ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బోధనేతర విధుల నుంచి ఉపాధ్యాయుల తొలగింపు.. నోటిఫికేషన్​ విడుదల - NON TEACHING DUTIES

REMOVING TEACHERS FROM NON TEACHING DUTIES: రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులను ఎన్నికల విధుల నుంచి తప్పించింది. సర్కార్‌పై వారిలో తీవ్ర వ్యతిరేకత ఉందని గ్రహించిన ప్రభుత్వం.. వచ్చే ఎన్నికల్లో ఉపాధ్యాయులను విధులకు దూరం పెట్టింది. ఇందుకోసం ఏపీ ఉచిత, నిర్బంధ విద్య నియమాలు-2010కి సవరణ చేసింది. విద్యా హక్కు చట్టం అమలుకు 2011 మార్చి 3న అప్పటి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు-20ని సవరిస్తూ గెజిట్‌ ప్రకటన విడుదల చేసింది. అత్యవసర సమయంలో తప్ప.. మిగతా సమయాల్లో ఉపాధ్యాయులను బోధనేతర పనులకు వినియోగించబోమని నోటిఫికేషన్​లో తెలిపింది. దీనిపై యూటీఎఫ్​ నేతలు స్పందించారు.

బోధనేతర విధుల నుంచి ఉపాధ్యాయుల తొలగింపు
బోధనేతర విధుల నుంచి ఉపాధ్యాయుల తొలగింపు

By

Published : Nov 29, 2022, 10:01 PM IST

Updated : Nov 30, 2022, 6:27 AM IST

REMOVING TEACHERS FROM NON TEACHING DUTIES: ఉపాధ్యాయులకు బోధనేతర పనులు అప్పగించకుండా.. విద్యకు సంబంధించిన కార్యకలాపాలకే పరిమితం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల విధుల నుంచి తప్పించింది. విద్యేతర పనులకు ప్రభుత్వశాఖల్లోని సిబ్బంది అందరినీ వినియోగించిన తర్వాత అవసరం ఉందనుకుంటేనే ఉపాధ్యాయులకు విధులను అప్పగించాలని ఉత్తర్వుల్లో వెల్లడించింది. విద్యా హక్కు చట్టం నియమాలు-2010ని సవరించేందుకు ప్రభుత్వం సోమవారం మంత్రులకు హడావుడిగా ఈ-ఫైల్‌ పంపించి సంతకాలు తీసుకుంది. కేంద్రం తీసుకొచ్చిన విద్యా హక్కు చట్టం 2009లోని సెక్షన్‌ 27 ప్రకారం జనాభా గణన, విపత్తు సహాయ విధులు, స్థానిక సంస్థలు, రాష్ట్ర శాసనసభలు, పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన విధులు మినహా విద్యేతర పనులకు ఉపాధ్యాయులను వినియోగించకూడదు. అయితే సెక్షన్‌-27లోని నిబంధనలకు అనుగుణంగా ఉపాధ్యాయులకు బోధనేతర పనులు అప్పగించకూడదనే అంశాన్ని బలోపేతం చేసేందుకు సవరణలను తీసుకొస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.

అయితే ఉపాధ్యాయులను ఎన్నికల విధులకు దూరంగా పెట్టేందుకు, ఎన్నికల విధులకు గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని వినియోగించేందుకు ఈ సవరణ తీసుకొచ్చారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పీఆర్సీ అమలు విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగ సంఘాలు నిర్వహించిన చలో విజయవాడకు ఉపాధ్యాయులు భారీగా తరలివచ్చారు. ఆ తర్వాత వారు ఆందోళనకు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల విధులకు ఉపాధ్యాయులను వినియోగిస్తే ఇబ్బందులు వస్తాయని భావించిన ప్రభుత్వం ఇప్పుడు ఈ సవరణ చేసిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత ప్రభుత్వం ఎన్నో విప్లవాత్మక చర్యలు తీసుకున్నందున ఉపాధ్యాయులు బోధన పనులకే పరిమితం కావాల్సిన అవసరం ఉందని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

ఉపాధ్యాయులను బోధన పనులకే పరిమితం చేస్తూ ప్రభుత్వం విద్యా హక్కు చట్టం నియమాలను సవరించడంపై ఉపాధ్యాయ సంఘాలు స్పందించాయి. ఎన్నికలు, జనగణన నుంచే కాకుండా పాఠశాలల్లోని అన్ని బోధనేతర పనుల నుంచి ఉపాధ్యాయులను మినహాయించాలని డిమాండు చేశాయి.

యూటీఎఫ్​ నేతలు ఏమన్నారంటే :ఉపాధ్యాయులు ఎన్నికల విధులు నిర్వహించడం అనేది రాజ్యాంగం ఇచ్చిన బాధ్యతని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్ తెలిపారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఉపాధ్యాయులు ఎన్నికల విధులు నిర్వహించేవారని గుర్తు చేశారు. నేడు ఏపీ ప్రభుత్వం ఉపాధ్యాయులను ఎన్నికల విధులకు దూరం చేసిందన్నారు. ఎన్నికల విధుల నుంచి తప్పించడం అనేది రాజకీయ కోణంలో తీసుకున్నారా అనే అంశంపై ఆలోచించాలన్నారు.

ప్రభుత్వ నిర్ణయాన్ని పరిశీలించిన తర్వాత తాము స్పందిస్తామన్నారు. బోధనేతర పనుల నుంచి ఉపాధ్యాయులను దూరం చేస్తామని గత చర్చల్లో మంత్రి బొత్స హమీ ఇచ్చారు. బోధనేతర పనులకు ఉపాధ్యాయులను దూరంగా ఉంచడాన్ని తాము స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. ఉపాద్యాయుల సమస్యలపై రేపు విజయవాడలో రాష్ట్ర స్థాయి ధర్నా నిర్వహిస్తున్నామని, ఆ ధర్నాను విఫలం చేయాలని ప్రభుత్వం చూస్తోందన్నారు. ఉపాధ్యాయులు విజయవాడ రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు.

ఇవీ చదవండి:

Last Updated : Nov 30, 2022, 6:27 AM IST

ABOUT THE AUTHOR

...view details