Drum artists Dharna : తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విజయవాడ ధర్నా చౌక్ వద్ద డప్పు కళాకారులు ధర్నా చేశారు. డప్పు కళాకారులకు గుర్తింపు కార్డులు ఇచ్చి దేవాలయ కమిటీల్లో నియమించాలని డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ బాబు డిమాండ్ చేశారు. దీంతోపాటు వారికి ఇచ్చే పింఛను మరో 5 వేల రూపాయలు పెంచాలని, వయో పరిమితి 45 సంవత్సరాలకు తగ్గించాలని అన్నారు.
హక్కులను కాలరాస్తున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం :నాణ్యమైన డప్పు, గజ్జెలు, యూనిఫాంను వయసుతో సంబంధం లేకుండా పంపిణీ చేయాలన్నారు. ప్రభుత్వ పథకాల ప్రచారంలో డప్పు కళాకారులను భాగస్వాములను చేయాలన్నారు. తుంగభద్ర పుష్కరాలలో ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న కళాకారుల బకాయిలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో సాధించుకున్న హక్కులను వైఎస్సార్సీపీ ప్రభుత్వం కాలరాస్తుందని ఆనంద్ బాబు మండిపడ్డారు.
డప్పు వాయిస్తూఉద్యమాన్ని తీవ్ర తరం చేస్తాం : ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి.. 4 ఏళ్లు గడిచినా.. ఇప్పటికి కూడా అవి అమలు చేయలేదని ఆయన అన్నారు. తక్షణమే తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేదంటే డప్పు వాయిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్ర తరం చేస్తామని హెచ్చరించారు.