ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Employees Opposed Cabinet meeting on GPS: జీపీఎస్​పై చర్చలకు ఉద్యోగ సంఘాలకు ఆహ్వానం.. పలువురు వ్యతిరేకత - ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వీడియోలు

Employees opposed Cabinet meeting on Guaranteed Pension Scheme: గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్ వ్యవహారంపై ఉద్యోగ సంఘాల్లో గందరగోళం నెలకొంది. జీపీఎస్ అమలుపై లిఖితపూర్వక అభిప్రాయాలు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం ఉద్యోగ సంఘాలను ఆహ్వానించటంపై సీపీఎస్ ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఉద్యోగులెవరికీ తెలియకుండానే జీపీఎస్ అమలు నిర్ణయాన్ని ప్రభుత్వం ఎలా తీసుకుంటుందని ఆక్షేపణలు వ్యక్తం అవుతున్నాయి. ఏపీ అమలు చేసే జీపీఎస్ దేశానికి ఆదర్శమని చెబుతున్న ప్రభుత్వం ఓపీఎస్ అమలు చేస్తున్న రాష్ట్రాలకు దేనికి ఆదర్శమో చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి.

employees-opposed-cabinet-meeting-on-guaranteed-pension-scheme
employees-opposed-cabinet-meeting-on-guaranteed-pension-scheme

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 28, 2023, 8:15 PM IST

Employees Opposed Cabinet meeting on GPS: జీపీఎస్ అమలు చేస్తామంటూ ప్రభుత్వం చేసిన ప్రకటనపై ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీపీఎస్ అమలుపై లిఖితపూర్వక అభిప్రాయాలు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం ఉద్యోగ సంఘాలను మంత్రివర్గ ఉపసంఘం భేటీకి ఆహ్వానించింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలోని రెండో బ్లాక్​లో చర్చలకు రావాల్సిందిగా సాధారణ పరిపాలన శాఖ.. ఉద్యోగ సంఘాలకు సమాచారం పంపింది. మరోవైపు జీపీఎస్​కు సంబంధించి ఇటీవల కేబినెట్ ఆమోదించిన విషయం ఉద్యోగ సంఘాలెవరికీ తెలియదని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె. వెంకట్రామి రెడ్డి వ్యాఖ్యానించారు. జీపీఎస్ (GPS)పై ప్రభుత్వం ఏం ప్రతిపాదిస్తుందో ఏ ఉద్యోగ సంఘానికీ స్పష్టత లేదని వెల్లడించారు.

పీఆర్సీ, కాంట్రిబ్యూషన్ మినహా ఓపీఎస్​లోని అన్ని అంశాలూ జీపీఎస్ లో ఉంటాయని ముఖ్యమంత్రే చెప్పారు. ఇదే అంశాన్ని జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లో అధికారులకు చెప్పాం. జీపీఎస్ లో కమ్యూటేషన్ పై అధికారులెవరూ స్పష్టత ఇవ్వకపోతే ఎలా..? ఉత్తర్వులు ఇచ్చి ఉద్యోగులు ఆందోళన చేసే పరిస్థితి రాకుండా ముందుగానే సీపీఎస్ ఉద్యోగులతోనూ మాట్లాడాలి. జీపీఎస్​ను స్వాగతించం.. సీపీఎస్ ఉద్యోగులకు అప్పీల్ చేశామని.. అన్నీ ఒకేసారి కాకుండా దఫదఫాలుగా సాధించుకోవాలని చెబుతున్నారు. అన్నీ ఒకేసారి తొలగించాలంటే ఏ ప్రభుత్వానికీ కుదరదని.. ఒక్కొక్కటిగా సాధించుకునే అవకాశం ఉందన్నదే మా అభిప్రాయం. జీపీఎస్ అమల్లోకి వచ్చినా లేని అంశాలను అడుగుతూనే ఉంటామన్నాం. -కె. వెంకట్రామిరెడ్డి, అధ్యక్షుడు, ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం

Employees Opposes GPS: 'సీపీఎస్ రద్దు చేయలి..లేకపోతే ఐక్యంగా ఉద్యమిస్తాం'

రాష్ట్రంలో 3.5 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులంతా కోరుకునేది పాత పెన్షన్ విధానాన్నేని సీపీఎస్ ఉద్యోగ సంఘాలు వ్యాఖ్యానిస్తున్నాయి. జీపీఎస్ లో ప్రభుత్వం ప్రతిపాదించిన అంశాలను ఎందుకు బయటపెట్టటం లేదని సచివాయంలోని సీపీఎస్ ఉద్యోగ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. లక్షల మంది ఉద్యోగులకు సంబధించిన అంశంపై హడావిడిగా ఆర్డినెన్సు(Ordinance) ఎందుకు తెస్తున్నారని సంఘాల నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. సెప్టెంబరులో జరిగే శాసనసభా సమావేశాల్లో ప్రభుత్వం బిల్లు పెడితే చర్చ జరిగే అవకాశం ఉంటుందని నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీలో చర్చిస్తే లోటుపాట్లూ బయటకు వస్తాయి.. హడావిడిగా ఎందుకు ఆర్డినెన్సు తేవాలని చూస్తున్నారని ప్రశ్నించారు. ఇదంతా ఉద్యోగులను తప్పుదోవ పట్టించి గందరగోళ పరచడానికే ప్రభుత్వం హడావిడి చేస్తోందన్నది ఏపీ సీపీఎస్ ఉద్యోగులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

CM Jagan Comments on CPS in APNGO Meeting: "సీపీఎస్ రద్దుపై మాట తప్పే ఉద్దేశం ఉంటే.. జీపీఎస్ తెచ్చేవాళ్లం కాదు"

జీపీఎస్​లో మంచి జరుగుతుందని ఉద్యోగులెవరూ భావించటం లేదని సచివాలయ సీపీఎస్ ఉద్యోగుల సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. జీపీఎస్ అంటేనే ఉద్యోగులకు నమ్మక ద్రోహం చేయటమేన్నది వారి అభిప్రాయం. గత ప్రభుత్వ హయాంలో ఓపీఎస్​తో సమానమైన పెన్షన్ ఇస్తామన్నా అంగీకరించలేదని సంఘం నేత రాజేష్ స్పష్టం చేస్తున్నారు. సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ ఇస్తామన్నారని ఉద్యోగులంతా జగన్ కు మద్దతిచ్చామని.. జీపీఎస్ ప్రతిపాదన అడిగితే దాన్ని అంగీకరించినట్టు కాదు.. అది నష్టం చేస్తోందో, లాభం చేస్తోందో తెలుసుకోవాలని చెబుతున్నారు. ప్రభుత్వం జీపీఎస్ పై పెట్టిన సమావేశానికి సీపీఎస్ సంఘాలను ఆహ్వానించకపోవటం శోచనీయమని వ్యాఖ్యానిస్తున్నారు. జీపీఎస్ ను వద్దని అంటున్నందునే మంత్రివర్గ సమావేశానికి(Cabinet meeting) ప్రభుత్వం ఆహ్వానించటం లేదని చెబుతున్నారు. జీపీఎస్ ను స్వాగతించిన ఉద్యోగ సంఘాలకు జీపీఎస్ ను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామని.. ఉద్యోగులంతా రోడ్లపైకి వస్తే మా డిమాండ్లన్నీ ప్రజాక్షేత్రంలోనే తేలుతాయని స్పష్టం చేస్తున్నారు.

జీపీఎస్ పై లిఖిత పూర్వక అభిప్రాయాలను చెప్పాలంటూ సాధారణ పరిపాలన శాఖ సమావేశానికి పిలిచినా.. కొన్ని ఉద్యోగ సంఘాలు ఈ సమావేశాన్ని బహిష్కరించాయి. ప్రత్యేకించి ఉపాధ్యాయ సంఘాలేవీ ప్రభుత్వం జీపీఎస్ పై నిర్వహించే ఏ సమావేశానికి హాజరుకాకూడని నిర్ణయించాయి. విధివిధానాలే తెలియకుండా జీపీఎస్ బాగుందని కొందరు ఉద్యోగ సంఘాల నేతలు ఎలా చెబుతారని సీపీఎస్ సంఘాల నేతలు ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details