Cyber Crimes In Vijayawada : ప్రజలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎత్తుకు పైఎత్తులు వేస్తూ సైబర్ నేరగాళ్లు బ్యాంకు ఖాతాల నుంచి డబ్బు కాజేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ప్రముఖుల పేర్లతో నకిలీ ఖాతాలు సృష్టించి విజయవాడలో విచ్చలవిడిగా ప్రజల దగ్గర నుంచి సొమ్ము దోచేస్తున్నారు. పాఠశాల శాఖ ముఖ్య కార్యదర్శి పేరుతో, ఫోటోని డీపీగా పెట్టి సైబర్ కేటుగాళ్లు ఇన్‌స్టాగ్రామ్‌లో నకిలీ అకౌంట్ క్రియేట్ చేశారు. దాని నుంచి తనకు అత్యవసరంగా డబ్బు కావాలని ఆయన పంపించినట్లుగా కిందిస్థాయి ఉద్యోగులకు సందేశాలు పంపించారు. డబ్బును గూగుల్ పే చేయాలని రెండు నంబర్లు కూడా పెట్టారు. అనుమానం వచ్చిన కొంతమంది ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లడంతో మోసం బహిర్గతమైంది. దీనిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
'వర్క్ ఫ్రం హోం' మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్టు - పోలీసులు ఎలా పట్టుకున్నారంటే!
Fake Accounts With Officers Photos Cyber Cimes :తాజాగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు ఫోటో పెట్టి సైబర్ కేటుగాళ్లు ఓ నకిలీ ఖాతా ప్రారంభించారు. తనకు అర్జెంటుగా నగదు అవసరం ఉందని తహసీల్దార్లకు సందేశాలు పంపారు. కొందరు విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకురావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. యువ ఐఏఎస్ (I.A.S.) అధికారి వికాస్ మర్మత్ పేరుతోనూ సైబర్ నేరగాళ్లు నకిలీ ఎక్స్ ఖాతా సృష్టించారు. అస్వస్థతకు గురైన ఓ పాప ఫోటో పెట్టి చిన్నారి చికిత్సకు డబ్బులు పంపించాలని పోస్ట్ చేశారు. దానికి ఓ బ్యాంకు ఖాతా నంబరు, I.F.S.C. (ఐఎఫ్ఎస్సీ) కోడ్ జతపరిచారు. దీనిని గుర్తించిన వికాస్... నకిలీ ఖాతా వ్యవహారంపై కేసు పెట్టారు.