Devineni Uma Comments on Attacks on Margadarsi :రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాలను ఈనాడు దినపత్రిక, ఈటీవీ ఛానల్‌లో ప్రశ్నిస్తుందనే మార్గదర్శిపై దాడులు చేయిస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. నందిగామలో శుక్రవారం రాత్రి మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.
సైకో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈనాడుపై కక్ష్యతో మార్గదర్శిపై అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో దాడులు చేయిస్తున్నారని దేవినేని ఉమా ఆరోపించారు. సీఎంకు పరిపాలన చేయటం చేతకాక చతికలపడి ఈనాడు, ఈటీవీ అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మార్గదర్శిపై ముప్పేట దాడి చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే సీఐడీ, రిజిస్ట్రేషన్ల శాఖలతో దాడులు చేయించారని ఆయన తెలిపారు. పోలీసు, అగ్నిమాపక శాఖల అధికారులతోను దాడులు చేయిస్తున్నారని విమర్శించారు.
Attacks on Margadarsi Offices: కోర్టు ఆదేశాలు బేఖాతరు.. మార్గదర్శిపై మళ్లీ దాడులు
ఇవన్నీ అయిపోయ్యాక తూనికలు, కొలతల శాఖ అధికారులను సైతం తీసుకరా జగన్‌రెడ్డి అని ప్రశ్నించారు. సీఎం ఎన్ని కేసులు పెట్టుకున్న 87 ఏళ్ల సింహం లెజండ్ రామోజీరావు.. తెగులు జాతి గర్వపడే వ్యక్తి అని ఆయన కొనియాడారు. ఈనాడు పత్రిక ద్వారా తెలుగు భాష సమాజంలో మంచి గుర్తింపు వచ్చేలా కృషి చేశారని అన్నారు. తెలుగు భాష వ్యాప్తికి ఈనాడు అన్నివేళలా కృషి చేస్తుందని తెలిపారు. ఎన్నో దశాబ్ధాలు నుంచి పత్రికలు ఉన్నా తర్వాత వచ్చిన ఈనాడు జర్నలిజంలో కొత్త మార్గాన్ని చూపించిందని ఆయన గుర్తు చేశారు.
సీఎం జగన్ అవినీతి, అక్రమాలు, ఇసుక, మైనింగ్, మద్యం, సెంటు పట్టా భూముల కొనుగోలులో చేసిన రూ. లక్షల కోట్లు దోపిడీని ఈనాడు పత్రిక బయట పెడుతుందనే కక్ష్య కట్టారని విమర్శించారు. దీని కారణంగానే మార్గదర్శిని అగ్రిగోల్డ్ సంస్థతో పొల్చి తనిఖీలు చేస్తున్నారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామన్న సీఎం జగన్.. హామీ విస్మరించారని తెలిపారు.