Durga Ganesha idols removed in Vijayawada: విజయవాడ నగరంలోని వాంబే కాలనీ 58వ డివిజన్‌లో కార్పొరేషన్ అధికారులు ఈరోజు జేసీబీతో దుర్గామాత, వినాయకుడి విగ్రహాలను తొలగించడంపై స్థానికుల ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు, కార్పొరేషన్ అధికారులు హిందూ దేవతామూర్తులను ఘోరంగా అవమానించారంటూ మహిళలు ఆందోళన చేపట్టారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు.. పోలీసుల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. విగ్రహాలను ఎక్కడిన్నుంచి తీశారో.. అక్కడే మళ్లీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. భారీగా స్థానికులు అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.
వైసీపీ ప్రభుత్వంలోనే హిందూ ఆలయాలపై దాడులు విపరీతంగా జరుగుతున్నాయని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. భక్తులు ఎంతో ఇష్టంగా పూజలు చేస్తున్న విగ్రహాలను కార్పొరేషన్ అధికారులు అవమానకర రీతిలో తొలగించారని మండిపడ్డారు. మహిళలు అడ్డుపడినా, వారిని పక్కకు లాగి పడేశారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో అనేక చోట్ల విగ్రహాలను ధ్వంసం చేసినా, వాటిని తొలగించినా నో కేసు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇక్కడ ప్రొక్లెయిన్‌తో విగ్రహాన్ని లాగేయడం సమంజసమా? అంటూ ప్రశ్నించారు.