Endowments Minister Kottu Satyanarayana: రాష్ట్రంలో కొన్ని దేవాలయ భూముల విషయంలో సరిహద్దులు, కౌలు సమస్యలు ఉన్నాయని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. కొన్ని దేవాలయ భూముల ఇప్పటికే ఆన్ లైన్లో పొందుపరిచామని తెలిపారు. పూర్తి స్థాయి దేవాలయ భూముల వివరాలు త్వరలోనే ఆన్ లైన్లో అందుబాటులో ఉంచుతామని అన్నారు. దేవాదాయ శాఖ భూములకు సంబంధించిన కొన్ని కేసులు హైకోర్టులో పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలోని దేవాలయాలు, ధార్మిక సంస్థల భూముల పరిరక్షణ కోసం అధికారులు, కార్యనిర్వహణ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ఆలయాల భూములు గుర్తించడం, ఆన్ లైన్లో పొందుపరచడంలో పారదర్శకత చూపిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా శాశ్వత భూమి హక్కు కోసం సమగ్ర భూ సర్వే నిర్వహిస్తున్నామని తెలిపారు.
అన్ని ఆలయాల భూముల వివరాలు సేకరించడానికి.. సరిహద్దు సమస్యలు పరిష్కారం చేయడానికి జిల్లా కేంద్రాల్లో కింది స్థాయి అధికారులతో సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేస్తామన్నారు. దేవాలయాల భూములు విషయంలో తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకున్నాం.. అది తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. వారికి మద్దతుగా కొన్ని పత్రికలు రాతలు రాస్తున్నాయని అన్నారు. మేము ఏ పత్రికా రాతలకి భయపడి ఈ సమీక్ష సమావేశం ఏర్పాటు చేయలేదు.. తాము నిర్ణయించుకున్న సమయానకే ఈ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. దేవాదాయ భూములకు సంబంధించిన అద్దె డబ్బులు సక్రమంగా వసూలు చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నామని తెలిపారు. విరాళాలుగా రాష్ట్రంలో కొంత మంది దాతలు పలు ఆలయాలకు ఇచ్చిన భూముల రక్షణ కోసం కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. 175 దేవాలయాలు సేవలు, 4 లక్షల 90 వేల ఎకరాల దేవాలయ భూముల వివరాలు ఆన్లైన్లో పొందుపరిచినట్లు పేర్కొన్నారు.