ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సరిపోని రైళ్లు, బస్సులు.. ప్రయాణికుల నుంచి ఇష్టారీతిన వసూలు చేస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ - బస్సులు లేక ప్రయాణికుల ఇబ్బందులు

Passengers Problems: ప్రభుత్వాలు ఎన్ని ఏర్పాట్లు చేసినా ప్రయాణికులకు రైళ్లు, బస్సులు సరిపోని పరిస్థితి నెలకొంది. ఇదే అదనుగా ప్రైవేట్ ట్రావెల్స్ ఇష్టారీతిన ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. రవాణా శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా వారు పాడిందే పాటలా మారింది. దీంతో సొంతూళ్ల ప్రయాణం భారంగా మారింది. చేసేదేమీ లేక ఎక్కువ ధరైనా సరే సంక్రాంతికి ఊర్లో ఉండాలని చాలా మంది ప్రయాణికులు భావిస్తున్నారు. మరి, ఆ పండుగ.. ప్రయాణ కష్టాలేంటో ఇప్పుడు చూద్దాం.

Passengers Problems
ప్రయాణికుల ఇబ్బందులు

By

Published : Jan 13, 2023, 10:28 PM IST

Passengers Problems: సంక్రాంతి వేడుకలకు ప్రజలంతా సిద్ధమయ్యారు. పండుగ రోజున సొంతూళ్లో ఉండాలి అనుకునే వారు ఇప్పటి నుంచే వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు తరలివెళ్లేవారు అధికంగా ఉండటంతో రైళ్లు, బస్సులకు భారీ డిమాండ్ ఏర్పడింది. ప్రయాణికుల డిమాండ్ మేరకు రైళ్లు, బస్సులు అందుబాటులో లేకపోవడంతో వారు ప్రైవేట్ బస్సులను ఆశ్రయిస్తున్నారు. ఏటా సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు వందలాది స్టేజీ క్యారేజీలు రోడ్డెక్కి ప్రయాణికుల నుంచి అధిక ధరలు వసూలు చేస్తున్నారు.

సంక్రాంతి ప్రయాణ కష్టాలు

ఎక్కువ ఏపీ వాళ్లే: హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే మ్యాక్సీ క్యాబ్​లు, మినీ బస్సులు సైతం సంక్రాంతికి అధిక ధరలు వసూలు చేస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్​లో స్థిరపడ్డ ఆంధ్రప్రాంతం వాళ్లు సొంతూళ్లకు వెళ్లడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి విజయవాడ, విశాఖ, కాకినాడ, అమలాపురం, ఏలూరు, కడప, చిత్తూరు, తిరుపతి తదితర మార్గాల్లో ప్రయాణికులు ఎక్కువగా ఉంటారు. ఇదే మంచి సమయం కావడంతో ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నారు.

ఒక్క బెర్తు కూడా ఖాళీ లేదు: అసలు సిసలైన సంక్రాంతి పండుగకు కేరాఫ్​ కోస్తాంధ్ర. ఆ ప్రాంత వాసులు ఎక్కడున్నా సంక్రాంతి వచ్చిందంటే చాలు సొంతూళ్లకు ప్రయాణమవుతారు. కానీ, ఏడాదికేడాదికి ప్రయాణం భారమవుతోంది. తక్కువ ఖర్చుతో.. సుఖంగా రైలులో ఊరెళదామని ఆశపడిన వారు నిరాశ పడుతున్నారు. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లే అన్ని రైళ్లలో పండుగ ముందు 3 రోజుల్లో బెర్తులు.. 3 నెలల ముందే నిండిపోయాయి. హైదరాబాద్ నుంచి ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలకు వెళ్లేరైళ్లలో ఒక్క బెర్తు కూడా ఖాళీగా కనిపించని పరిస్ధితి నెలకొంది. హైదరాబాద్ నుంచి ఆంధ్రకు వెళ్లే రైళ్లలో గోదావరి, ఫలక్​నుమా, చార్మినార్, శాతవాహన, ఈస్ట్ కోస్ట్, నర్సాపూర్, కృష్ణా, కోణార్క్ ఎక్స్​ప్రెస్ రైళ్లకు ఎక్కువగా డిమాండ్ ఉంటుంది.
వందల్లో వెయిటింగ్​ జాబితా..: వీటన్నింటిలోనూ జనవరి 10వ తేదీ నుంచే 10 రోజుల పాటు బెర్తులన్నీ నిండిపోయాయి. రైల్వేశాఖ ప్రత్యేకంగా 94 ప్రత్యేక రైళ్లను తర్వాత మరో 30 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ రైళ్ల పైనే ప్రయాణికులు ఆశలు పెట్టుకున్నారు. 11,12, 13 తేదీల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుందని.. రైల్వేశాఖ అంచనా వేస్తుంది. ఇటీవల ప్రకటించిన 30 ప్రత్యేక రైళ్లలోనూ వెయిటింగ్ జాబితా వందల్లో కన్పిస్తుంది. దీంతో ప్రయాణికులు మరో గత్యంతరం లేక ప్రైవేట్ బస్సులను ఆశ్రయించాల్సి వస్తుంది.

ప్రత్యేక బస్సులు ఏర్పాటు: రైళ్లలో బెర్తులు లేకపోవడంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం కోసం టికెట్ బుకింగ్ కేంద్రాలకు పరుగులు పెడుతున్నారు. ఆర్టీసీ లోనూ అదే పరిస్ధితి నెలకొంది. పండుగ ముందు , తర్వాతి రోజుల్లో హైదరాబాద్ నుంచి ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు నడిచే అన్ని బస్సుల్లోనూ సీట్లు నిండిపోయాయి. రద్దీ దృష్ట్యా ఈసారి ఆర్టీసీ పండుగకు ముందు, తర్వాతి రోజుల్లో ఏపీ ఆర్టీసీ 6,400 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. సంక్రాంతి పండుగ ముందు ఈ నెల 6 నుంచి 14 వరకు 3120 బస్సులు, పండుగ తర్వాత ఈ నెల 15 నుంచి 18 వరకు 3280 బస్సులు నడపుతోంది.

టీఎస్​ఆర్టీసీ అదనపు చార్జీలు వసూలు చేయలేదు: సాధారణంగా నడిపే బస్సులకు అదనంగా ఈ బస్సులు తిప్పనున్నారు. తెలంగాణ ఆర్టీసీ కూడా సంక్రాంతి పండుగ 4,233 ప్రత్యేక బస్సులను నడిపిస్తుంది. ఈసారి ప్రత్యేకబస్సులకు ఎటువంటి అదనపు చార్జీలు వసూలు చేయడం లేదని ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు 2,720 బస్సులను, ఆంధ్రప్రదేశ్​కి 1,356 బస్సులను, కర్ణాటకకు 101 బస్సులను, మహారాష్ట్రకు 56 బస్సులను ఆర్టీసీ నడిపిస్తుంది.

ప్రైవేట్ బస్సు ధరలు 50 శాతం పెంపు: సొంతూళ్లకు వెళ్లేవారు ఎక్కువగా ఈనెల 12,13వ తేదీల్లోనే బయలుదేరేందుకు సిద్ధం అయ్యారు. టికెట్ల కోసం ఎన్నో పాట్లు పడుతున్నారు. ఐతే, ఇదే అదనుగా ప్రైవేట్​ బస్సుల యాజమాన్యాలు సాధారణ రోజుల్లో ఉండే ఛార్జీలకు దాదాపు 50% పెంచేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచడంతో పాటు తెలంగాణలో కొత్తగా నాన్ఏసీ స్లీపర్ బస్సులు సైతం అందుబాటులోకి రావడంతో ప్రైవేట్ ట్రావెల్స్ పై తీవ్ర ప్రభావం పడిందని పలువురు ఏజెంట్లు చెబుతున్నారు. ఐనా, బస్సులు సరిపోవడం లేదు. ఇదేకాక సరైన సదుపాయాలు కలిగిన బస్సులు ఆర్టీసీ నడపలేక పోవడంతో పలువురు ప్రయాణికులు ప్రైవేటు బస్సులలో వెళ్తున్నారు.

నిబంధనలు పట్టించుకోని ట్రావెల్స్​ బస్సులు: పండుగ రద్దీని సొమ్ము చేసుకునేందుకు ప్రైవేటు ట్రావెల్స్ పలురకాల అడ్డదారులు తొక్కుతున్నాయి. ప్రయాణికులకు గత్యంతరం లేదని భావించి నిలుపు దోపిడీ చేస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం, కాకినాడ, భీమవరం, విశాఖ తదితరప్రాంతాలకు వెళ్లే మార్గాల్లో డిమాండ్ విపరీతంగా ఉంటోంది. పండుగ ముందు, తర్వాత రోజుల్లో ఆయా ప్రాంతాలకు నడిచే ట్రావెల్స్ బస్సు సర్వీసుల టికెట్ ధరలను మూడింతలు పెంచారు. నిబంధనలు బేఖాతరు చేస్తున్న కొన్నింటిపై ఇప్పటికే అధికారులు గురి పెట్టారు. హైదరాబాద్​లోని కొన్ని ప్రాంతాల్లో రవాణా అధికారులు తనిఖీలు చేస్తున్నారు.

ప్రైవేట్​ వాహనాలు అద్దెకి తీసుకొని: రైళ్లలో బెర్తులు లేవు.. ఆర్టీసీ బస్సుల్లో సీట్లు లేవు.. ప్రైవేట్బస్సుల్లో అధిక ధరలు.. వెరసి పండుగ ప్రయాణం ఎంతో భారమైంది. ప్రతి పండుగ లాగే ఈ ఏడాది కూడా ప్రజలంతా ఊళ్లలోకి వెళ్లడానికి నానా కష్టాలు పడుతున్నారు. కొంతమందైతే.. ప్రైవేటు వాహనాలను కిలోమీటర్ల చొప్పున అద్దెకు తీసుకుని మరీ ప్రయాణాలు చేస్తున్నారు. డీజిల్, పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగిన పరిస్ధితుల్లో కూడా తప్పడం లేదని వాపోతున్నారు. సొంత వాహనాలు ఉన్న వారు ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. ఐతే, ప్రయాణించే సమయంలో జాగ్రత్తలు వహించాలని అధికారులు సూచిస్తున్నారు.

ప్రయాణికులు జాగ్రత్త వహించాలి: అధికవేగం, మద్యం తాగి వాహనం నడపటం లాంటివి చేయకూడదని హెచ్చరిస్తున్నారు. వీటితో పాటు ప్రైవేట్ ట్రావెల్స్ డ్రైవర్లు ఎంతో అప్రమత్తంతోని వ్యవహారించాలని సూచిస్తున్నారు. సాధ్యమైనంత వరకు సుదూరలకు ద్విచక్ర వాహనాలపై వెళ్లే ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పండుగ ఛార్జీలు చెల్లించే స్తోమత లేని వారు పండుగ ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటున్నారు

ఈ పండుగ సమయంలో ప్రయాణం చేయాలంటే చాలా కష్టంగా ఉంది. రైళ్లో అయితే ఎక్కడ ఖాళీ ఉండడం లేదు. కనీసం బాత్​రూం తలుపులు తీయడానికి కూడా ఖాళీ లేదు. మేము ఇంకా ప్రయాణం ఎలా చేయాలి. విజయవాడ వెళ్లే మార్గం అంతా బిజీగా ఉంటుంది. బస్సుల ధరలు పెంచేశారు. - ప్రయాణికురాలు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details