే విషయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ఏప్రిల్ రెండో వారంలో భీమవరం లేదా పాలకొల్లులో రైతు సంఘాలు, ప్రజాప్రతినిధులు, అన్ని రాజకీయ పార్టీలతో ఓ సమావేశం ఏర్పాటు చేస్తున్నామని.. అందులో కార్యాచరణ ఖరారు చేస్తామని, పోలవరం సాధన కోసం ఏ స్థాయి ఉద్యమాలకైనా తాము సిద్ధంగా ఉన్నామని.. పోలవరం సాధికార సమితి కన్వీనరు అక్కినేని భవానీ ప్రసాద్, కార్యనిర్వాహ కార్యదర్శి వెలగపూడి గోపాలకృష్ణ తెలిపారు.
పోలవరం ఎత్తు తగ్గించినా, నీటి నిల్వలో మార్పులు చేసినా ఉద్యమమే ''రాష్ట్ర ప్రజల ఆర్ధిక జీవనరేఖగా భావిస్తోన్న పోలవరం ప్రాజెక్టు విషయంలో నిర్దేశిత ఎత్తు కంటే నిర్మాణం తగ్గించినా, నీటి నిల్వలో మార్పులు చేసినా తీవ్రస్థాయి ఉద్యమానికి కార్యాచరణ రూపొందిస్తాం. పోలవరం విషయంలో నెలకొన్న అపోహలు, సందేహాల నివృత్తి కోసం కేంద్ర జలశక్తి మంత్రిని కలిసేందుకు అపాయింట్మెంట్ను కూడా తీసుకున్నాం. ప్రస్తుతం కేంద్ర జలశక్తి మంత్రి అమెరికాలో ఉన్నారు. ఈ నెల 29న తేదీన కలవబోతున్నాం. అవకాశం లభిస్తే.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఇతర ముఖ్య నాయకులను కలిసి ప్రాజెక్ట్ నిర్మాణం, నీటి నిల్వలో మార్పుల గురించి, ప్రాజెక్ట్ పనుల్లో జరుగుతున్నా జాప్యం గురించి చర్చిస్తాం.''- వెలగపూడి గోపాలకృష్ణ, పోలవరం సాధికార సమితి, కార్యనిర్వాహ కార్యదర్శి
ఇవీ చదవండి