CPI Narayana and Ramakrishna sensational comments on party alliances: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024లో జరగబోయే సాధారణ ఎన్నికలకు సంబంధించి.. సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ, రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణలు సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ), తెలుగుదేశం పార్టీ (టీడీపీ), జనసేన పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ)కే లాభం చేకూరుతుందని వ్యాఖ్యానించారు. భారతీయ జనతా పార్టీ వ్యతిరేక ఓటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకీ పడటంతో.. మళ్లీ వైఎస్ జగనే విజయం సాధించే అవకాశం మెండుగా ఉంటుందన్నారు. రాబోయే ఎన్నికల్లో మరోసారి గెలించేందుకే ముచ్చటగా మూడోసారి మచిలీపట్నం పోర్టుకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారని ఎద్దేవా చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీ పొత్తులపై సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ, రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణలు వారి వారి అభిప్రాయాలను వెల్లడించారు. విజయవాడలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ముందుగా సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ మీడియాతో మాట్లాడుతూ..''రాబోయే ఎన్నికల్లో బీజేపీ, టీీడీపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తే అది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే లాభం చేకూర్చినట్టు అవుతుంది. ఈ కూటమి వచ్చినా రాష్ట్రంలో ఎటువంటి లాభం ఉండదు. బీజేపీ వ్యతిరేక ఓటు వైసీపీకి పడుతుంది.. అప్పుడు మళ్లీ జగనే గెలుస్తారు'' అని ఆయన అన్నారు.