Husband And Wife Suicide: వారిది అందమైన చిన్న కుటుంబం. చింతలేని కుటుంబం.. సంతోషంగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అతను తాపీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇద్దరు మగ పిల్లలు. ఒకరు పదో తరగతి, మరోకరు 8వ తరగతి చదువుతున్నారు. ఏమైందో తెలియదు గానీ హాయిగా సాగుతున్న జీవితంలో పెను విషాదం నెలకొంది. తల్లిదండ్రులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో పిల్లలిద్దరూ అనాథలయ్యారు. ఈ విషాద ఘటన ఎన్టీఆర్ జిల్లాలో చోటు చేసుకుంది.
మధిర మండల పరిధిలోని మాటూరు విద్యానగర్ కాలనీకి చెందిన పుట్టా నాగేశ్వరరావు, శ్రీకళ దంపతులిద్దరూ గత కొంతకాలంగా నందిగామ మండలం అనాసాగరంలో నివాసం ఉంటున్నారు. ఇరువురూ మంగళవారం వత్సవాయి మండలం వేములనరం గ్రామం వద్ద గల సుబాబుల్ తోటలోకి వెళ్లి శీతల పానీయంలో పురుగుమందు కలుపుకొని తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. విషయం బుధవారం వెలుగులోకి వచ్చింది. బుధవారమే నందిగామ పోలీస్ స్టేషన్లో వీరిపై మిస్సింగ్ కేసు నమోదయినట్లు పోలీసులు గుర్తించారు. వారిద్దరూ ఏ కారణంతో ఆత్మహత్య చేసుకున్నారో తెలియరాలేదు.