- DSC 98 : డీఎస్సీ-98లో ఉత్తీర్ణులై వివిధ కారణాలతో అప్పట్లో పోస్టింగులు దక్కని అభ్యర్థులను.. తాజాగా మినిమం టైం స్కేల్ విధానంలో నియమించుకోవడానికి రాష్ట్ర క్యాబినెట్ బుధవారం ఆమోదం తెలపింది. దీంతో సంబంధిత అభ్యర్థుల్లో నియామకాలు ఎలా చేపడతారనే ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే అభ్యర్థులు తమ విద్యార్హత పత్రాలను అధికారులతో పరిశీలన చేయించుకున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో వెయ్యి మందికి పైగా అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యారు. విచారణకు వచ్చిన వారిలో కొందరు 60 ఏళ్ల పైన వారు ఉన్నారు. వీరు వయోపరిమితి దాటిపోయారని రాసుకున్నారు. విచారణ సమయంలోనే వారిని నిరుత్సాహానికి గురిచేయరాదని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వారి పత్రాలు పరిశీలించి అక్‌నాలెడ్జిమెంట్ ఇచ్చారు.
ప్రకటించిన పోస్టుల కంటే రెట్టింపు అభ్యర్థులు : క్యాబినెట్ 4534 పోస్టులకు ఆమోదముద్ర వేసింది. అయితే అభ్యర్థులు మాత్రం ధ్రువపత్రాల విచారణకు 7500కు పైగా హాజరయ్యారు. ఒక్క ఉమ్మడి గుంటూరులోనే వెయ్యి మంది వరకు ఉన్నారు. ప్రభుత్వం ప్రకటించిన పోస్టుల ప్రకారం చూస్తే గుంటూరుకు 400 పోస్టులకు మించి రాకపోవచ్చని విద్యాశాఖ వర్గాల సమాచారం. అభ్యర్థులు మాత్రం రెండు రెట్లు అధికంగా ఉన్నారు. ఇంచుమించు అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి. ఉత్తీర్ణులైన ప్రతి ఒక్కరిని తీసుకోవాలంటే ఉన్న పోస్టులు సరిపోవని, అదనంగా కొన్ని సూపర్ న్యూమొరీ పోస్టులు సృష్టిస్తే తప్ప వారందరిని తీసుకోవటానికి వీలుపడదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని కచ్చితంగా ఈ నియామకాల్లో మెరిట్ కం రోస్టర్ విధానాన్ని పాటించాలని ఉన్నతాధికారులు మొగ్గుచూపినట్లు విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. ఇలా చేయడం వల్ల అభ్యర్థులు చాలా వరకు తగ్గిపోతారు. ఆపై 60 ఏళ్ల పైన వారు కొందరు అనర్హులవుతారు. ఇవన్నీ పోగా మిగిలిన పోస్టులకు సరిపడా అభ్యర్థులను తీసుకుంటారని, ఇలా చేస్తే సూపర్‌న్యూమొరీ పోస్టులు సృష్టించాల్సిన అవసరం ఉండదని అంటున్నారు. రోస్టర్‌కం మెరిట్ ప్రాతిపదికన నియామకాలు చేసుకోవడానికి ఉన్నత స్థాయిలో కసరత్తు చేస్తున్నారు. గతేడాది డిసెంబరులో ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్ బదిలీలు నిర్వహించాలని, మూడేళ్లుగా బదిలీలు లేవని ప్రభుత్వం హడావుడి చేసింది. ఈ మేరకు జిల్లాల వారీగా క్లియర్ వెకెన్సీలు, ఒకే పాఠశాలలో 8 ఏళ్లకు పైగా చేస్తున్న వారి పోస్టులను ఖాళీలుగా చూపిస్తూ జిల్లాల వారీగా గుర్తించింది. ఆ మేరకు ఎంత మంది బదిలీకి అర్హులవుతారో, ఆ మేరకే ఖాళీ పోస్టులను కౌన్సెలింగ్ జాబితాలో ఉంచి మిగిలినవి బ్లాక్ చేశారు.