ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తప్పుపట్టిన బాటలోనే.. వైసీపీ సర్కార్..! టెండర్లు పిలవకుండానే ప్రాజెక్టుల అప్పగింత - Latest AP News

Allocation of pumped storage projects : ప్రైవేటు సంస్థలకు ప్రాజెక్టులు కేటాయించేటప్పుడు రాష్ట్రానికి కలిగే మేలు ఏంటన్నది బేరీజు వేసుకోవాలి. రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా పారదర్శకతకు పెద్దపీట వేసేలా అన్ని అంశాలనూ పరిగణించాలి. కానీ, పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుల కేటాయింపు విషయంలో ప్రభుత్వం ఇవేమీ పట్టించుకోలేదు. కనీసం టెండర్లు కూడా పిలవకుండా కేవలం నామినేషన్‌పై ప్రభుత్వ పెద్దల సన్నిహితుల చేతికి అప్పగించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలను పట్టించుకోకుండా, రాష్ట్రానికి కలిగే ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోకుండా విలువైన వనరులను తమకు సన్నిహితులైన ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టులు
రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టులు

By

Published : Dec 13, 2022, 11:17 AM IST

Energy projects in Ap : "రైతులు ముందుకు వచ్చి పొలాలు లీజుకు ఇస్తే.. ఎకరానికి 30వేల చొప్పున సంవత్సరానికి నగదు ప్రభుత్వామే చెల్లిస్తుంది. ఈ లీజు గడువు ఎన్ని సంవత్సరాలైన ఉండవచ్చు. వీటిలో సోలార్​, వీండ్​ లాంటి రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజేక్టులు తీసుకువస్తుంది. ఒక ప్రాంతంలో కనీసం 500మెగా వాట్లు విద్యుత్​ ఉత్పత్తి అయ్యే విధంగా దాదాపు 1500 నుంచి 2వేల ఎకరాలు ఉండేలా చూసుకోవాలి" కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం గుమ్మితం తండా సమీపంలో ఇంటిగ్రేటెడ్ గ్రీన్‌కో సంస్థ ఏర్పాటు చేసిన రెన్యువబుల్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్టు శంకుస్థాపన సందర్భంగా సీఎం జగన్‌ చేసిన వ్యాఖ్యలివి. ఎస్‌ఐపీబీ సమావేశంలో పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపిన సందర్భంలోనూ సీఎం ఇలాంటి ఉపన్యాసమే ఇచ్చారు. సుమారు 17,000 మెగావాట్ల పంప్‌డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టులు, సౌర, పవన విద్యుత్‌ ప్రాజెక్టుల ఏర్పాటు వల్ల 81,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని సీఎం జగన్‌ పేర్కొన్నారు. అయితే ‘గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టుల’ పేరుతో సుమారు 70 వేల ఎకరాల భూముల్ని, నీరు వంటి ప్రకృతి వనరుల్ని ప్రైవేటు సంస్థలకు.. అందులోనూ తమకు కావలసినవాళ్లకు కట్టబెడుతోంది జగన్‌ ప్రభుత్వం. అంత విలువైన వనరుల్ని ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టేటప్పుడు.. గరిష్ఠ ఆర్థిక ప్రయోజనాలు చేకూరేలా చూడాల్సిన బాధ్యతను ప్రభుత్వం విస్మరించింది. పైగా ఆ ప్రాజెక్టుల్లో 86.21 శాతం వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వియ్యంకుడికి చెందిన అరబిందో సంస్థకు, అధికార పార్టీ ముఖ్య నాయకులకు అత్యంత సన్నిహితుడైన వైఎస్సార్‌ జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్తకు చెందిన సంస్థలు, అదానీ సంస్థలకే కట్టబెట్టడం విశేషం.

పెట్టుబడులు వస్తే మంచిదే, ఎవరు కాదంటారు? కానీ వాటి వల్ల ఎవరికి ఎక్కువ ప్రయోజనం కలుగుతోంది? ప్రభుత్వ భూమి, నీరు వంటి విలువైన వనరుల్ని వాడుకుంటూ.. ప్రైవేటు సంస్థలు ఏటా రూ.వేల కోట్ల ఆదాయం గడిస్తూ, ప్రభుత్వానికి పన్నుల రూపంలో నామమాత్రపు సొమ్ము మాత్రమే చెల్లిస్తే ఏపీ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చేయడం ఎలా సాధ్యమవుతుంది? పీఎస్‌పీ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆసక్తి చూపిన కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ నేషనల్‌ హైడ్రోపవర్‌ కార్పొరేషన్‌ను కాదని, ఏపీ జెన్‌కోను పక్కన పెట్టి.. ఎలాంటి టెండర్లూ పిలవకుండా అస్మదీయుల సంస్థలకు నామినేషన్‌ ప్రాతిపదికన ప్రాజెక్టులు కట్టబెట్టడాన్ని ఏమనాలి? వాటిలో ఉత్పత్తయ్యే విద్యుత్‌లో కొంత మొత్తం ఏపీకే కేటాయించాలని, అది కూడా తక్కువ ధరకే ఇవ్వాలన్న నిబంధన ఎందుకు పెట్టలేదు? ఏపీకి ఉపయోగపడే షరతులేవీ లేకుండా.. పెట్టుబడిదారులకు వేల కోట్లు గడించి పెట్టే ప్రాజెక్టులతో ఏం ప్రయోజనం? ప్రాజెక్టుల కేటాయింపులో గత టీడీపీ ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టి.. ఇప్పుడు ఆ బాటలోనే వైసీపీ కూడా నామినేషన్‌ విధానాన్నే ఎంచుకుందంటే ఏమనాలి? ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు విద్యుత్‌రంగ నిపుణులతోపాటు, విపక్షాల నుంచీ వెల్లువెత్తుతున్నాయి.

29 పీఎస్‌పీల ఏర్పాటుకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక డీపీఆర్​ తయారు చేయడానికి కన్సల్టెన్సీ సంస్థ ఎంపికకు ఈ-టెండర్‌ పిలిచిన ప్రభుత్వం.. ప్రాజెక్టుల్ని మాత్రం నామినేషన్‌పై కట్టబెట్టడం విడ్డూరం. రెండు మెగావాట్ల మినీ హైడల్‌ ప్రాజెక్టులకే నెడ్‌క్యాప్‌ టెండర్లు పిలిచింది. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలైన సెకి, ఎన్టీపీసీలు కూడా సౌర, పవన విద్యుత్‌ ప్రాజెక్టులను కాంపిటిటివ్‌ బిడ్డింగ్‌ విధానంలోనే కేటాయించాయి. అలాంటిది ప్రైవేటు సంస్థలకు మేలు చేయడానికే పీఎస్‌పీ ప్రాజెక్టుల్ని నామినేషన్‌పై అడ్డగోలుగా ప్రభుత్వం కేటాయించిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవేళ ఆ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఎవరూ ముందుకు రాలేదేమో.. అందుకే నామినేషన్‌ పద్ధతిలో కేటాయించింది అనుకోవడానికీ లేదు. దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ జలవిద్యుత్‌ ప్రాజెక్టుల్ని నిర్వహించే ఎన్‌హెచ్‌పీసీ ఆసక్తి చూపింది. రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థ ఏపీ జెన్‌కో కూడా సంప్రదించింది. టెండర్లు పిలిస్తే.. దేశవ్యాప్తంగా ఉన్న విద్యుత్‌ సంస్థలు పోటీపడేవని, ప్రభుత్వం వాటితో బేరం చేసి.. ఎక్కువ రాయల్టీ చెల్లించేలా, ఏపీకి తక్కువ ధరకు కొంత విద్యుత్‌ కేటాయించేలా షరతులు పెట్టే వెసులుబాటు ఉండేదని నిపుణులు చెబుతున్నారు. కానీ ప్రభుత్వం ఎన్‌హెచ్‌పీసీ, జెన్‌కోలను కాదని.. అదానీకి, అరబిందోకు, వైసీపీ అగ్రనేతలకు అత్యంత సన్నిహితంగా మెలుగుతూ, ఆ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ కీలకమైన విద్యుత్‌ ప్రాజెక్టులన్నీ దక్కించుకుంటున్న వైఎస్సార్‌ జిల్లాకు చెందిన షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌కు, దాని అనుబంధ సంస్థ ఇండోసోల్‌ సోలార్‌ కంపెనీకి మెజార్టీ పీఎస్పీ ప్రాజెక్టుల్ని ప్రభుత్వం దొడ్డిదారిన కట్టబెట్టింది.

ఇటీవల వ్యవసాయ మోటర్లకు స్మార్ట్‌ మీటర్ల కాంట్రాక్ట్‌ను కూడా రెండు డిస్కంల పరిధిలో షిర్డీసాయి సంస్థకే కట్టబెట్టే ప్రయత్నం జరిగింది. అది వివాదాస్పదం కావడంతో ప్రభుత్వం ఆ టెండర్లను రద్దు చేసింది. ప్రస్తుతం కీలకమైన విద్యుత్‌ ప్రాజెక్టు ఏదైనా.. షిర్డీసాయి వద్దనుకుంటే తప్ప మరొకరికి వెళ్లదన్నంతగా వైసీపీ ప్రభుత్వంలో ఆ సంస్థ హవా నడుస్తోంది. కడప నగరాన్ని ఆనుకుని గతంలో ఐటీ ఆర్థిక మండలి కోసం కేటాయించిన అత్యంత విలువైన 49.8 ఎకరాల భూముల్ని ఆ సంస్థకే జగన్‌ ప్రభుత్వం తక్కువ ధరకు కట్టబెట్టింది. ఇప్పటి వరకు ప్రభుత్వం ఆమోదం తెలిపిన 13,050 మెగావాట్‌ల పీఎస్‌పీ ప్రాజెక్టుల్లో అస్మదీయుల కంపెనీలైన అదానీ సంస్థకు 40.61 శాతం, షిర్డిసాయి ఎలక్ట్రికల్స్‌కు 16.10 శాతం, దాని అనుబంధ సంస్థ ఇండోసోల్‌కు 17.24 శాతం, అరబిందోకు 12.26 శాతం కట్టబెట్టింది. షిర్డీసాయి, దాని అనుబంధ సంస్థ ఇండోసోల్‌కి కలిపి మూడో వంతు ప్రాజెక్టుల్ని కట్టబెట్టింది. ఆస్తా గ్రీన్‌ ఎనర్జీస్‌ అనే సంస్థకు 13.79 శాతం ప్రాజెక్టులను ఇచ్చింది.

గతంలో టీడీపీ ప్రభుత్వం గ్రీన్‌కో సంస్థకు 1,680 మెగావాట్ల పీఎస్‌పీ ప్రాజెక్టును నామినేషన్‌ విధానంలోనే కట్టబెట్టింది. దీనిని అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ తప్పుపట్టింది. విచిత్రంగా ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం కూడా అదే బాటలో వెళ్తోంది. టీడీపీ ప్రభుత్వం నామినేషన్‌ విధానంలోనే అయినా బయటి వ్యక్తులకు ప్రాజెక్టు కట్టబెట్టింది. వైసీపీ ప్రభుత్వం మాత్రం అధికార పార్టీ అగ్రనేతల బంధువర్గానికి, అస్మదీయులకు ప్రాజెక్టులు పంచేసింది. పీఎస్పీలను నామినేషన్‌పై ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టిన ప్రభుత్వం.. వాటి నుంచి వచ్చే విద్యుత్‌లో కొంత ఏపీకి కేటాయించేలా ఒప్పందం చేసుకోవాలన్న షరతేమీ పెట్టలేదు. ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను మొదటి ప్రాధాన్యత కింద రాష్ట్ర ప్రభుత్వం కోరితే ఇవ్వాలని, లేకపోతే బయటి రాష్ట్రాలకు విక్రయించుకోవచ్చని వెలుసుబాటు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ కొనాలంటే.. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యేలోగా పీపీఏలు కుదుర్చుకోవాలి. లేని పక్షంలో 25 ఏళ్లపాటు పీఎస్పీల్లో ఉత్పత్తయ్యే విద్యుత్‌లో ఏపీకి ఒక్క యూనిట్‌ కూడా లభించదు. అలాంటప్పుడు కొన్ని వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి చేసే ప్రాజెక్టులు ఉన్నప్పటికీ ఒనగూరే ప్రయోజనమేంటి? పైగా పీఎస్పీ ప్రాజెక్టులంటేనే పీక్‌ డిమాండ్‌ సమయంలో విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఆ సమయంలో డిస్కంలు బయటి నుంచి విద్యుత్‌ కొనాలంటే భారీ మొత్తం వెచ్చించాల్సి ఉంటుంది. డిమాండ్‌ మరీ ఎక్కువగా ఉంటే ఒక్కోసారి యూనిట్‌ విద్యుత్‌ను 20 రూపాయలు కూడా వెచ్చించి కొనాల్సి వస్తుంది. మన దగ్గర ఏర్పాటయ్యే పీఎస్‌పీ ప్రాజెక్టుల్లో ఉత్పత్తయ్యేదానిలో నిర్దిష్టంగా కొంత శాతం విద్యుత్‌ను తక్కువ ధరకు రాష్ట్రానికి కేటాయించాలన్న షరతు పెడితే.. పీక్‌ డిమాండ్‌ సమయంలో చాలా వెసులుబాటు దొరుకుతుంది. డిస్కంలపై ఆర్థిక భారం తగ్గుతుంది.

పీఎస్​పీ ప్రాజెక్టులను రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చేసే మంత్రదండంలా సీఎం జగన్‌ అభివర్ణించారు. కానీ విద్యుత్ రంగ నిపుణులు మాత్రం వాటివల్ల ఏపీకి వచ్చే ఆర్థిక ప్రయోజనం పెద్దగా ఉండదని పెదవి విరుస్తున్నారు. వారి విశ్లేషణ ప్రకారం. పీఎస్పీ ప్రాజెక్టు ఏర్పాటుకు ఒక్కో మెగావాట్‌కు సగటున 5 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. 12 శాతం జీఎస్టీ చొప్పున ఒక్కో మెగావాట్‌కు 60 లక్షలు ఆ సంస్థలు ఒక్కసారి మాత్రమే ప్రభుత్వానికి చెల్లిస్తాయి. విద్యుదుత్పత్తి ప్రారంభించినప్పటి నుంచి ఒక్కో మెగావాట్‌కు ఏడాదికి లక్ష చొప్పున రాయల్టీ చెల్లిస్తాయి. ప్రాజెక్టు జీవితకాలం 25 ఏళ్లు అనుకుంటే జీఎస్టీతో కలిపి ఒక్కో మెగావాట్‌కు ప్రైవేటు సంస్థలు ప్రభుత్వానికి చెల్లించే మొత్తం 85 లక్షలు మాత్రమే. ఆ లెక్కన నెలకు వచ్చే ఆదాయం 28వేల 333 రూపాయలు. ఏడాదికి 3.4 లక్షల రూపాయలు. వెయ్యి మెగావాట్ల ప్రాజెక్టు ఏర్పాటుకు అనుమతిస్తే ప్రభుత్వానికి ఏటా వచ్చే ఆదాయం 34 కోట్లు. ఈ లెక్కన పాతికేళ్లలో 850 కోట్ల రూపాయలు మాత్రమే ఆదాయం వస్తుంది. ప్రాజెక్టుల ఏర్పాటుకు సుమారు 70 వేల ఎకరాల భూములు, నీరు వంటి ప్రకృతి వనరుల్ని కట్టబెడుతున్నప్పుడు ఏపీకి చేకూరే ఆర్థిక ప్రయోజనం అంతేనా అన్నది నిపుణుల ప్రశ్న. ఈ ఆదాయంతో పోలిస్తే 5-7 రెట్లు ప్రైవేటు సంస్థలకు వచ్చే అవకాశం ఉందని నిపుణుల అంచనా. ఈ ప్రాజెక్టుల్లో కొన్నింటిని జెన్‌కోకు కేటాయించినా నష్టాల నుంచి సంస్థ గట్టెక్కుతుందని చెబుతున్నారు. అంతేకాకుండా ప్రభుత్వరంగ సంస్థ నిర్వహణలో కొన్ని పీఎస్​పీ ప్రాజెక్టులు ఉంటే విద్యుతంగం ప్రైవేటు చేతిలోకి వెళ్లకుండా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. పీఎస్పీ ప్రాజెక్టులు ఏర్పాటు చేసే సంస్థలు రైతులకు ఎకరానికి ఏడాదికి 30 వేల రూపాయల చొప్పున లీజు చెల్లిస్తాయి. అదొక్కటే రైతులకు కొంత వరకు ఉపయోగపడుతుంది.

పీఎస్‌పీల ఏర్పాటుకు 29 అనువైన ప్రాంతాలున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ నూతన పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ. ఎన్​ఆర్​ఈడీసీఏపీ గుర్తించింది. వాటిలో మొదట 16 ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్‌లు సిద్ధం చేసేందుకు ఇ-టెండర్‌ విధానంలో కన్సల్టెన్సీ సంస్థను ఎంపిక చేసింది. డీపీఆర్‌ సిద్ధం చేసేందుకు, ఆ తర్వాత పర్యావరణ, అటవీ, ఇతర అనుమతులు రావడానికి ఒకటి, రెండేళ్లు పడుతుందని అంచనా. అప్పటి నుంచి ఆరేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేయాలన్న షరతుతో, ఫీజిబిలిటీ నివేదిక ఆధారంగా.. ఎన్ని మెగావాట్ల విద్యుదుత్పత్తికి అవకాశం ఉందన్న అంచనాలు ఆధారంగా వివిధ ప్రైవేటు సంస్థలకు ప్రభుత్వం పీఎస్‌పీ ప్రాజెక్టులు కేటాయించింది. అయితే.. ఎన్‌హెచ్‌పీసీ లాభాల్లో వాటా ఇస్తామని చెప్పినా.. ఏటా నామమాత్రపు రాయల్టీ చెల్లించేలా ప్రైవేటు సంస్థలకు పీఎస్‌పీ ప్రాజెక్టులు కట్టబెట్టడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

పీఎస్‌పీ ప్రాజెక్టుకు ఎగువ, దిగువ రెండు రిజర్వాయర్లు ఉంటాయి. పగటి వేళల్లో దిగువ రిజర్వాయర్‌లో ఉన్న నీటిని అందుబాటులో ఉన్న సౌర, పవన విద్యుత్‌ వినియోగించి ఎగువ రిజర్వాయర్‌కు మోటార్ల ద్వారా ఎత్తి పోస్తారు. పీక్‌ డిమాండ్‌ సమయంలో ఎగువ రిజర్వాయర్‌లో ఉన్న నీటిని వినియోగించి విద్యుత్‌ ఉత్పత్తి చేస్తారు. ఈ ప్రాజెక్టు ద్వారా అత్యవసర సమయాల్లో 5 నుంచి 10 నిమిషాల్లో విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతుంది. ఈ ప్రాజెక్టులు గ్రిడ్‌ బేస్‌లోడ్‌ నిర్వహణకు ఉపయోగపడతాయి. పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో ప్రభుత్వం ఆమోదించిన హరిత ఇంధన ప్రాజెక్టుల జాబితా పెద్దగానే ఉంది. వైఎస్‌ఆర్‌ జిల్లా వొంగిమల్ల వద్ద 1800 మెగావాట్ల సామర్థ్యంలో 8వేల 240 కోట్ల వ్యయ అంచనాతో ఆస్తా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్‌ సంస్థ ప్రాజెక్టు ఏర్పాటు చేయనుంది. వైఎస్‌ఆర్‌ జిల్లా సోమశిల, అల్లూరి జిల్లా ఎర్రవరం వద్ద నిర్మించే ప్రాజెక్టులను షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ సంస్థకు అప్పగిస్తూ ఆమోదం తెలిపింది. నంద్యాల జిల్లా అవుకు, అనంతపురం జిల్లా శింగనమల వద్ద నిర్మించే ప్రాజెక్టులను అరబిందో సంస్థ చేపట్టనుంది. వైఎస్‌ఆర్‌ జిల్లా పైడిపాలెం వద్ద చేపట్టే ప్రాజెక్టులను షిర్డిసాయి ఎలక్ట్రికల్స్ అనుబంధ సంస్థ అయిన ఇండోసోల్ సోలార్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు కేటాయిస్తూ ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది. ఇక గత ఏడాది మేలో దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులోనూ 3వేల 700 మెగావాట్ల సామర్థ్యం ఉన్న నాలుగు పీఎస్​పీ ప్రాజెక్టుల ఏర్పాటుకు అదానీ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. వైఎస్‌ఆర్‌ జిల్లా గండికోట ప్రాజెక్టును అదానీ గ్రీన్‌ ఎనర్జీ సంస్థ.. సత్యసాయి జిల్లా చిత్రావతి, పార్వతీపురం మన్యం జిల్లా కురుకుర్తి, కర్రివలస వద్ద ప్రాజెక్టులను అదానీ ఎనర్జీ సంస్థ ఏర్పాటు చేయనున్నాయి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details