AP Dalit Employees Leaders : కడప జిల్లా పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ అచ్చన్న మృతికి కారకులైన వారిని శిక్షించాలని.. దళిత ఉద్యోగుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. విజయవాడ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ కార్యాలయ సమావేశ మందిరంలో అచ్చన్న సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సభకు రాష్ట్ర మంత్రి సీదిరి అప్పలరాజు హాజరయ్యారు. ఆయన సభ ప్రాంగాణానికి చేరుకోగానే అచ్చన్న మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని.. రాష్ట్ర పశుసంవర్థక శాఖ సంచాలకులు అమరెందర్ని సస్పెండ్ చేయాలని దళిత ఉద్యోగుల సంఘం నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ హత్య జరిగిందని దళిత ఉద్యోగుల సంఘం నాయకులు విమర్శించారు. దళిత ఉద్యోగులకి రక్షణ కల్పించాలని కోరారు. కుల వివక్షతోనే అచ్చన్నను హత్య చేశారని వారు అనుమానం వ్యక్తం చేశారు. అచ్చన్న మృతిపట్ల హైకోర్టు సిట్టింగ్ జడ్జ్‌తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అచ్చన్న మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని మంత్రిని.. ఉద్యోగులు, దళిత సంఘాల నాయకులు కోరారు.
ఈ కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ హాజరయ్యారు. కడప జిల్లా పోలీసులు పశుసంవర్థక శాఖ డైరక్టర్ అమరెందర్కి కొమ్ముకాశారని మందకృష్ణ విమర్శించారు. అచ్చన్న కుమారుడిపై ఒత్తిడి తీసుకొచ్చి అమరెందర్ పేరుని పోలీసు ఎఫ్ఐఆర్ నుంచి తొలగించారన్నారు. అచ్చన్న కుటుంబ సభ్యుల్లో ఒకరికి గ్రూప్ 1 ఉద్యోగం ఇవ్వాలన్నారు. దళితులు జగన్మోహన్ రెడ్డిపై నమ్మకంతో ఓట్లు వేశారని.. వారికి న్యాయం చేయాలన్నారు. లేకపోతే రాబోయే ఎన్నికల్లో దళితులు సరైన బుద్ధి చెబుతారన్నారు.