Special status for AP : రాష్ట్ర విభజన చట్టాన్ని లోక్‌సభలో ఆమోదించి నేటికీ 9 సంవత్సరాలు గడిచాయని నేటి వరకు విభజన చట్టంలోని అంశాలను అమలు చేయకపోవడం దుర్మార్గం అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలను అమలు చేయాలనీ డిమాండ్ చేస్తూ.. విజయవాడలో చేపట్టిన సమర యాత్రలో పాల్గొన్న విద్యార్థి నాయకులతో సమావేశం నిర్వహించారు. విభజిత ఆంధ్రప్రదేశ్‌కు నేడు ఒక దుర్దినమని అన్నారు. విభజన హామీలు అమలు చేయకపోయినా.. రాష్ట్ర ప్రభుత్వం,ఎంపీలు ఏమీ పట్టనట్లు ఉంటున్నారే కానీ ప్రశ్నించడంలేదని మండిపడ్డారు. ఇప్పటికైనా కేంద్రాన్ని ప్రశ్నించకపోతే ఎంపీల ఇళ్లను ముట్టడిస్తామన్నారు. మోడీ, జగన్ రాష్ట్ర హామీల విషయంలో క్విడ్ ప్రోకోకి పాల్పడుతున్నారని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు చేసిన ద్రోహాన్ని ప్రతి రాష్ట్రానికి వెళ్లి ప్రచారం చేస్తామని.. ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ అన్నారు.. వచ్చే నెలలోపు రాష్ట్ర ప్రభుత్వం విభజన హామీల అమలు, హోదా సాధనపై స్పష్టమైన వైఖరి చెప్పాలి.. లేదంటే చలో అసెంబ్లీ కార్యక్రమం చేపడతామని తెలిపారు. వైసీపీ నాయకులు ఎంతసేపు ప్రతిపక్ష నాయకులను, వారి కుటుంబ సభ్యులను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు.. తప్ప రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నాయకులు రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి రావాలని అన్నారు.