CPI 30 Hours Nirasana Deeksha Updates: ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న కరవు సమస్య, కృష్ణా జలాల పునఃపంపిణీ, కేంద్ర ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్‌లపై.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ చేపట్టిన '30 గంటల నిరసన దీక్ష'కు వివిధ పార్టీల నాయకులు సంఘీభావం తెలిపారు. కృష్ణా జలాల పంపిణీ విషయంలో కేంద్రం అన్యాయం చేస్తే, రాష్ట్రంలోని రైతులకు వైసీపీ ప్రభుత్వం అన్యాయం చేసిందని ధ్వజమెత్తారు. 440కి పైగా మండలాల్లో కరవుతో రైతులు అల్లాడిపోతుంటే..సీఎం జగన్ పట్టించుకోవటంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి.. 440 మండలాలను కరవు ప్రాంతాలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
CPI Ramakrishna Deeksha:రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితులపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఈ నెల 20, 21 తేదీల్లో 30 గంటల పాటు విజయవాడలో నిరసన దీక్ష చేపట్టారు. నేటి నిరసన దీక్షకు.. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, టీడీపీ నేతలు, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ మంత్రి వడ్డే శోభానాద్రీశ్వరరావు సంఘీభావం తెలిపారు.
కరవుపై స్పందించని సీఎం, మంత్రిమండలి ప్రజలకు అవసరమా?: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
CPI Ramakrishna Comments: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ..''రాష్ట్రంలో కరవు తాండవిస్తుంటే, దాని తీవ్రతను తక్కువ చేసి, ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతున్నారు. 440పైగా మండలాల్లో కరవు ఉంటే.. జగన్ ప్రభుత్వం కేవలం 7 జిల్లాలు 103 మండలాల్లో మాత్రమే కరవు ఉందని ప్రకటించింది. అంటే.. వ్యవసాయంపై ముఖ్యమంత్రికి అవగాహన లేదన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితులపై నియోజకవర్గ స్థాయి నుంచి ఆందోళనలు చేపడతాం. రైతుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం చేస్తాం.'' అని ఆయన అన్నారు.
Devineni Uma Comments: సీఎం జగన్ నిర్లక్ష్యంతోనే రాష్ట్రంలో కరవు పరిస్థితులు దాపురించాయని.. దేవినేని ఉమ ఆరోపించారు. సీఎం జగన్‌కు వ్యవసాయం పట్ల అవగాహన లేదని దుయ్యబట్టారు. తక్షణమే 444 మండలాలను కరవు మండలాలుగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. విభజన హామీలపై కేంద్రంపై ఒత్తిడి తేవడంలో జగన్ విఫలమయ్యారన్న దేవినేని.. పోలవరం ప్రాజెక్టు పూర్తిచేయడంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. కరవు పరిస్థితిపై అన్ని పార్టీలతో కలిసి పోరాడతామని హెచ్చరించారు.