E-Stamp Benefits : నాన్ జ్యూడిషియల్ స్టాంపులు గవర్నమెంట్ కార్యాలయాల్లో దొరక్క బ్లాక్‌లో అధికంగా డబ్బులు వెచ్చించి కొనాల్సిన పని ఇక ఉండదు. బ్యాంకులో చలానా కట్టడానికి క్యూ కట్టాల్సిన అవసరమూ లేదు. స్టాంపుల కృత్రిమ కొరత, అధిక ధరల దండా నేపథ్యంలో ఈ-స్టాంపులు కొండంత అండగా మారనున్నాయి. మరో రెండు వారాల్లో రిజిస్ట్రేషన్ సేవలు సైతం ఈ స్టాంపు విధానంలో అందుబాటులోకి రానున్నాయి. ఈ స్టాంపుల విధానం ప్రత్యేకతలేంటీ, ఈ స్టాంపులకు సంబంధించిన మరిన్ని సేవలు ప్రజలకు ఎప్పటిలో అందుబాటులోకి రానున్నాయన్న విషయాలు తెలుసుకోవాలంటే ఈ కథనం చూడాల్సిందే.
చాలా మంది బ్యాంకులోన్లు, తనఖాలు, అఫిడివిట్లు, అగ్రిమెంట్లు వంటి వాటికోసం నాన్ జ్యూడిషియల్ స్టాంపులను అధిక మొత్తం ఖర్చు చేసి కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ ఇబ్బంది లేకుండా ఈ స్టాంపు విధానాన్ని ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి తీసుకు వచ్చింది. దీనిపై అవగాహన లేని వారు ఇప్పటికీ అగ్రిమెంట్లు చేసుకోవడానికి, అఫిడవిట్లు వంటివి ఇవ్వడానికి, రుణ అగ్రిమెంట్లు వంటి లావాదేవీలకి నాన్ జ్యూడీషియల్ స్టాంపు పేపర్ల పైనే ఆధారపడుతున్నారు. ఈ-స్టాంపుల సేవలు ఇప్పటికే కామన్ సర్వీసు కేంద్రాల్లో అందుబాలోకి వచ్చాయి. ఈ విషయంపై అధికారులు ప్రజలకు మరింత అవగాహన కల్పించాల్సి ఉంది. ఈ-స్టాంపులు నాన్ జ్యూడీషియల్ స్టాంపు పేపర్ల కంటే ఎక్కువ పారదర్శకం. తప్పుడు స్టాంపు పేపర్లు సృష్టించడానికి, తప్పుడు తేదీలతో ధృవ పత్రాలు తయారు చేయడానికి అవకాశాలు తక్కువ. ఈ-స్టాంపుల సేవలు కామన్ సర్వీసు కేంద్రాల్లో సైతం అందుబాటులోకి తీసుకురావడంతో ప్రజలకు మరింత మేలు చేకూరనుంది.