CPM leader BV Raghavu fires on YSRCP government: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. సీపీఎం నాయకులు జూన్ 20వ తేదీ నుంచి 'పోలవరం నిర్వాసితుల పోరుకేక' పేరుతో అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం నెల్లిపాక గ్రామం నుండి మహా పాదయాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే. పాదయాత్ర ప్రారంభమైన రోజు నుంచి నేటిదాకా సీపీఎం నాయకులు పలు జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహించి.. రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. నేటితో పోరుకేక మహా పాదయాత్ర 14 రోజులు పూర్తి చేసుకుని 15వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా విజయవాడలో పోలవరం నిర్వాసితుల మహా పాదయాత్ర ముగింపు సభను ఏర్పాటు చేశారు. సభలో పాల్గొన్న నేతలు.. నిర్వాసితుల సమస్యలు పరిష్కరించకుంటే భవిష్యత్తులో ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
సీఎం జగన్ సాధించిందేమీ లేదు.. పోలవరం నిర్వాసితుల పరిష్కారమే ధ్యేయంగా సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన పోలవరం పోరుకేక పాదయాత్ర విజయవాడలో నిర్వహించిన నేటి మహా సభతో ముగిసింది. గత నెల 20న అల్లూరి సీతారామరాజు జిల్లా నెల్లిపాక నుంచి ప్రారంభమైన ఈ యాత్ర.. మొత్తం 96 నిర్వాసిత గ్రామాల మీదుగా 380 కిలోమీటర్ల దూరం సాగింది. ఈ సందర్భంగా ఈరోజు విజయవాడలో ఏర్పాటు చేసిన మహాసభకు ముఖ్య అతిథిగా సీపీఎం సీనియర్ నేత రాఘవులు హాజరయ్యారు. దశాబ్దాల పాటు ప్రాజెక్టు నిర్మాణంలో ఆలస్యానికి కారకులెవరని రాఘవులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన నిధులు కేటాయించకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. దిల్లీకి విజయవాడకు తిరుగుతూ.. గత నాలుగేళ్లుగా కేంద్రం అడుగులకు మడుగులొత్తుతూ సీఎం జగన్ సాధించిందేమీ లేదని ఎద్దేవా చేశారు. పోలవరం డిజైన్‌లోనే అనేక లోపాలున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరాపు ఆరోపించారు.
ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తాం..సీపీఎం సీనియర్ నేత రాఘవులు మాట్లాడుతూ..''పోలవరం నిర్వాసితుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు పోలవరం పోరుకేక మహాపాదయాత్రను ప్రారంభించాం. నిర్వాసితుల సమస్య పూర్తయితేనే పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది. ప్రాజెక్టు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయి. విజయవాడలో ఈరోజు నిర్వహించిన మహాధర్న సాక్షిగా చెప్తున్నాం.. నిర్వాసితుల సమస్యలు పరిష్కరించకుంటే.. సమర శంఖారావం పూరిస్తాం. 15 రోజుల్లో నిర్వాసితుల సమస్యలను పరిష్కరించకుంటే భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తాం.'' అని ఆయన అన్నారు.