ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గ్రామ, వార్డు సచివాలయాల్లో లంచాల పర్వం...పైకం చెల్లిస్తేనే పౌర సేవలు..! - పైకం చెల్లిస్తేనే పౌర సేవలు

village and ward secretariat system: గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థలో ముడుపుల పర్వం జోరుగా సాగుతోంది. పైకం చెల్లిస్తే తప్ప ప్రజలకు పౌర సేవలు అందడం లేదు. వివిధ ప్రభుత్వశాఖల అధికారులతో కలిసి సచివాలయాల ఉద్యోగులు లంచాలు వసూలు చేస్తున్నారు. ప్రజల ఇళ్లవద్దే సేవలను అందించే, అవినీతికి ఆస్కారం లేని వ్యవస్థను దేశంలోనే తొలిసారి ప్రారంభించామని సీఎం జగన్‌ నుంచి మంత్రుల వరకు ప్రతి సభలోనూ చెబుతున్నారు. క్షేత్ర స్థాయిలో అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి.

village and ward secretariat system
లంచాల పర్వం

By

Published : Nov 30, 2022, 9:36 AM IST

corruption in village and ward secretariat system: 3,648 కిలోమీటర్ల పాదయాత్రలో గ్రామాల్లో పరిస్థితులను దగ్గరుండి గమనించా. రేషన్‌ కార్డు, ఇల్లు... చివరకు మరుగుదొడ్డి కావాలన్నా లంచం ఇవ్వందే ఏ పనీ జరగని పరిస్థితిని స్వయంగా నా కళ్లతోనే చూశా. ఇదివరకు మాదిరిగా ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన పని లేదు. మన ప్రభుత్వంలో అలా జరగకూడదని సచివాలయాల వ్యవస్థను తీసుకొచ్చాం. 35 శాఖలకు చెందిన దాదాపు 500 సేవలను ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వు కనిపించేలా అందిస్తామని గర్వంగా చెబుతున్నా. ఉద్యోగులెవరైనా లంచాలు అడిగితే ఒక్క ఫోన్‌ కాల్‌ చేస్తే చాలు ప్రభుత్వం వెంటనే స్పందిస్తుంది.- 2019 అక్టోబరు 2న గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ ప్రారంభ సభలో సీఎం జగన్‌

ఇదండీ పరిస్థితి..

గుంటూరులో 89వ వార్డు సచివాలయ పరిపాలన కార్యదర్శి షేక్‌ ఆరిఫ్‌ ఈ ఏడాది అక్టోబరు 14న దుర్గానగర్‌కు చెందిన ఎం.నాగభూషణం నుంచి ఆస్తి పన్ను పేరు మార్చడానికి రూ.4వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధకశాఖ (అనిశా) అధికారులకు దొరికారు. అనకాపల్లి జిల్లా నాతవరం మండలం మునగపూడి బెన్నవరం గ్రామ సచివాలయం వీఆర్వో సూర్యనారాయణ వ్యవసాయ భూమి మ్యుటేషన్‌, పాస్‌ పుస్తకం ప్రాసెస్‌ చేసేందుకు ఈ ఏడాది సెప్టెంబరు 28న రైతు శ్రీనివాస్‌రెడ్డి నుంచి రూ.20వేలు లంచం తీసుకుంటూ అనిశాకు చిక్కారు.

గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థలో ముడుపుల పర్వం జోరుగా సాగుతోంది. పైకం చెల్లిస్తే తప్ప ప్రజలకు పౌర సేవలు అందడం లేదు. వివిధ ప్రభుత్వశాఖల అధికారులతో కలిసి సచివాలయాల ఉద్యోగులు లంచాలు వసూలు చేస్తున్నారు. ప్రత్యేకించి పుర, నగరపాలక సంస్థలు, రెవెన్యూశాఖల్లో అక్రమ వసూళ్లు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు అనిశా నమోదు చేసిన కేసుల్లో అత్యధికంగా సచివాలయాల్లో లంచాలకు చెందినవి కావడం గమనార్హం. రాష్ట్రంలోని 15,004 గ్రామ, వార్డు సచివాలయాల్లో వివిధ 540 రకాల సేవలను అందిస్తున్నట్లు ప్రభుత్వం గొప్పగా చెబుతోంది. ప్రజల ఇళ్లవద్దే సేవలను అందించే, అవినీతికి ఆస్కారం లేని వ్యవస్థను దేశంలోనే తొలిసారి ప్రారంభించామని సీఎం జగన్‌ నుంచి మంత్రుల వరకు ప్రతి సభలోనూ చెబుతున్నారు. క్షేత్ర స్థాయిలో అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి.

కుల, నివాస, ఆదాయ, కుటుంబ సభ్యుల ధ్రువపత్రాల నుంచి కొత్త ఇళ్లకు ఆస్తి పన్నులు వేసే వరకు అదనపు సొమ్ములివ్వందే పనులు కావడం లేదు. కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్‌ జిల్లాల్లోని వివిధ గ్రామ, వార్డు సచివాలయాలను ‘ఈటీవీ భారత్’ పరిశీలించగా... కొన్నిచోట్ల ఉద్యోగుల అక్రమ వసూళ్లపై ప్రజలు ఫిర్యాదు చేశారు. సచివాలయాల నుంచి వెళ్లే కొన్ని దరఖాస్తులకు మండల, పురపాలక స్థాయిలో లంచాలిస్తేనే పనులు అవుతున్నాయని వారు ఆరోపించారు.

అక్రమ వసూళ్లు ఇలా: కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రం (ఫ్యామిలీ సర్టిఫికెట్‌) పొందాలంటే కొన్నిచోట్ల రూ.3వేలు, ఇంకొన్ని ప్రాంతాల్లో రూ.5వేల చొప్పున చెల్లించాల్సి వస్తోంది.

* ఇళ్లు, స్థలాలు, భూములకు సంబంధించిన క్రయ విక్రయాలపై రిజిస్ట్రేషన్ల తర్వాత యాజమాన్య హక్కుల కోసం దస్త్రాల్లో పేర్లు మార్పు (మ్యుటేషన్‌) కోసం రూ.20వేల నుంచి రూ.25వేల వరకు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇక్కడ సచివాలయ కార్యదర్శుల ద్వారా రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు (ఆర్‌ఐ) అక్రమ వసూళ్లకు తెరతీస్తున్నారు.

* కొత్త భవన నిర్మాణ అనుమతికి దరఖాస్తు చేసుకుంటే... ఇంటి విస్తీర్ణం, ప్రాంతాన్ని బట్టి రూ.20వేల నుంచి రూ.30వేల వరకు వసూలు చేస్తున్నారు. కొత్త ఇంటికి ఆస్తి పన్ను వేసే క్రమంలోనూ రూ.15వేల నుంచి రూ.20వేల వరకు చెల్లించాలి. ఈ వ్యవహారంలో టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు, మున్సిపల్‌ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లతో సచివాలయ ఉద్యోగులు కుమ్మక్కవుతున్నారు.

తెర వెనుక సర్దుబాటు వ్యవహారం:సచివాలయాలకు ప్రజలు దరఖాస్తు చేసుకోవడానికి వచ్చాక సిస్టంలో ఫీడ్‌ చేస్తారు. అనంతరం దరఖాస్తు సంబంధిత మండల, పురపాలక ఉద్యోగుల లాగిన్‌కు వెళుతుంది. అక్కడ సమాచారం సవ్యంగానే ఉందని భావిస్తే నిజాయతీ ఉన్న ఉద్యోగులు... తదుపరి అధికారి లాగిన్‌కు పంపేస్తున్నారు. వసూళ్లకు పాల్పడే వారైతే... తగిన సమాచారం, సరైన డాక్యుమెంట్లు లేవని కొర్రీలు పెడుతున్నారు. అదనపు మొత్తాలిస్తే నిర్ణీత గడువులోగా ధ్రువపత్రాలు జారీ అవుతున్నాయి. వసూలైన డబ్బులను సంబంధిత మండల, పురపాలక అధికారులు, సచివాలయ ఉద్యోగులు పంచుకుంటున్నారు.

‘వారిని’ కలవాలని నేరుగా సూచనలు:సచివాలయాలకు వచ్చే దరఖాస్తులను సిస్టంలో వెంటనే ఫీడ్‌ చేయడం లేదు. రెవెన్యూశాఖకు సంబంధించి అంశాలైతే ఆర్‌ఐని, ఆస్తి పన్ను, బిల్డింగ్‌ ప్లాన్లు వంటి అంశాలపై బిల్డింగ్‌, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లను, విద్యుత్తు కనెక్షన్లపై అసిస్టెంట్‌ ఇంజినీర్లను కలవాలని సలహాలిస్తున్నారు. బేరం కుదిరినట్లు ఉద్యోగుల నుంచి సమాచారం వచ్చాకే దరఖాస్తులను అప్‌లోడ్‌ చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి.

అదనంగా చెల్లిస్తేనే కుటుంబ ధ్రువపత్రం ఇచ్చారు:‘కుటుంబ ధ్రువపత్రం కోసం ప్రభుత్వం నిర్దేశించిన రుసుములు చెల్లించాక అదనంగా మళ్లీ మరో రూ.3వేలు చెల్లించాల్సి వచ్చింది. అడిగిన డబ్బు సమకూర్చే వరకు ఇదిగో అదిగో అంటూ ఇబ్బంది పెట్టారు. డబ్బులిచ్చిన 24 గంటల్లోనే సర్టిఫికెట్‌ చేతిలో పెట్టారు’ అని కృష్ణా జిల్లా కంకిపాడు మండలానికి చెందిన మహిళ ఒకరు వాపోయారు.

డబ్బులివ్వందే పనులు చేయడం లేదు:‘భవన నిర్మాణ అనుమతుల కోసం అన్ని దస్తావేజులు పక్కాగా అప్‌లోడ్‌ చేయించినా ప్రణాళిక విభాగం ఉద్యోగులు అదనపు డబ్బులు డిమాండు చేస్తున్నారు. ఇవ్వకపోతే తిప్పుకొంటున్నారు. చేసేదిలేక లంచాలిచ్చి పనులు చేయించుకుంటున్నాం’ అని విజయవాడలోని పాత నగరానికి చెందిన వ్యక్తి ఒకరు ఆరోపించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details