AP Sadhu Parishad: రాష్ట్రంలో హిందూ వ్యతిరేక ప్రభుత్వం పాలన సాగిస్తోందని.. నాలుగేళ్లుగా హిందూ ధర్మాన్ని, సంప్రదాయాలను, ఆచారాలను మంటగలిపారని ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ ఆరోపించింది. సాధు పరిషత్ ఆధ్వర్యంలో విజయవాడలో ధార్మిక సదస్సు నిర్వహించారు. వివిధ జిల్లాలనుంచి పీఠాధిపతులు, మతాధిపతులు, సాధువులు ఈ సదస్సులో పాల్గొన్నారు. సాధు పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు శివానంద సరస్వతి, మాజీ అధ్యక్షులు వాసుదేవా నందగిరి స్వామి, విరాట్ హిందూ సంఘం అధ్యక్షులు రామ చంద్రమూర్తి, తురగా శ్రీరామ్ తదితరులు ఈ సదస్సులో పాల్గొన్నారు.
దేవాదాయశాఖను పూర్తిగా రద్దు చేయాలి..హిందూ దేవాలయాలను వెంటనే ప్రభుత్వం నుంచి తప్పించి పీఠాధిపతులు, మతాధిపతులు, హిందూ సంస్థలకు అప్పగించాలని, దేవాదాయశాఖను పూర్తిగా రద్దు చేయాలని పీఠాధిపతులు, మతాధిపతులు హిందూ సంస్థలకు ఆలయాల నిర్వహణ అప్పగించాలని తీర్మానించారు. వచ్చే ఎన్నికల్లో దేవాదాయశాఖను రద్దు చేసి దేవాలయాలను హిందూ ధార్మిక శాఖకు అప్పగించాలని.. మేనిఫెస్టోలో పెట్టే పార్టీలకే తాము మద్దతిస్తామని తెలిపారు. గోసంరక్షణ, గోశాలల నిర్వహణను పీఠాధిపతులు, మతాధిపతులు, హిందూ సంస్థలకు ఒక్కొక్కరికీ రెండెకరాల స్థలం కేటాయించి అప్పగించాలని తీర్మానించారు. నాలుగేళ్లలో వందల సంఖ్యలో హిందువుల ఆలయాలపై దాడులు జరిగి దేవతామూర్తుల విగ్రహాలను ధ్వంసం చేసినా ఇంత వరకూ బాధ్యులపై చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతే కాకుండా తిరుమలలోకి మద్యం వెళ్తుంది.. ఇప్పుడు ఏకంగా గంజాయి వెళ్తుంది.. కానీ ప్రభుత్వం వాటిని ఇప్పటివరకు అరికట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.