AP Wide Agitations due to Gas Cylinder Price Hike : పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని కోరుతూ సీపీఐ, సీపీఎంలతో పాటు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఆందోళనలు చెలరేగాయి. పెంచిన ధరలను కేంద్రం వెంటనే తగ్గించాలని వామపక్షాలతో పాటు, ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. పెంచిన గ్యాస్ ధరలు ప్రజలకు భారంగా మారాయని పెర్కోన్నాయి.
ఎన్టీఆర్ జిల్లాలో ఆందోళన :పెంచిన గ్యాస్ ధరలను నిరసిస్తూ జిల్లాలో సీపీఎం అధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. గ్యాస్ ధరల పెంపకాన్ని నిరసిస్తూ నందిగామలోని గాంధీ సెంటర్లో ధర్నా నిర్వహించారు. సీపీఎం డివిజన్ కార్యదర్శి జిల్లా కౌలు రైతు సంఘం అధ్యక్షుడు చనుమోలు సైదులు, జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షుడు ఖాసింలు మాట్లాడుతూ.. పెంచిన గ్యాస్ ధరలను కేంద్ర ప్రభుత్వం తగ్గించాలని డిమాండ్ చేశారు.
గ్యాస్ ధరలను పెంచటం వల్ల సామాన్యులకు అందుబాటులో లేకుండా పోతోందని అన్నారు. గ్యాస్ ధరలను కేంద్రం తగ్గించకపోతే.. ప్రభుత్వాన్ని గద్దె దించుతామని హెచ్చరించారు. పెట్రోల్, డీజిల్ ధరలను కూడా కేంద్ర ప్రభుత్వం అధికంగా పెంచిందని.. ఇలా ప్రతి వస్తువు ధరలు పెంచుకుంటూ పోతే సామన్యులు జీవించటం ఎలా అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ అధికారం చేపట్టిన తర్వాత.. గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్ ధర దాదాపు 800 రూపాయల వరకు పెంచారని అన్నారు.