ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Dussehra Sharan Navaratri Celebrations in AP: భక్తి శ్రద్ధలతో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు.. ఇంద్రకీలాద్రిపై 'మహాచండీ' దర్శనం

Dussehra Sharan Navaratri Celebrations in AP: రాష్ట్ర వ్యాప్తంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే వివిధ ఆలయాలకు చేరుకుంటున్న భక్తులు.. ప్రత్యేక అలంకారంలో వేంచేసిన అమ్మవారిని దర్శించుకుంటున్నారు.

Dussehra_Sharan_Navaratri_Celebrations_in_AP
Dussehra_Sharan_Navaratri_Celebrations_in_AP

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 19, 2023, 1:12 PM IST

Dussehra Sharan Navaratri Celebrations in AP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. కనకదుర్గమ్మ అమ్మవారు నేడు మహాచండీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచి భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. కేంద్రమంత్రి నారాయణస్వామి దుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ ఏడాది దసరా ఉత్సవాల్లో విశేష అలంకారంగా మహాచండీ రూపంలో అమ్మవారిని అలంకరించారని ఆలయ అర్చకులు తెలిపారు.

దేవీ శరన్నవరాత్రులలో భాగంగా డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేటలోని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ఆర్యవైశ్య సంఘం భక్తులు 25 లక్షల రూపాయలు విలువైన గురువారం బంగారు కిరీటాన్ని, కనుబొమ్మలను సమర్పించారు. వాసవి వైద్య సంఘం ఉత్సవ కమిటీ ఛైర్మన్ గ్రంధి సాయిబాబా, సీతా మహాలక్ష్మి దంపతులు ఈ బంగారు కిరీటాన్ని, కనుబొమ్మలను అమ్మవారికి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి.. అందజేశారు.

Tanuku Kanaka Durgamma Annapurna Devi Alankaram: గోస్తని తీరాన అన్నపూర్ణ అలంకారంలో దుర్గాదేవి.. పోటెత్తిన భక్తులు

విశాఖ శ్రీ శారదాపీఠంలో రాజశ్యామల అమ్మవారి శరన్నవరాత్రిమహోత్సవాలు కొనసాగుతున్నాయి. రాజశ్యామల అమ్మవారు ఐదో రోజు లలితా త్రిపురసుందరి దేవి అవతారంలో దర్శనమిచ్చారు. చెరకు గెడ చేతపట్టిన అమ్మవారి అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వామి అమ్మవారి అలంకరణకు హారతులిచ్చి పూజలు చేశారు. శరన్నవరాత్రి సందర్భంగా లోక కల్యాణార్థం చేపట్టిన రాజశ్యామల యాగం కొనసాగుతోంది.

పశ్చిమగోదావరి జిల్లాలోని ప్రసిద్ధ అమ్మవార్ల ఆలయాల్లో శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు తణుకు గోస్తని తీరాన వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు.. అన్నపూర్ణ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారు వామ హస్తంలో రసాన్న పాత్ర ధరించి పరమేశ్వరునికి అన్నప్రసాదాన్ని వితరణ చేస్తూ దర్శనమిస్తున్నారు. అన్నపూర్ణ దేవి అలంకారంలో అమ్మవారిని దర్శించుకుంటే భవిష్యత్తులో అన్న పానాదులకు లోటు ఉండదని భక్తులు విశ్వసిస్తారు. అక్షయపాత్ర ధరించిన అమ్మవారు అన్న ప్రసాదినిగా అనుగ్రహిస్తారని నమ్ముతారు.

Indrakeeladri Sharan Navaratri Utsavalu 2023: ఇంద్రకీలాద్రిపై ఘనంగా శరన్నవరాత్రి వేడుకలు.. అన్నపూర్ణాదేవిగా కరుణించిన దుర్గమ్మ

అన్నపూర్ణ దేవి కృపా కటాక్షాలు ప్రసాదించాలని కోరుకుంటూ మహిళలు సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. సుమారు 200 మంది మహిళలు సామూహిక కుంకుమ పూజలో పాల్గొన్నారు. దాతలు మహిళలకు పూజా సామగ్రిని సమకూర్చారు. విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలుగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాటు పూర్తి చేశారు. మరోవైపు.. తణుకు గోస్తని తీరాన వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారు గజలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. మత్తేభాలను మదించిన అమ్మవారిగా భక్తుల కష్టాలను పోగొట్టి సుఖశాంతులను ప్రసాదించే లక్ష్మీదేవిగా అమ్మవారిని భావిస్తారు. గజలక్ష్మి అలంకారంలో దర్శనమిస్తున్న అమ్మవారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

పశ్చిమగోదావరి జిల్లాలో తణుకు మండలం మండపాక గ్రామంలో వేంచేసియున్న ప్రసిద్ధ శ్రీ ఎల్లారమ్మ అమ్మవారి ఆలయంలో ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఐదో రోజు భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అభిషేకాలు చేశారు. భక్తుల కొంగుబంగారంగా విలసిల్లే అమ్మవారిని శరన్నవరాత్రుల సందర్భంగా సర్వాంగ సుందరంగా అలంకరించారు. అమ్మవారిని స్వర్ణాభరణ భూషితురాలిగా తీర్చిదిద్దారు. ఏకవీర దేవి అంశతో వెలసిన అమ్మవారిని శరన్నవరాత్రి రోజుల్లో దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని సర్వ శుభాలు జరుగుతాయని భక్తులు నమ్ముతారు. మహిళలు అమ్మవారికి సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థాన పాలకవర్గం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

దేవి శరన్నవరాత్రి వేడుకలు బాపట్లజిల్లా చీరాలలో వైభవంగా జరుగుతున్నాయి. దేవాలయాలే కాకుండా చలువపందిళ్లు వేసి అమ్మవారి విగ్రహాలు ఏర్పాటుచేసి భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. చీరాల, వేటపాలెం, చినగంజాం, పర్చూరు, మార్టూరు, ద్రోణాదుల ప్రాంతాల్లో అమ్మవారి నవరాత్రులు కన్నుల పండువగా సాగుతున్నాయి. ద్రోణాదులలోని అంకమ్మతల్లి శక్తి క్షేత్రంలో రోజుకొక అలంకారంలో అంకమ్మతల్లి భక్తులకు దర్శనమిస్తున్నారు.

Dussehra Sharannavaratri Celebrations: రాష్ట్రవ్యాప్తంగా వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు.. ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు

ABOUT THE AUTHOR

...view details