ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రభుత్వ ఉద్యోగులకు ఇంకా జీతాలందలేదు.. అడిగితే, నోటీసులు-కేసులు - జీతాల కోసం ఉపాధ్యాయులు

AP Government Techers Salaries : నెలలో 12వ తేదీ వచ్చినా చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఇంకా జీతాలు అందలేదు. గతంలో జీతాలు పెంచాలని ధర్నాలు చేసే ఉద్యోగులు.. ఇప్పుడు జీతాలు ఇవ్వాలని ఆందోళన చేసే పరిస్థితి వచ్చింది. జీతం కోసం ఇంకెన్నాళ్లు ఎదురు చూడాలో అని ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. జీతాలివ్వండి మహా ప్రభో.. అంటూ నిరసన తెలిపితే సర్కారు నోటీసులు ఇస్తోంది. ధర్నాలకు దిగితే కేసులు పెట్టి వేధిస్తోంది.

AP Government Techers Salaries
ఉద్యోగులు జీతాలు

By

Published : Dec 13, 2022, 8:33 AM IST

AP Government Techers Salaries : ప్రభుత్వ ఉద్యోగి అంటే ఠంచనుగా ఒకటో తేదీన జీతం, డబ్బులు అవసరంపడితే జీపీఎఫ్, పీఎఫ్ నుంచి అడ్వాన్సులు, రుణాలు వంటి సదుపాయాలు అనుకునే పరిస్థితులు.. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మారిపోయాయి. 12వ తేదీ వచ్చినా.. నేటికీ అనేక జిల్లాల్లో ఉపాధ్యాయులు, లెక్చరర్లకు నవంబరు నెల జీతం అందలేదు. ఆర్థిక అవసరాలకు డబ్బులు ఇవ్వాలంటూ చేసుకున్న దరఖాస్తులకు మోక్షం ఎప్పుడో తెలియదు. డీఏ బకాయిలు ఇవ్వకుండానే.. ఆదాయపు పన్ను మినహాయించేస్తున్న వింత పరిస్థితి . ప్రభుత్వ ఉద్యోగులకు రావల్సివన్నీ సకాలంలో అందిస్తామని ప్రతిపక్షనేతగా చెప్పిన జగన్.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులు, ఉపాధ్యాయుల, పింఛనర్లు ప్రతి నెలా జీతం కోసం కూడా ఆందోళన పడే పరిస్థితి తెచ్చారు.

గతంలో ఆర్థిక ప్రయోజనాల కోసం ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనలు చేసేవి. ఇప్పుడు జీతాలు కోసం ధర్నాలు చేసే పరిస్థితి వచ్చింది. ప్రతి నెలా మొదట తారీఖున జీతాలు అందుకొని ఎన్ని నెలలవుతోందని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. పాలు పోసే వ్యక్తి నుంచి కిరాణా కొట్టులో బాకీ వరకు.. ప్రతి ఖర్చుకూ ఎలా సర్దుబాటుచేయాలో.. తెలియక ఉద్యోగులు, ఉపాధ్యాయులు మథనపడుతున్నారు. ‌ఒకటో తేదీ జీతం వస్తుందనే ఉద్దేశంతో ప్రభుత్వ ఉద్యోగుల్లో చాలా మంది.. తమ రుణ వాయిదాలను ప్రతి నెలా 10వ తేదీలోపే పెట్టుకున్నారు. దాదాపు సగం నెల గడిచే వరకు జీతాలు రాకపోవడంతో.. వాయిదాలకు వడ్డీ కింద ప్రతి నెలా 600 నుంచి 1,500 వరకు అదనంగా చెల్లించాల్సి వస్తోంది. మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బుల మందులు కొనుక్కునేందుకు అప్పులు చేయాల్సి వస్తోందని.. పింఛనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఒకటో తేదీన తమ జీతం ఇవ్వాలని ఆందోళన చేస్తే ఉపాధ్యాయులకు నోటీసులు ఇస్తున్నారు. అక్టోబరు నెల జీతాలు రాలేదని.. నవంబరులో విజయనగరం జిల్లాకు చెందిన కొందరు ఉపాధ్యాయులు.. నిరసన తెలిపారు. వెంటనే ఆర్జేడీ, డీఈవో, డిప్యూటీ డీఈవోలు.. ఉపాధ్యాయులపై వేధింపులకు దిగారు. జీతం ఆలస్యమైతే కొంపలు మునిగిపోతాయా అంటూ.. ఉపాధ్యాయుల నుంచి వివరణ తీసుకున్నారు. ఇటీవల యూటీఎఫ్, ఎస్టీయూలు వేతనాలు, ఇతర సమస్యలపై.. ఆందోళన నిర్వహించాయి. ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య-ఏపీటీఎఫ్ కలెక్టరేట్ల వద్ద..ఆందోళనకు పిలుపునిచ్చింది. యూటీఎఫ్ రాష్ట్రస్థాయి ధర్నాకు దిగితే అనుమతివ్వకుండా.. ఎక్కడిక్కడ అరెస్టులు చేశారు. జీతాల కోసం ఆందోళనలుచేయడం ఎప్పుడూ చూడలేదని సీనియర్ ఉద్యోగులు చెబుతున్నారు.

"ముఖ్యమంత్రిగారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగానే ఉందని. బాగానే ఉన్నప్పుడు ఒకటో తేదిన వేయాల్సిన ఉద్యోగ ఉపాధ్యాయుల జీతాలు ఇంకా వేయలేదు. ఒకటో తేదిన జీతాలు అందుకోవటం మా హక్కు.. ఇవ్వటం ప్రభుత్వ భాద్యత. జీతాలు అందించకుండా ఇంకా అలస్యం చేస్తే మేము నిరసన చేపట్టాడానికి సిద్ధం." -సాయిశ్రీనివాస్‌, ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు

"ఉపాధ్యాయులకు 12వ తేది వచ్చిన రాలేదు. పింఛన్​దారులు ఎదురుచుస్తున్నారు. గత ప్రభుత్వంలో ఎన్నాడు ఈ విదంగా జరగలేదు. అన్ని శాఖల వారికి జీతాలు అందాయి. మరీ ఉపాధ్యాయులకు ఎందుకు అందలేదు." -ఎస్పీ మనోహర్‌ కుమార్‌, యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి

ఉద్యోగులు, పెన్షనర్ల పరిస్థితి ఇలా ఉంటే.. ప్రభుత్వ పెద్దలు మాత్రం బటన్‌ నొక్కడంతో ఉద్యోగులు పోల్చుకోరాదని సలహా ఇస్తున్నారు. ఉద్యోగులు జీతాల కోసం ధర్నాలు చేయరాదని.. ఏ సమస్యనైనా కలసి కూర్చుని పరిష్కరించుకోవాలని.. అవసరమైతే కాళ్లు పట్టుకునే నేర్పు ఉండాలని మంత్రి బొత్స సత్యనారాయణ సలహా ఇచ్చారు. సంక్షేమ పథకాలకు వేల కోట్లు ఖర్చవుతోందని.. జగన్‌ తమకోసం ఒక బటన్‌ నొక్కాలని ఉద్యోగులు అనడం సరికాదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. హితవు పలుకుతున్నారు.

జీతాల కోసం ఉపాధ్యాయుల ఎదురు చూపులు.. సగం నెల గడుస్తున్నా..

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details