ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వర్క్ ఫ్రం హోమ్ జాబ్ వెతుకుతున్నారా..? జర జాగ్రత్త..! అంటున్న సైబర్ నిపుణులు - Work from home jobs Cheating

Work From Home Jobs: వర్క్ ఫ్రం హోం జాబ్స్ ప్రకటనలకు ఆకర్షితులై ఎంతో మంది మోసగాళ్ల వలలో చిక్కుతున్నారు. ఉద్యోగం చేస్తున్న వాళ్లు సైతం అదనపు ఆదాయం వస్తుందన్న ఆశతో.. స్థోమతకు మించి అప్పులు చేసి మరీ డబ్బు చెల్లిస్తున్నారు. ఇంటి వద్దనే ఉద్యోగం చేస్తూ కుటుంబానికి అండగా ఉందామనుకుని విజయవాడకు చెందిన ఓ యువతి మోసపోయింది.

Work From Home Jobs
Work From Home Jobs

By

Published : Mar 23, 2023, 10:09 PM IST

Updated : Mar 24, 2023, 6:31 AM IST

Work From Home Jobs : మీ నమ్మకం, మీ బలహీనతే సైబర్ నేరస్తుల పెట్టుబడి.. రూటు మార్చి.. బాధితులను ఏ మార్చి అందినకాడికి దోచుకోవటమే ఆన్​లైన్ కేటుగాళ్ల పని.. లక్కీ డ్రా, లాటరీ, మెడిసిన్, వివిధ రకాల ఉద్యోగాలు పేరు ఏదైనా దోచుకోవటమే వాళ్ల అంతిమ లక్ష్యం. పార్ట్ టైం ఉద్యోగాలు.. ఇంట్లోనే ఉండి లక్షల రూపాయలు సంపాదించవచ్చంటూ ప్రకటనలు ఇచ్చి నగదు కాజేస్తున్నారు. ఇలా విజయవాడకు చెందిన ఓ యువతి మోసపోయింది.

రోజుకు 2 వేల రూపాయలు : విజయవాడ నగరానికి చెందిన ఓ యువతి వాట్సాప్‌కు ఇటీవల ఓ సందేశం వచ్చింది. కన్సల్టెన్సీ నుంచి.. ఇంటి నుంచి పని చేసుకునే ఉద్యోగం ఉందని ఆసక్తి ఉంటే చేరవచ్చు అని ఆ మెసేజ్ సారాంశం. పార్ట్‌ టైం ఉద్యోగం చేయొచ్చన్న ఆశతో ఆమె ఎస్‌ఎంఎస్‌లో ఇచ్చిన నెంబరుకు ఫోన్‌ చేయగా యూట్యూబ్ లింక్​లు పంపుతాం.. జస్ట్ క్లిక్ చేస్తే చాలు రోజుకు 2 వేల రూపాయలు సంపాదించవచ్చు అని నమ్మించారు. ఇచ్చిన టాస్క్‌లు చేస్తే డబ్బులు వేస్తామని చెప్పి ఆమె వివరాలు తెలుసుకుని లింక్​లు పంపారు.

రూ.10 లక్షలు మొసపోయిన యువతి : మొదట్లో కొంత నగదును ఆమె ఖాతాలో జమ చేశారు. దీంతో ఆమెకు నమ్మకం కుదిరేలా చేశారు. ప్రీపెయిడ్‌ టాస్కులు చేసినట్లయితే ఉద్యోగం పర్మినెంట్‌ అవుతుందని ఆమెను మోసగాళ్లు నమ్మబలికారు. క్రిప్టోలో పెట్టుబడి అని.. దానికి లాభం వస్తుందని చెప్పడంతో ఆమె సరేనంది. అలా మొదటగా.. రూ. 2 వేలు జమచేస్తే రూ. 2,790, రూ. 10 వేలు వేస్తే.. రూ. 11,960 వచ్చింది. ఇలా దశల వారీగా యువతి రూ. 10.52 లక్షలు వేసింది. లాభం వస్తుందని చూపుతున్నా.. ఆ డబ్బును డ్రా చేసే అవకాశం లేకపోయింది. డ్రా చేయాలంటే ఇంకొంత కట్టాలని మాయమాటలు చెబుతుండడంతో మోసపోయానని గ్రహించి ఫిర్యాదు చేసింది.

1930కి ఫోన్ :సైబర్ నేరస్తులు పోలీసులకు దొరక్కుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నకిలీ కేవైసీతో బ్యాంక్ ఖాతాలు తెరుస్తున్నారు . పేదరికంలో ఉన్న వారికి డబ్బు ఎరవేసి తమ అవసరాలకు వాడుకుంటున్నారు. బ్యాంక్ ఖాతాలు ఒక చోట, నగదు డ్రా చేసేది మరోచోట ఉండే విధంగా పక్కా పథకం ప్రకారమే నేరాలు చేస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయామని గుర్తిస్తే వెంటనే 1930 కి ఫోన్ చేయాలని సైబర్ సెక్యూరిటీ నిపుణులు సూచిస్తున్నారు. సంబంధిత అధికారికి నిందితుడి బ్యాంక్ ఖాతా, వివరాలు అందిస్తే వెంటనే ఆ ఖాతాలో నగదును సీజ్ చేసే అవకాశముంటుందని చెబుతున్నారు నిపుణులు.

లింకులను క్లిక్‌ చేస్తే ఖాతాలు ఖాళీ :ఎస్‌ఎంఎస్, వాట్సాప్, ఫేస్‌బుక్ తదితర వాటిల్లో పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి మభ్యపెట్టే యాడ్స్ కుప్పలు తెప్పలుగా వస్తుంటాయి. ఉద్యోగాల కోసం ఆన్‌లైన్‌ పోర్టల్స్‌లో వివరాలు నమోదు చేస్తుంటారు. వీటి నుంచి కూడా అభ్యర్థుల వివరాలు తీసుకుని యాడ్స్ పంపిస్తుంటారు. ఇటువంటి వాటిని నమ్మి వచ్చే లింకులను క్లిక్‌ చేస్తే ఖాతాలు ఖాళీ అవుతాయని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రకటనలను చూసి నమ్మొద్దు. వారితో ఫోన్‌లో మాట్లాడే కంటే ముఖాముఖి చర్చించుకుని సందేహాలను నివృత్తి చేసుకోవాలని, ఇటువంటి ప్రకటనలు ఇచ్చే ఏజెన్సీలు చాలా వరకు నకిలీవే ఉంటాయని సైబర్ నిపుణులు చెబుతున్నారు.

ఇవీ చదవండి

Last Updated : Mar 24, 2023, 6:31 AM IST

ABOUT THE AUTHOR

...view details