ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Double Suicide: ప్రాణాలు మీదకు తెచ్చిన అత్యాశ.. వసూలు చేసిన నగదు తిరిగి ఇవ్వలేక..

Vijayawada Man And Woman Suicide: నగదు మీద అశతో వ్యాపారం చేయాలని వారిద్దరూ అనుకున్నారు. కానీ, అది కాస్త అత్యాశకు దారి తీసింది. కొన్ని రోజుల తర్వాత వారి వ్యాపారంలో వచ్చిన నష్టాల వల్ల.. వారికి ఇబ్బందులు ఎదురయ్యాయి. చేసదేమి లేక ఇద్దరూ బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు.

Double Suicide In Vijayawada
విజయవాడలో జంటగా ఆత్మహత్య

By

Published : Jun 11, 2023, 11:50 AM IST

Double Suicide In Vijayawada: గోల్డ్‌ స్కీం పేరుతో నగదు వసూలు చేసి.. తిరిగి వాటిని చెల్లించలేక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విజయవాడలో జరిగింది. భవానీపురంలో శనివారం రాత్రి ఈ ఘటన జరగగా.. మృతులు ఇద్దరూ సుమారు 2కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసినట్లు.. వీరికి నగదు ఇచ్చిన బాధితులు చెప్తున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. దివి తారకరామారావు(50) అనే వ్యక్తి భవానీపురం నేతాజీ స్కూలు రోడ్డులో నివాసం ఉండేవారు. ఇతను వన్‌టౌన్‌లో బంగారం వ్యాపారం చేసేవారు. ఆయనకు కొన్ని సంవత్సరాల క్రితం.. అదే ప్రాంతంలోని బాలభాస్కర్‌నగర్‌లో నివాసం ఉండే తుపాకుల దుర్గాదేవి(48)తో పరిచయం ఏర్పడింది.

వీరిద్దరూ కలిసి దుర్గాదేవి గోల్డ్‌ స్కీం పేరుతో వ్యాపారాన్ని ప్రారంభించారు. ఈ గోల్డ్​ స్కీంలో చేరిన వారు నెలకు కొంత మొత్తం చెల్లిస్తే.. వారికి బంగారు ఆభరణాలు ఇస్తామంటూ నమ్మబలికారు. దుర్గాదేవి గతంలో దుస్తుల వ్యాపారం చేసేవారు. ఆ వ్యాపార సమయంలో పరిచయమైన మహిళలను గోల్డ్‌ స్కీంలో సభ్యులుగా చేర్పించారు. వారి నుంచి నుంచి డబ్బులు వసూలు చేశారు. వీరు నగదు సేకరణను పలుమార్గాల్లో చేసేవారు. గోల్డ్‌ స్కీంతోపాటు చీటీలు వేయడం, వడ్డీలకు డబ్బులు తీసుకోవడం చేసేవారు.

2 కోట్ల రూపాయలకు పైగానే నగదు వసూలు చేశారు. కొన్నాళ్లుగా దుర్గాదేవి, తారాకరామారావు చేస్తున్న వ్యాపారంలో నష్టాలు వచ్చాయి. దీంతో స్కీం సభ్యులకు ఆభరణాలు ఇవ్వడం, అప్పు ఇచ్చిన వారికి తిరిగి చెల్లించడం కష్టంగా మారింది. దీంతో ఒకరి వద్ద నుంచి డబ్బులు తీసుకోవడం, మరొకరికి చెల్లించడం నమ్మకంగా చేస్తూ ఉండేవారు. చీటీ పాడుకున్న వారికి 2 రూపాయల నుంచి 3 వడ్డీ ఇస్తామంటూ నమ్మకంగా చెప్పి ఆ డబ్బులు ఇచ్చేవారు కాదు.

చీటీలు వేసిన వారు కూడా లక్షల్లోనే వారికి డబ్బులు ఇచ్చారు. ఈ క్రమంలో తారకరామారావు అనారోగ్యానికి గురయ్యారు. ఖాతాదారులకు డబ్బులు చెల్లించడం కష్టంగా మారింది. తిరిగి తీర్చే పరిస్థితి లేకపోవడంతో వారు చనిపోవాలని నిర్ణయించుకున్నారు. భవానీపురం బాలభాస్కర్‌నగర్‌లోని దుర్గాదేవి నివాసంలో ఇద్దరూ కలిసి శనివారం సాయంత్రం పురుగుల మందు తాగారు. అపస్మారక స్థితిలో ఉన్న వారిని బంధువులు ఆసుపత్రికి తరలించగా చనిపోయినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న ఖాతాదారులు వారి ఇళ్ల వద్దకు భారీగా చేరుకుని లబోదిబోమన్నారు. రూ.లక్షల్లో డబ్బు ఇచ్చామంటూ పోలీసుల వద్ద మొర పెట్టుకున్నారు. తమకు న్యాయం చేయాలని కోరారు. తారకరామారావు కుమార్తెకు నెల రోజుల కిందట వివాహం చేశారు. నెల రోజులకే ఆయన చనిపోవడంతో స్థానికంగా విషాదం నెలకొంది.

పది సంవత్సరాలుగా రామారావు వారి కుటుంబానికి తెలుసని ఓ బాధితురాలు తెలిపారు. పరిచయమున్న కారణంగా ఆయన వద్ద గోల్డ్‌ స్కీంలో సభ్యులుగా చేరామని ఆమె వివరించారు. ఆ తర్వాత వడ్డీ ఇస్తానని చెప్పి డబ్బులు కావాలని అడగినట్లు పేర్కొంది. దీంతో అతనికి విడతల వారీగా 70లక్షల రూపాయలకు పైగా ఇచ్చినట్లు వాపోయింది. వారి స్థలాన్ని విక్రయించి మరి డబ్బులు ఇచ్చామని.. అనేక మంది డబ్బులు ఇచ్చారని న్యాయం చేయాలని కోరింది.

రామారావుతో వారి కుటుంబానికి పరిచయం ఉందని మరో మహిళ ముందుకు వచ్చింది. ఆ పరిచయంతోనే తెలిసిన వారి వద్ద నుంచి తీసుకుని 25లక్షల రూపాయలకు పైగా డబ్బులు ఇచ్చినట్లు తెలిపింది. ఇప్పుడు వారంతా తనను డబ్బులు అడుగుతున్నారని.. ఏం చేయాలో తెలియడం లేదని వాపోయింది. కుమార్తె చదువు కోసం ఉంచిన డబ్బులు కూడా వారు అడగటంతో వారికే ఇచ్చానని వివరించింది.

ABOUT THE AUTHOR

...view details