Electricity Demand Reduced in YSRCP Government :రాష్ట్రంలో ప్రస్తుతం విద్యుత్ డిమాండ్ భారీగా తగ్గిపోయింది. కానీ వైసీపీ ప్రభుత్వం స్వల్పకాలిక ఒప్పందాల కింద తీసుకునే విద్యుత్‌ను అధిక ధరకు కొంటుంది. ఇలాంటి సమయంలో అదనంగా విద్యుత్ కొనుగోలు (Electricity Purchase) కు ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీని ద్వారా కొన్ని విద్యుత్ కంపెనీలకు (Electricity Company) లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వం వ్యవహరించిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకే టెండరు ఆధారంగా ఒప్పందాలు కుదుర్చుకున్నా.. కొన్ని విద్యుత్ సంస్థలకు యూనిట్‌కు 9 రూపాయల చొప్పున చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించడం వెనుక ఏదో మతలబు ఉందని నిపుణులు సందేహిస్తున్నారు.
Government Buying Electricity with High Price :విద్యుత్ కోతలు (Power Cuts in AP) లేకుండా సరఫరా చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు విద్యుత్ డిమాండ్ సర్దుబాటు కోసం అక్టోబరు నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు 3 వేల 8 వందల30 మిలియన్ యూనిట్ల కరెంటు తీసుకోవాలని డిస్కంలు నిర్ణయించాయి. అదనపు విద్యుత్ కొనుగోళ్లకు డిస్కంలు టెండర్లు పిలిచి తమిళనాడు, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, కోల్‌కతాలోని 8 విద్యుత్ ఉత్పత్తి సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఖరారైన బిడ్ల ఆధారంగా కనిష్ఠంగా యూనిట్‌కు 7 రూపాయలు, గరిష్ఠంగా 9 రూపాయలు పెట్టి డిస్కంలు కొంటున్నాయి. ఈ లెక్కన సగటున యూనిట్‌కు 7 రూపాయల 80 పైసల వంతున ప్రభుత్వం చెల్లిస్తోంది.
స్మార్ట్ మీటర్ల ఏర్పాటుతో జనం జేబుకు చిల్లు - ప్రజలపై పడనున్న 20 వేల కోట్ల భారం
Poewr Cuts in AP :డిస్కంల స్వల్పకాలిక ఒప్పందాల ద్వారా విద్యుత్‌ను అధిక ధరకు కొనడం వల్ల ప్రజలపై దాదాపుగా 17 వందల 23 కోట్ల రూపాయలకు పైగా అదనపు భారం పడుతోంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి బహిరంగ మార్కెట్‌లో యూనిట్ విద్యుత్‌ను 4 రూపాయల 80 పైసల వంతున కొనడానికి డిస్కంలకు APERC అనుమతించింది. APERC అనుమతించిన ధరతో పోలిస్తే డిస్కంలు 3 రూపాయల చొప్పున అధికంగా చెల్లిస్తున్నాయి. జెన్‌కోకు యూనిట్‌కు సుమారు రూపాయిన్నర వంతున చెల్లించే స్థిర ఛార్జీలతో కలిపి యూనిట్‌కు అదనంగా 4 రూపాయల 50 పైసలు డిస్కంలు ఖర్చు చేస్తున్నట్లే అవుతుంది. ఈ మొత్తాన్ని సర్దుబాటు ఛార్జీల పేరుతో ప్రతి నెలా బిల్లులో యూనిట్‌కు 40 పైసల వంతున ప్రభుత్వం ప్రజల నుంచి ఇప్పటికే వసూలు చేస్తోంది. మిగిలిన మొత్తాన్ని ఏడాది చివర్లో లెక్కగట్టి ట్రూఅప్ పేరుతో వసూలు చేయనుంది.