BAR LICENSE: మూడు సంవత్సరాల నిర్వహణ నిమిత్తం బార్లకు నిర్వహించిన ఈ-వేలం కృష్ణాజిల్లాలో పూర్తైంది. జిల్లా నుంచి ప్రభుత్వానికి రూ.30.07 కోట్ల ఆదాయం సమకూరింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 37 బార్లకు ఈ- వేలం నిర్వహించగా.. 59 మంది బిడ్‌లో పాల్గొన్నారు. దరఖాస్తుల ద్వారా రూ.4.10 కోట్లు రాగా, బిడ్ల ద్వారా రూ.25.97 కోట్లు ఆదాయం చేకూరింది. అత్యధికంగా తాడిగడప మున్సిపాలిటీ పరిధిలోని ఏడు బార్లకు రూ.97 లక్షలు చొప్పున బిడ్లు ఖరారైంది. అత్యల్పంగా అవనిగడ్డలోని ఒక బార్‌కు రూ.25లక్షల ధర పలికింది. జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ సునీత వీడియో కాన్ఫరెన్స్ నుంచి పర్యవేక్షించారు.
NTR: ఎన్టీఆర్ జిల్లాలో ఈ బార్ల వేలం ప్రక్రియ ముగిసింది. తిరువూరులో అత్యధికంగా రూ.59 లక్షలు పలికింది. ఒక్క బార్ కోసం ముగ్గురు పోటీపడ్డారు. విజయవాడ పరిధిలో 110 బార్లలో 109 బార్లకు వేలం ఖరారు చేశారు. విజయవాడ పరిధిలోని ఓ బార్ రూ.54 లక్షలు పలికింది.
ఇలా సాగింది:రాష్ట్రంలో అత్యధికంగా కడపలో బార్ కోసం కోటి 83 లక్షల90 వేల రూపాయలు కోట్ చేసి వైకాపా నాయకుడు ఒకరు లైసెన్సు దక్కించుకున్నారు. ఇదే నగరంలో ఓ వ్యాపారి కోటి 81 లక్షల 90 వేలకు వేలం పాడుకున్నారు. కడపలో మొత్తం 12 బార్లకు వేలం నిర్వహించగా అవన్నీ కోటి 55 లక్షల కన్నా ఎక్కువకే పలికాయి. ఈ బార్లన్నీ వైకాపా నాయకులే దక్కించుకున్నారు. కడపలో బారు లైసెన్సు రుసుము ఇప్పటివరకూ 35 లక్షల రూపాయలు ఉండేది. ఇప్పుడు మాత్రం బార్‌ను గరిష్ఠంగా కోటి 83 లక్షల90 వేల రూపాయలకు వేలం పాడి దక్కించుకున్నారు. అంటే ప్రస్తుతమున్న లైసెన్సు ధరపై దాదాపు అయిదున్నర రెట్లు అధిక మొత్తానికి వేలం పాడారు. ఆ సొమ్ము తిరిగి రాబట్టుకోవాలంటే ఆ భారమంతా మందుబాబులపైనే వేస్తారు. అనంతపురంలో కోటి 66 లక్షలకు, తిరుపతిలో కోటి 59 లక్షలకు, నాయుడుపేటలో కోటి 35లక్షలకు అత్యధిక మొత్తాల్లో వేలం పాడి పలువురు బార్ లైసెన్సులు దక్కించుకున్నారు. రాష్ట్రంలో అత్యధిక బార్లు అధికార వైకాపా నాయకులే దక్కించుకున్నారు. అంతంత భారీ మొత్తాలకు బార్లు దక్కించుకున్నవారు ఆ మొత్తాల్ని తిరిగి రాబట్టుకోవటంతో పాటు పెట్టిన పెట్టుబడిపై లాభాలు ఆర్జించడానికి అడ్డూఅదుపూ లేకుండా మద్యం ధరలు పెంచి విక్రయిస్తారు. ఫలితంగా బారులలో మద్యం ధరలు పేలిపోనున్నాయి. కూర్చొని మద్యం తాగాలనుకునేవారిపై పెను భారం పడుతుంది. అక్రమాలకు ఆస్కారం ఏర్పడుతుంది.
బార్ల ఈ-వేలానికి సంబంధించి ఆయా నగరాల జనాభాను బట్టి 50 లక్షలు, 35 లక్షలు, 15 లక్షల్ని అప్‌సెట్ ధరగా ఖరారు చేశారు. 35 లక్షలు అప్‌సెట్ ధరగా నిర్ణయించిన కొన్ని పట్టణాలు, నగరాల్లో బార్లు వేలంలో కోటిన్నరకు పైగా ధర పలికాయి. ఈ-వేలానికి రాయలసీమ జిల్లాల్లో భారీగా పోటీ నెలకొనగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో మాత్రం పెద్దగా పోటీ లేదు. కడప, తిరుపతి, అనంతపురం నగరాల్లో అప్‌సెట్ ధర 35 లక్షలు కాగా.... నాయుడుపేటలో అప్‌సెట్ ధర 15 లక్షలు. వేలంలో పాల్గొన్నవారు ఆ ధరపై 2 లక్షల చొప్పున పెంచుకుంటూ వెళ్లాలి. ఇక్కడ బార్లను కోటి కంటే ఎక్కువ మొత్తాలకు కోట్ చేసి వ్యాపారులు లైసెన్సులు దక్కించుకున్నారు. ఆయా నగరాల్లో బార్‌లలో రేట్లు పేలిపోనున్నాయి.