Huge cyber crime in NTR district: 'మా యాప్ లో పెట్టుబడులు పెట్టండి.. మీ సొమ్ము నెల రోజుల్లోనే రెట్టింపు అవుతోంది' అని నమ్మించారు. కోట్లాది రూపాయలు పెట్టాక వెంటనే బోర్డు తిప్పేశారు. ఎన్టీఆర్ జిల్లాలో ఎనర్జీ మైనింగ్ అనే యాప్ దోపిడీ బయటపడింది. కంచికచర్ల మండలంలో 1200 మంది నుంచి 4 కోట్ల రూపాయలు వసూలు చేశారు. పెండ్యాలతో పాటు హైదరాబాద్, విజయవాడకు చెందిన పలువురితోఆన్ లైన్ యాప్ లో నగదు జమ చేయించి డబ్బు దోచేశారు.తమ యాప్లో కొత్తగా ఎవరినైనా చేర్పిస్తే ఏసీలు, వాషింగ్ మిషన్లు, రిఫ్రిజరేటర్లు, ఖరీదైన సెల్ ఫోన్లు, విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు బహుమతిగా వస్తాయని నిర్వాహకులు ప్రకటనలు ఇచ్చి అమాయకులను ఆకట్టుకున్నారు. అది నమ్మిన పలువురు ఇళ్లు, ఇంటి స్థలాలు, బంగారం, బైక్లు సైతం తాకట్టు పెట్టి ఆన్లైన్లో నగదు కుమ్మరించారు. తెలిసిన వాళ్లను, బంధువులను యాప్లో సభ్యులుగా చేర్పించారు. ఇంకేముంది కేటుగాళ్లు సులువుగా రూ.కోట్లలో పెట్టుబడులు పెట్టించి బోర్డు తిప్పేశారు.
cyber crime News: "నెల రోజుల్లో.. మీ పెట్టుబడి రెట్టింపు.." వెలుగులోకి 4 కోట్ల సైబర్ మోసం - డిజిటల్ ఎనర్జీ మైనింగ్
Huge cyber crime in NTR district: ఎన్టీఆర్ జిల్లాలో భారీ సైబర్ క్రైం వెలుగు చూసింది. పెట్టుబడి రెట్టింపవుతుందని నమ్మించిన యాప్ నిర్వాహకులు.. చివరికి రూ.4కోట్ల వరకు మోసానికి పాల్పడ్డారు. దీంతో సుమారు 1200మంది బాధితులు ఏం చేయాలో తెలియక ఆందోళనకు గురవుతున్నారు. బహుమతులు, కమీషన్లు ఎరవేయడంతో ఎక్కువ మంది తాము చేరడంతో పాటు బంధువులు, స్నేహితులను ఈ యాప్లో చేర్పించినట్లు తెలుస్తోంది.
బలహీనతలను అవకాశంగా మలుచుకుని..యాప్ ల పేరుతో సైబర్ నేరస్తులు అమాయకులను దోచేస్తున్నారు. ప్రజల్లో ఉన్న ఆశను అవకాశంగా మార్చుకొని కోట్ల రూపాయల్లో నగదు దోచుకుంటున్నారు. తాజాగా ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం పెండ్యాలలో వెలుగు చూసిన సంఘటనే ఇందుకు నిదర్శనం. డిజిటల్ ఎనర్జీ మైనింగ్ అనే యాప్ను రెండు నెలల క్రితం ప్రారంభించారు. పెండ్యాలలోనే 1200 మంది వరకూ యాప్లో పెట్టుబడులు పెట్టి నష్టపోయారు.తొలుత చండీగఢ్ నుంచి వచ్చిన ఈ యాప్లింక్ పెండ్యాల అంతటా విస్తరించింది. పెట్టుబడి పెట్టిన 72 గంటల తరువాత బ్యాంకు ఖాతాలకు రోజుకు కొంత మొత్తంలో నగదు జమ అవుతుందని ఆశ చూపారు.
డబ్బు చోరీకి గురైందంటూ.. 30 రోజుల్లో నగదు రెట్టింపు అవుతుందని ఆశ చూపడంతో బాధితులు భారీగా పెట్టుబడులు పెట్టగా.. అందులో ఒకరిద్దరి ఖాతాల్లోకి తిరిగి డబ్బు వెనక్కి రావడంతో అందరూ నమ్మేశారు. దీంతో 500 రూపాయలు నుంచి 3లక్షల వరకూ డబ్బు చెల్లించారు. కొత్తవాళ్లు యాప్ ఇన్ స్టాల్ చేస్తే పరిచయం చేసిన వారికి 150 రూపాయలు కమీషన్ చెల్లించారు. జూన్ 15 వరకూ కొందరికి డబ్బులు తిరిగి రాగా ఆ తరువాత నుంచి నిలిచిపోయింది. అనుమానం వచ్చిన బాధితులు సందేశాలు పంపగా యాప్ నిర్వాహకులు ఆన్లైన్లో లేఖ పెట్టారు. ఆ లేఖలో ఆందోళన చెందవద్దంటూ నమ్మించే యత్నం చేశారు. డిజిటల్ ఎనర్జీ మైనింగ్ యాప్ ను సైబర్ నేరగాళ్లులక్ష్యంగా చేసుకుని తమ కంపూటర్ల ద్వారా ప్రయోజనాన్ని పొందేందుకు చూస్తున్నారని చెప్తూ.. నగదు బదిలీలు, బ్యాంకు ఖాతాల సమాచారాన్ని మార్చారు. కాగా, దురదృష్టవశాత్తూ గుర్తించని అనేక ఖాతాలకు నిధులు బదిలీ అయ్యాయని, ఉపసంహరణల కోసం ఉద్దేశించిన నిధులు చోరీకి గురయ్యాయని తెలిపారు. సమస్యను పరిష్కరిస్తామని, త్వరలోనే సంబంధిత ఖాతాల్లో నగదు జమ అవుతుందన్నారు. అప్పు చేసి అధిక మొత్తంలో నగదు వస్తుందని ఆశపడి డబ్బు పెట్టామని తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. తమకు పోలీసులు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. మరో వైపు యాప్ దోపిడీపై తమకు ఎటువంటి ఫిర్యాదు రాలేదని వస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.